తెలంగాణ రాష్ట్ర మంత్రుల ఆదాయపన్నును రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది.2024-25 వ సంవత్సరానికి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదాయపన్ను కింద రూ.1,38,061 చెల్లిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్ర మంత్రుల ఆదాయపన్నులను కూడా ప్రభుత్వమే చెల్లించేందుకు చర్యలు చేపట్టింది. మంత్రుల ఆదాయంపై ప్రభుత్వం ఆదాయపన్ను చెల్లించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రులకు ప్రభుత్వం చెల్లిస్తున్న జీతాలపై రాష్ట్ర ప్రభుత్వమే ఆదాయపన్ను చెల్లిస్తోంది. అలాగే ఈ ఏడాదీ కూడా మంత్రులకు ఐటీ చెల్లిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జీతాలు ఇవ్వడం కాకుండా వారి పన్ను కూడా చెల్లిస్తారా?
సీఎంతోపాటు డిప్యూటీ సీఎం, మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలతో పాటు వారి ఆదాయ పన్నును కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనంతో చెల్లించడంపై పలు అనుమానాలు వ్యక్తఅం అవుతున్నాయి. ఉద్యోగులకు జీతాలు ఇస్తారే కాని, వారి ఆదాయపన్నులను కంపెనీలు చెల్లించవు. ఆదాయ పన్ను అనేది ఎవరికి వారు చెల్లించుకోవాల్సింది కాగా మంత్రులకు ఆదాయ పన్ను చెల్లించడం ఏమిటని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ సోమ శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.
లేఖలు రాసినా ఫలితం లేదు...
ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల జీతభత్యాల చట్టం 1953 సెక్షన్ (3) ప్రకారం ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, కేబినెట్ కహొదా ఉన్న కార్పొరేషన్ చైర్మన్‌లు, సలహాదారుల ఆదాయపు పన్ను ప్రభుత్వమే చెల్లించాలని నిబంధన ఉంది.ఈ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం.పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మంత్రులకు ఆదాయ పన్ను చెల్లించే పద్ధతి ఆపాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖలు రాసినా ఫలితం లేకపోయింది.
సమాచారం ఇవ్వరు
తెలంగాణ మంత్రులకు ఆదాయ పన్ను చెల్లింపులపై సాధారణ పరిపాలన విభాగ కార్యదర్శిని వివరాలు అడిగినా ఆయన సమాచారం ఇవ్వలేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి చెప్పారు.వాటి వివరాలు అడుగగా, అది వ్యక్తిగత సమాచారమని, ఇవ్వడానికి కుదరదని సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శి సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం మంత్రుల ఆదాయ పన్ను చెల్లింపుల కోసం డబ్బు ఖర్చు చేస్తున్నారు.ప్రజా ధనం చెల్లిస్తున్నారు కాబట్టి ప్రతి పౌరుడికి తెలుసుకునే అధికారముంది. ప్రజాధనంతో ముడిపడి ఉన్న విషయం వ్యక్తిగత సమాచారం కాదని, సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరపున సోమవారం లేఖ రాశామని పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.,
తప్పుల తడకలు మంత్రుల ఐటీ చెల్లింపు లెక్కలు
తెలంగాణ సచివాలయంలో ఆదాయపు పన్ను చెల్లింపు లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయి.2014-15 సంవత్సరానికి గాను తెలంగాణ ఏర్పడ్డ తరువాత జూన్ నుంచి ఫిబ్రవరి వరకు 9 నెలలు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ జీతభత్యాలు ఈ విధంగా ఉన్నాయి.జీతం కింద రూ. 16,000,ప్రత్యేక అలవెన్సు రూ.8,000,అతిధుల కోసం ఖర్చు రూ.7,000,సెక్యూరిటి కారు అలవెన్సు రూ. 25,000,సొంత కారు అలవెన్సు రూ.10,000,కారు ఇంధన ఖర్చు రూ.15,000,క్యాంపు ఆఫీసు అలవెన్సు రూ.10,000, నియోజకవర్గ అలవెన్సు రూ. 83,౦౦౦ మొత్తం కలిపి రూ.1,74,000గా చూపించారు. సీఎం జీతంలో మొదటి రెండు అంశాలు అంటే జీతం, ప్రత్యేక అలవెన్సు తప్ప మిగిలిన వాటిని ఆదాయంగా పరిగణించరు. అంటే జీతం, ప్రత్యేక అలవెన్సు కలిపి నెలకు రూ. 24,000 సంవత్సరానికి రూ.2,88,000 మాత్రమే.ఈ ఆదాయంపై ప్రభుత్వం రూ.15,39,111 ఆదాయపు పన్ను చెల్లించింది. అదేవిధంగా జి.ఓ. లో తెలిపిన మిగిలిన వారి ఆదాయపు పన్ను లెక్కలు కూడా సరిగా చేయలేవు.
విచారణ జరపండి
మంత్రుల ఆదాయ పన్ను చెల్లింపు విషయంపై విచారణ జరిపించి ముందు ముందు ఇలాంటి తప్పులు దొర్లకుండా చూడాల్సిన అవసరముందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి చెప్పారు. చాలా రాష్రాల్లో ఈ చట్టాన్ని సవరించి ముఖ్యమంత్రి, మంత్రులు తమ ఆదాయపు పన్ను వారే చెల్లిస్తున్నారు.తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ రాజ్యాంగ విరుద్ధమైన పని జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
మంత్రుల ఆదాయ పన్ను వివరాలు బయటపెట్టండి 2024-25 ఆర్థిక సంవత్సరం ముగింపుకు వస్తున్న సందర్భంలో ఈ సంవత్సరంలో ఎవరెవరి పేర ఎంత ఆదాయపు పన్ను చెల్లించారో ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచాలని యం పద్మనాభరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వ డబ్బుతో ఎవరి ఆదాయపు పన్ను చెల్లించవద్దని ఆర్డర్ పాస్ చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కోరింది.
ఎవరి ఆదాయ పన్ను ప్రభుత్వం చెల్లించిందంటే... మాజీ సీఎం కేసీఆర్ కు 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.15.39 లక్షలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. 2021-22 లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు ఆదాయ పన్ను రూ.5.85 లక్షలు, 2016-17లో అప్పటి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పన్ను రూ. 16.18లక్షలు, 2015-16 లో అప్పటి మంత్రి ఈటెల రాజేందర్ ఆదాయ పన్ను రూ.13.92 లక్షలు, 2015-16లో అప్పటి మంత్రి తలసాని శ్రీనివాసరావు ఇన్ కం ట్యాక్స్ రూ.8.23 లక్షలు, 2016-17లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్యాక్స్ రూ.7.22లక్షలు, 2016-17లో అప్పటి ఎక్సైజ్ శాఖ మత్రి టాక్స్ రూ.15.98 లక్షలు, 2021-22లో అప్పటి కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆదాయ పన్ను కింద రూ.8.85 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనంతో చెల్లించింది.
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ముఖ్యమంత్రి, మంత్రుల ఆదాయపన్నులను ఎవరికీ వారే వ్యక్తిగత డబ్బుతో చెల్లించాలని మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రుల ఆదాయ పన్నులను ప్రభుత్వం చెల్లించే 1972 నాటి నిబంధనను రద్దు చేస్తూ తమ మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానించిందని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మోహన్ యాదవ్ ప్రకటించారు.