తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ పై ప్రజాప్రయోజన వ్యాజ్యం

పదేళ్లు ఫాంహౌస్ సీఎంగా పేరొందిన కేసీఆర్, ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఎర్రవెల్లి ఫాం హౌస్ కే పరిమితమయ్యారు.కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది.;

Update: 2025-02-21 11:06 GMT

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఎక్కువ సమయం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలోనే గడిపారు. దీంతో ఫాం హౌస్ సీఎంగా పేరొందిన కేసీఆర్ ప్రస్థుతం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైనా మళ్లీ ఫాంహౌస్ లోనే మకాం వేశారు.

2023వ సంవత్సరం డిసెంబర్ 16వతేదీన తెలంగాణ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదని తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు డి విజయ్‌పాల్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.కెసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేలా స్పీకరును, స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించాలని డి విజయ్‌పాల్ రెడ్డి హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో కోరారు.

ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ను తప్పించండి
బిఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరుపై తగిన చర్యలు తీసుకోవడంలో స్పీకర్, ఆయన కార్యాలయం విఫలమైందని విజయపాల్ రెడ్డి పేర్కొన్నారు.అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపించడం చాలా అవసరమని, కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా తన విధులను నిర్వర్తించలేకపోతే, ఆయనను ఈ బాధ్యతల నుంచి తప్పించాలని, కొత్త నాయకుడైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును (KTR) నియమించాలని కూడా విజయపాల్ రెడ్డి అభ్యర్థించారు.

కేసీఆర్ కు లీగల్ నోటీసు
తెలంగాణలోని రైతు సంఘం పక్షాన కేసీఆర్ కు లీగల్ నోటీసు పంపించారు. తెలంగాణ ప్రతిపక్ష నాయకుడిగా, గజ్వేలు శాసనసభ్యుడిగా తన విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ చీఫ్ కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు తెలంగాణ రైతు సంఘం గతంలో లీగల్ నోటీసులు పంపింది.తెలంగాణలోని రైతు సంఘం సమాఖ్య నుంచి కేసీఆర్ కు ప్రధాన కార్యదర్శి విజయ్ పాల్ లేఖ రాశారు. కేసీఆర్ ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని ఆయన కోరారు.కేసీఆర్ అసెంబ్లీలో ప్రజల సమస్యలపై పోరాడాలని ఆయన సూచించారు. పిటిషనర్ తరపు న్యాయవాది పి.శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ కు నోటీసు పంపించారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదో వివరణ ఇవ్వాలని లీగల్ నోటీసులో కోరారు.

ఏడాది కాలంలో ఒకే రోజు అలా వచ్చి ఇలా వెళ్లారు..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక, కేసీఆర్ తుంటి ఎముక విరగడంతో ఆపరేషన్ చేయించుకొని ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1వతేదీన చేతి కట్టె సాయంతో అసెంబ్లీకి వచ్చిన స్పీకరు ఛాంబరులో కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసి మళ్లీ ఫాం హౌస్ కే వెళ్లారు. ఏడాది కాలంలో గత ఏడాది జులై 25వతేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అలా వచ్చి ఇలా వఎళ్లి పోయారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతాం అని ప్రకటించిన కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు ఏడాది కాలంగా డుమ్మా కొట్టారు. అసెంబ్లీకి రమ్మని, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రమ్మని సాక్షాత్తూ మంత్రి పొన్నం, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ లు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి ఆహ్వానించినా కేసీఆర్ హాజరు కాలేదు.

గజ్వేలు ప్రజలకు కేసీఆర్ దూరం
గజ్వేలు ప్రజలు కూడా తమ సమస్యలను తమ ఎమ్మెల్యే అయిన కేసీఆర్ కు చెప్పుకుందామంటే ఫామ్ హౌస్ లోనూ సామాన్యులకు ఎంట్రీలేదు. ఇటు గజ్వేలు ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాధనాన్ని జీతంగా తీసకుంటున్న కేసీఆర్ ప్రజా సమస్యలపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడక పోవడం మంచి పద్ధతి కాదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. న్యాయపరంగా అసెంబ్లీ సమావేశాలకు రాకున్నా, చర్య తీసుకోలేరని, గతంలో సచిన్ టెండూల్కర్ రాజ్యసభ ఎంపీగా రెండేళ్లు సమావేశాలకు రాలేదని పద్మనాభరెడ్డి గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాకపోవడం నైతికంగా మంచిది కాదన్నారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, సీఎంగా పనిచేసిన కేసీఆర్ తన అనుభవంతో ప్రజా సమస్యలపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని పద్మనాభరెడ్డి సూచించారు.

ప్రజాస్వామ్యానికి విరుద్ధం : ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు
తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం అని తెలంగాణ విద్యా కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పబ్లిక్ సర్వెంట్ గా ప్రజలకు అందుబాటులో ఉండి అసెంబ్లీలో ప్రజల గొంతుక వినిపించాలని, కానీ ఆయన సమావేశాలకు డుమ్మా కొట్టడం ఏమిటని ప్రశ్నించారు.ప్రజాధనంతో ప్రతిపక్ష నాయకుడిగా జీతం తీసుకుంటూ ప్రజల సమస్యలను పట్టించుకోక పోవడాన్ని ప్రొఫెసర్ తప్పు పట్టారు.ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తన గళాన్ని అసెంబ్లీలో వినిపించాలని, డిబేట్లలో పాల్గొని సూచనలు చేయాలని, ప్రభుత్వ విధానాలు నచ్చక పోతే వాకౌట్ చేయాలని , నిరసన తెలపాలని ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు కోరారు.కాగా హైకోర్టులో పిల్ వేసిన నేపథ్యంలో మార్చి మొదటి వారంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకైనా ప్రతిపక్ష నేత కె చంద్రశేఖర్ రావు హాజరు అవుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News