నీట్ రద్దు చేయండి... హైదరాబాద్ లో ఆందోళన..

నీట్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్ లో నీట్ స్కామ్ కి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

By :  Vanaja
Update: 2024-06-18 09:40 GMT

నీట్ స్కాం పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విద్యార్థుల జీవితంతో ఆడుకోవద్దంటూ విరుచుకుపడుతున్నాయి. మోదీ మౌనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్ లో నీట్ స్కామ్ కి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని హిమాయత్ నగర్ వై జంక్షన్ నుండి లిబర్టీ వరకు స్టూడెంట్ మార్చ్ నిర్వహించారు.

ఏఐఎస్ఎఫ్, ఎన్ ఎస్ యు ఐ, ఎస్ఎఫ్ఐ, పి డి ఎస్ యు, విద్యార్థి జన సమితి, ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం, ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ, పి వై ఎల్ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. నీట్ పేపర్ లీకేజీ పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లీకేజీ తో సంబంధం ఉన్న దోషులను శిక్షించాలని కోరారు. నరేంద్ర మోడీ మౌనం విడాలని, ఎన్డీఏ నేతలు స్పందించాలని నినాదాలు చేశారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ని రద్దు చేయాలని, నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు కోరాయి.

రాజ్ భవన్ ముట్టడి...

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజ్‌కు నిరసనగా బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం నేడు రాజ్‌భవన్‌ ని ముట్టడించింది. నీట్‌ పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాజ్‌ భవన్‌కు చేరుకున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వారితోపాటు బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకుడిని సైతం పోలీసులు అరెస్టు చేశారు.

ఎన్డీయే ఎందుకు మౌనంగా ఉంది?

నీట్ పరీక్షపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్డీయే ప్రభుత్వం పై వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బాధపడుతున్న నీట్ స్కామ్ పై ఎన్డీయే ఎందుకు మౌనంగా ఉందని నిలదీస్తున్నారు. ఇంత పెద్ద సమస్య పరిష్కారంపై విద్యాశాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నీట్ వ్యవహారంపై కేంద్రానికి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్... పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు.. నీట్ వ్యవహారంపై స్పందించాలని డిమాండ్ చేశారు. మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టాలి.. వెంటనే బాధ్యులను శిక్షించాలన్నారు. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి అని కోరారు.

ఏంటి నీట్ స్కామ్...?

భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు, దంత విద్యా కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం పెట్టే ప్రవేశ పరీక్ష నీట్ ఎగ్జామ్ మే 5న దేశవ్యాప్తంగా జరిగింది. మొత్తం 4,750 సెంటర్లలో 23 లక్షల 33 వేల 297 మంది పరీక్ష రాశారు. పరీక్ష జరిగిన రోజే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దీన్ని కొట్టిపారేసింది.

ఎన్టీఏ జూన్ 4న నీట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలో13 లక్షల16 వేల 268 మంది విద్యార్థులు క్వాలిఫై అయినట్టు ప్రకటించింది. ఇందులో 67 మందికి 720కి 720 మార్కులు వచ్చాయని వెల్లడించింది. వీళ్లందరినీ టాప్ ర్యాంకర్లుగా పేర్కొంది. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మందికి సెంట్ పర్సెంట్ మార్కులు రావడంపై స్టూడెంట్స్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ 67 మందిలో ఆరుగురు హర్యానాలోని ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాశారని, వాళ్లంతా ఒకే రూమ్ లో కూర్చొని ఎగ్జామ్ రాశారని ఆరోపణలు వచ్చాయి. ఇలా ఒకే సెంటర్లో రాసిన ఆరుగురికి సెంట్ పర్సెంట్ మార్కులు రావడం పట్ల దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ అయిందని, కష్టపడి చదివిన వారికి నష్టం జరగకుండా నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News