ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్

నాగర్​ కర్నూల్​ జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై సహాయచర్యలు ముమ్మరం చేశారు.ఈ ఘటన గురించి సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరా తీశారు.;

Update: 2025-02-22 14:55 GMT

నాగర్​ కర్నూల్​ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేసి సంఘటన గురించి ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి సీఎం తెలిపారు. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్​ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ప్రధానికి వివరించారు.


సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ టీం
సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీంను పంపిస్తామని ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారు.పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం ఘటన, ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలను ముఖ్యమంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలని సీఎం సూచించారు.

ప్రమాదంలో ఎవరు చిక్కుకున్నారంటే...
ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఆ ఎనిమిది మందిలో ప్రాజెక్ట్ ఇంజినీర్,సైట్ ఇంజినీర్ తో పాటు ఇద్దరు మిషన్ ఆపరేటర్లు, నలుగురు వర్కర్లు ఉన్నారు.ప్రమాదంలో చిక్కుకున్న వారిలో 1.మనోజ్ కుమార్ (ప్రాజెక్ట్ ఇంజినీర్) ఉత్తర ప్రదేశ్, 2. శ్రీనివాస్ (సైట్ ఇంజినీర్) ఉత్తర ప్రదేశ్,3.సందీప్ సాహు (కార్మికుడు)జార్ఖండ్,4.జటాక్స్ (కార్మికుడు)జార్ఖండ్,5.సంతోష్ సాహు (కార్మికుడు)జార్ఖండ్,6. అనూజ్ సాహు (కార్మికుడు)జార్ఖండ్,7.సన్నీ సింగ్ (కార్మికుడు)జమ్మూ కాశ్మీర్,8.గురుప్రీత్ సింగ్ (కార్మికుడు)పంజాబ్ ఉన్నారు. గాయపడినవారికి మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా కల్పించారు.



Tags:    

Similar News