శ్రీ క్రోధి నామ సంవత్సర ఉచిత పంచాగం ఆవిష్కరణ
శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో డాక్టర్ మోహనకృష్ణ భార్గవ రచించి, నిర్మించి, ప్రచురించిన శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది తెలుగు కాలమానాన్ని ఆవిష్కరించారు.
జనగామ జిల్లా కేంద్రంలోని శ్రీ హనుమత్ రామనాథ సహిత శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రముఖ జ్యోతిష్య పండితులు, సామాజిక కవి, రచయిత, జ్యోతిష్య రత్న, శిరోమణి, మహర్షి, పురోహిత సార్వభౌమ డాక్టర్ మోహనకృష్ణ భార్గవ రచించి, నిర్మించి, ప్రచురించిన సత్సాంప్రదాయక తెలుగు కాలసూచిక (క్యాలెండర్) సోమవారం రోజున పలువురు ప్రముఖుల సమక్షంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది తెలుగు కాలమానాన్ని వైభవంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మోహనకృష్ణ మాట్లాడుతూ...గత ఎనిమిది సంవత్సరాలుగా సత్సాంప్రదాయక తెలుగు కాలమానాన్ని ప్రచురిస్తున్నట్లు తెలిపారు. భారతీయ వైదిక విజ్ఞానాన్ని, ఋషి పరంపరా గతమైన సనాతన సాంప్రదాయాలను, పాశ్చాత్య మోజులో కనుమరుగవుతున్న స్వచ్ఛమైన తెలుగు సంస్కృతులను పరిరక్షిస్తూ భావితరాలకు పదిలంగా అందించాలని కాంక్షతో, ధర్మ ప్రచారంలో తన కర్తవ్యంగా గత ఎనిమిది సంవత్సరాలుగా.. తిథి వార నక్షత్ర వర్జ దుర్ముహూర్త అమృత ఘడియలు, మాస లగ్న చక్ర సహితంగా శుభ ముహూర్తాలు, పర్వదినాలు, విక్రమ, కలి, శాలివాహనాది వివిధ శఖ సూచికలతో, ఋషులు, దేవతలు, ఆచార్యులు, వైదిక శాస్త్రజ్ఞులు, చారిత్రక పురుషుల చిత్రాలతో అద్భుతమైన రీతిలో సత్సాంప్రదాయక ఉగాది తెలుగు కాలసూచి నిర్మించి, స్వీయ ఖర్చులతో ముద్రించి, ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
దేవాలయ గౌరవాధ్యక్షులు గజ్జెల నర్సిరెడ్డి మాట్లాడుతూ కాలసూచిక సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో ఉందని, మల్టీకలర్ లో ఆకర్షణీయంగా, విద్యార్థులకు సైతం ఆసక్తికరంగా కనబడుతుందని అన్నారు. మోహనకృష్ణ ఎన్నో వ్యయప్రయాసలు ఓర్చి, ఎంతో శ్రమతో ప్రతీ సంవత్సరం సాంప్రదాయక ఉగాది తెలుగు క్యాలెండర్ ముద్రిస్తున్నారని అభినందించారు.
పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ధర్మ ప్రచారం, సంస్కృతిక పరిరక్షణ, వైదిక విజ్ఞానాన్ని, సనాతన సాంప్రదాయాలను భావితరాలకు అందించాలనే కాంక్షతో కృషి చేస్తున్న భార్గవకి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆవిష్కరణలో జక్కా నర్సిరెడ్డి, కందాడి మల్లారెడ్డి, యాదగిరి, యెలసాని కృష్ణమూర్తి, రాంబాబు, పాశం శ్రీశైలం, కళ్లెం నాగరాజు రెడ్డి, ఉమాకర్ రెడ్డి, జక్కా ఉపేందర్, పూర్ణచందర్, వేణుగోపాల్, రవి, సిద్ది మల్లారెడ్డి, వరలక్ష్మీ, అలివేలు, జ్యోతి, శ్యామల, విజయలక్ష్మీ, శైలజ తదితరులు పాల్గొన్నారు. క్యాలెండర్ కావలసిన వారు దేవాలయం వద్ద తీసుకోగలరని తెలిపారు.