మౌలానా అబుల్ కలాం ఆజాద్ అవార్డుల ప్రదానం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో మైనారిటీలు కీలకపాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.మౌలానా అబుల్ కలాం ఆజాద్అవార్డులను ప్రదానం చేశారు.

Update: 2024-11-11 08:57 GMT

తెలంగాణలో జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అవార్డులను ప్రదానం చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో మైనారిటీలు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.హిందూ, ముస్లింలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటి వారని, మీరంతా అండగా ఉంటే విద్య, వైద్యం,ఉపాధి విషయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకోవచ్చని సీఎం పేర్కొన్నారు.


దేశ సమైక్యతకు గాంధీ పరివార్ కృషి
‘‘దేశంలో ఉన్నవి రెండే పరివార్‌లు...ఒకటి మోదీ పరివార్.. రెండోది గాంధీ పరివార్..ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు మోదీ పరివార్ పనిచేస్తోంది.దేశ సమైక్యతకు గాంధీ పరివార్ కృషి చేస్తోంది’’అని సీఎం వ్యాఖ్యానించారు.దేశ ప్రజలకు మెరుగైన విద్య అందించేందుకు ఆనాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారని సీఎం చెప్పారు.

ముస్లింలకు ప్రాధాన్యం ఇచ్చాం...
‘‘ముస్లింలను మేం ఓటర్లుగా చూడటంలేదు.. సోదరులుగా, కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాం.అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మైనారిటీని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేదు..అందుకే మైనారిటీ మంత్రి ఇచ్చే అవకాశం లేకుండా పోయింది.కానీ షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారుడిగా చేశాం, అమీర్ అలీ ఖాన్ కు ఎమ్మెల్సీ ఇచ్చాం.కార్పొరేషన్ లలో అవకాశాలు ఇచ్చాం.వైఎస్ తరువాత ఇప్పటి వరకు సీఎంఓ లో మైనారిటీ అధికారిని నియమించలేదు.మన ప్రభుత్వంలో సీఎంఓలో ఒక మైనారిటీ అధికారిని నియమించాం’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం
దేశంలో మైనారిటీలకు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని సీఎం చెప్పారు.‘‘మోదీ పరివార్ తో ఉండాలో గాంధీ పరివార్ తో ఉండాలో మీరే నిర్ణయించుకోండి.మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చేందుకు మైనారిటీలు కృషి చేయాలి.దేశంలో కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది.మహారాష్ట్రలో మహావికాస్ అగాదీ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయండి.దేశంలో మోదీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిగా చూసే వరకు విశ్రమించొద్దు’’ అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


Tags:    

Similar News