ధర్నాలు చేయడం మానుకోవడమే బీఆర్ఎస్‌కు మంచిది: పొన్నం

చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్.. నిరసనలకు పిలుపివ్వడం హాస్యాస్పదమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.;

Update: 2025-03-14 07:56 GMT

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్, జగదీష్ రెడ్డి అంశం తీవ్ర దుమారం రేపింది. తమ నేత ఎలాంటి తప్పు చేయలేదని బీఆర్ఎస్ నేతలు అంటుంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం జగదీష్ రెడ్డి చేసింది ముమ్మాటికీ తప్పేనంటున్నారు. స్పీకర్‌ను విమర్శించడం తప్పుకాదని ఎక్కడ ఉందో చెప్పాలంటున్నారు. స్పీకర్ అంటే శాసన సభాపతి, అసెంబ్లీ అధ్యక్షుడు అని గుర్తు చేశారు. స్పీకర్‌ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలకు గానూ జగదీష్ రెడ్డిని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం అంతా ఇదే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చలు జరిగాయి. కాగా ఈరోజు ఈ విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. జగదీష్ రెడ్డి చేసింది ముమ్మాటికీ తప్పేనన్నారు. స్పీకర్‌ను విమర్శించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. జగదీష్ రెడ్డికి స్పీకర్ రెండో అవకాశం కూడా ఇచ్చి మీరు మాట్లాడేది పొరపాటు అంటుంటే.. జగదీష్ రెడ్డి పట్టించుకోలేదని, పైగా అవును సభ మీది కాదని మాట్లాడారన్నారని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా చేయాల్సిందంతా చేసి తమకు తమ వాయిస్ వినిపించుకునే అవకాశం కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ నేతలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెద్దలకైనా బుద్ధి ఉండొద్దా..

నిన్న సభలో జరిగిన ఉదాంతం మొత్తాన్ని బీఆర్ఎస్ పెద్దలు గమనించారు. కానీ జగదీష్ రెడ్డి చేసింది తప్పు కాదని కానీ, స్పీకర్‌ను ఉద్దేశించి అలా మాట్లాడి ఉండకూడదని కానీ ఆ పార్టీ పెద్దలు చెప్పలేదు. పైగా అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేయడం, నియోజకవర్గాల్లో నిరసనలు, ధర్నాలకు పిలుపునివ్వడం వారి దిగజారుడు రాజకీయాలకు ప్రతీక అంటూ విమర్శలు గుప్పించారు పొన్నం ప్రభాకర్. ఇలా చేయడానికి బీఆర్ఎస్ పెద్దలకైనా బుద్ధి ఉండొద్దా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసినప్పుడు తమ నేతలను మందలించడం పార్టీ పెద్దల బాధ్యత అని, దానిని బీఆర్ఎస్ హైకమాండ్ మరిచిందని అన్నారు.

బీఆర్ఎస్‌కు జ్ఞానం రావాలి..

చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్.. నిరసనలకు పిలుపివ్వడం హాస్యాస్పదమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికైనా ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి కావాల్సిన కనీస జ్ఞానం రావాలి అని అన్నారు మంత్రి. సభలో ఎలా ప్రవర్తించాలో వారందరికి తెలుసని, కానీ సభలను అడ్డుకోవాలని ఉద్దేశపూర్వకంగానే వారు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. సభకు కొన్ని సంప్రదాయాలు, పద్దతులు ఉంటాయని, ఉదాహరణకు సభలో అబద్ధం అనడానికి కూడా వీల్లేదు సత్యదూరం అనాలి అని చెప్పారు. అలాంటి సభలో నిల్చుని సభ మీకూ సొంతం కాదని అనడం ఏంటి? స్పీకర్ స్థానంలో ఉంది ఒక దళితుడు కాబట్టే బీఆర్ఎస్ నేతలు ఇలా ప్రవర్తించారని మండిపడ్డారు. గతంలో శాసనమండలిలో ఛైర్మన్‌పై కాగితాలు విసేరిసిన చరిత్ర కూడా బీఆర్ఎస్‌కు ఉందని, ఇలాంటి సభ్యులను బర్తరఫ్ చేయాలని కోరారు. ఈ సందర్భంగానే నిరసనలు, ధర్నాలు చేయడం బీఆర్ఎస్ మానుకోవాలని, ఎందుకంటే అది ఆ పార్టీకే మేలు చేయవని సూచించారు.

Tags:    

Similar News