‘తెలంగాణపై మోదీ వ్యాఖ్యలు తప్పుకాదా’.. కిషన్ రెడ్డిని ప్రశ్నించిన పొన్నం ప్రభాకర్

తెలంగాణ ఏర్పాటును ఉద్దేశించి పార్లమెంటులో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు.

Update: 2024-11-04 13:16 GMT

తెలంగాణ ఏర్పాటును ఉద్దేశించి పార్లమెంటులో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. మోదీ మాటలు తెలంగాణ ఆవిర్భావాన్ని ప్రశ్నించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ కిషన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు పొన్నం ప్రభాకర్. ఇంతకాలంలో తెలంగాణకు ఏం ఇచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలని అడిగారు. తెలంగాణ ప్రయోజనాల కోసం టూరిజం మంత్రిగా కిషన్ రెడ్డి ఏం చేశారని నిలదీశారు.

అంతేకాకుండా తెలంగాణ బిడ్డను అని చెప్పుకునే కిషన్ రెడ్డి.. తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించేలా మోదీ వ్యాఖ్యలు చేస్తుంటే ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. కిషన్ రెడ్డిది నిజంగా తెలంగాణ డీఎన్‌ఏనే అయితే మోదీ వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించిన మోదీ వ్యాఖ్యలు తప్పు కాదా? అవి తప్పో కాదో కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు వివరించాలి అని అగ్గిమీద గుగ్గిలం అయ్యారు పొన్నం ప్రభాకర్.

కేసీఆర్ సలహాతోనే కిషన్ రెడ్డికి పదవి

ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి తెలంగాణ అధ్యక్ష పదవి రావడంపై కూడా పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ సలహా మేరకే కిషన్ రెడ్డి.. రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారని, అలాంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు తమను తిడితే తమకు ఏమి ఆశ్చర్యంగా లేదంటూ చురకలంటించారు. రాష్ట్రంలో సర్పంచ్‌ల దుస్థితి గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లెవేస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్‌ల ఆత్మహత్యలకు ఎవరైతే కారణమయ్యారో వాళ్లే ఇప్పుడు వాళ్లకి మద్దతుగా నిలుస్తున్నారని, వంద ఎలుకలను తిన్న పిల్లి.. ఎలుకలను చూసి పాపం అన్నట్లు ఉందని చురకలంటించారు.

ఆ బకాయిలకు ప్రభుత్వం గ్యారెంటీ

సర్పంచుల బకాయిలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్‌లు రాజకీయ ట్రాప్స్‌లో పడొద్దని, పొలిటికల్ మైలేజీ కోసం కొందరు సర్పంచ్‌లకు అండగా నిలుస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారని, సర్పంచ్‌లు వాళ్ల ట్రాప్‌లో పడొద్దని కోరుకున్నారు. ‘‘సర్పంచ్‌ల బకాయిలను మార్చిలోపు చెల్లిస్తాం. వంద ఎలుకలను తిన్న పిల్లి మాదిరిగా బీఆర్ఎస్ మాట్లాడుతోంది. రాష్ట్రంలో వరదలు సంభవించినప్పుడు రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లితే కేంద్రం మాత్రం రూ.400 కోట్లు ఇచ్చి చేతులు దులుపేసుకుంది’’ అని విమర్శలు గుప్పించారు.

రాష్ట్ర పరిస్థితి బాగాలేదు

‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్తితి బాగాలేదు. సర్పంచ్‌లు తొందర పడకండి. ఇది బీఆర్ఎస్ నేతలు చేసిన పాపం వల్లే సర్పంచ్‌ల ప్రస్తుత పరిస్తితి ఇలా తయారైంది. సర్పంచ్‌ల విషయంలో బీఆర్ఎస్ ముసలి కన్నీరు కరుస్తుతుంది. సర్పంచ్ లా బకాయిలు విడతల వారీగా చెల్లిస్తాం. ప్రతిపక్షాల ఉచ్చులో సర్పంచ్‌లు పడకండి. కిషన్ రెడ్డికి కాంగ్రెస్ హామీల మీద మాట్లాడే అర్హత లేదు. బీజేపీ ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు చేశారు. చర్చకు సిద్ధమా.. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్దకు వస్తారా..? రాష్ట్రానికి అదనపు నిధుల కోసం కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు ఇచ్చాం స్పందన లేదు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది. కిషన్ రెడ్డి నిజంగా తెలంగాణ బిడ్డ అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్తితి మెరుగు చేయాలి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్. శవాల మీద పేలాలు ఏరుకునే పార్టీ బీఆర్ఎస్. రెండింటికీ పొంతన ఎంటి..?’’ అని విమర్శలు గుప్పించారు.

Tags:    

Similar News