ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీసుల ‘ఆపరేషన్ రోప్’

హైదరాబాద్‌లో రోడ్ల పక్కన సైకిల్ ట్రాక్ లు, ఫుట్ పాత్ ల ఆక్రమణలతో తరచూ ట్రాఫిక్ స్తంభించి పోతోంది.వీటికి చెక్ పెట్టేందుకు సిటీ పోలీసులు ఆపరేషన్ రోప్ చేపట్టారు.

Update: 2024-11-15 08:48 GMT

రోడ్ల పక్కన ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ రోప్ కార్యక్రమం చేపట్టారు. రోడ్ల పక్కన ఉన్న తోపుడు బండ్లు, టీ, స్నాక్స్ బండ్లను తొలగించి వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.


రోడ్ల పక్కన ఆక్రమణలను తొలగించండి : హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు వస్తువులు అమ్ముకుని జీవించేందుకు సైకిల్‌ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లను నిర్ధాక్షిణ్యంగా ఆక్రమించుకుంటున్నారని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.‘‘ట్రాఫిక్ సమస్యలకు అవరోధంగా మారిన రోడ్ల ఆక్రమణల విషయంలో పేదరికం, జీవనోపాధి తదితర అంశాలను తీసుకురావద్దని నా విన్నపం. ఆపరేషన్ రోప్‌ను సీరియస్‌గా తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను నేను కోరాను.ఇది మాఫియా రకం చర్య. దీంతో ట్రాఫిక్‌పై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇది క్రేన్‌లతో ప్రతిరోజూ చేయవలసిన నిరంతర ప్రక్రియ. దయచేసి ట్రాఫిక్ పోలీసులకు మద్దతు ఇవ్వండి. ఏళ్ల తరబడి ఎక్కడ ఆక్రమణలు జరిగినా ఆ పరిమితిని ఎవరూ దాటకుండా తెల్ల గీతలు వేస్తారు’’అని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఎక్స్ లో పోస్టు చేశారు.

చిలకలగూడ ట్రాఫిక్ పోలీసుల చర్యలు
నగర పోలీసు కమిషనర్ ఆదేశాల ప్రకారం క్రమం తప్పకుండా తాము ఆపరేషన్ రోప్ నిర్వహిస్తామని చిలకలగూడ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ లో పోస్టు చేశారు. క్యారేజ్‌వేపై ఉన్న తోపుడు బండ్లను తొలగించి, వారికి చలాన్లు విధించామని పోలీసులు పేర్కొన్నారు. ట్రాఫిక్ సాఫీగా సాగడం కోసం మెట్టుగూడ కూరగాయల మార్కెట్‌ను తరలించాలని కోరుతూ తాము జీహెచ్ఎంసీ కమిషనర్ కు లేఖ రాశామని చిలకలగూడ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ లో పోస్టు పెట్టారు. తార్నాక- ఆలుగడ్డబావి రోడ్డు పక్కన ఉన్న కూరగాయల బండ్ల ఆక్రమణలు ఉన్నపుడు, ట్రాఫిక్ పోలీసులు తొలగించిన తర్వాత ఉన్న పరిస్థితిపై ఫొటోను ఎక్స్ లో పోస్టు చేశారు.


Tags:    

Similar News