కౌశిక్ రెడ్డిపై నాలుగో కేసు నమోదు

హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. కరీంనగర్ జెడ్‌పీ కార్యాలయంలో ఆయన చేసిన హాంగామాకు ఇప్పటికే ఆయనపైన మూడు కేసులు నమోదయ్యాయి.;

Update: 2025-01-13 12:04 GMT

హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. కరీంనగర్ జెడ్‌పీ కార్యాలయంలో ఆయన చేసిన హాంగామాకు ఇప్పటికే ఆయనపైన మూడు కేసులు నమోదయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు నువ్వు ఏ పార్టీ అంటూ దురుసుగా ప్రవర్తించారు. ఈ అంశంపైనే ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. కాగా తాజాగా గేమ్ ఛేంజర్‌ టికెట్ల రేట్లు పెంచినం విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై కాంగ్రెస్ మరో ఫిర్యాదు చేయడంతో నాలుగో కేసు కూడా నమోదైంది. దీంతో ఈ రెండు రోజుల్లో కౌశిక్ రెడ్డిపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు.

అయితే గేమ్ ఛేంజర్‌ సినిమాకు అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతించడానికి సీఎం రేవంత్ రెడ్డి రూ.500 కోట్లు తీసుకున్నారని కౌశిక్ ఆరోపించారు. రూ.500 కోట్లు ముట్టడంతోనే వెంటనే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలను సైతం గాలికి వదిలేసి అదనపు షోలకు, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పచ్చజెండా ఊపారని తీవ్ర విమర్శలు చేశారు. కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సియర్ నేత సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎంను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కౌశిక్‌పై మరో కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే టికెట్ రేట్ల పెంపు, అదనపు షోలకు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

మళ్ళీ సర్కార్ యూటర్న్

హైకోర్టు సీరియస్ కావడంతో టికెట్ల రేట్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ యూటర్న్ తీసుకుంది. గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లు పెంపు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో సంక్రాంతి సినిమాలకు టికెట్ హైక్, స్పెషల్ షోలు లేనట్లేనని అర్థమవుతోంది. గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకు ముందు సింగిల్ స్క్రీన్స్ రూ.100, రూ.150 పెంచుతూ జనవరి 8న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఉన్నతన్యాయస్థానం ఈ విషయంపై సీరియస్ అయింది. దీంతో తన నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

స్పెషల్ షోలు ఉండవ్

ఇకపై తెలంగాణలో సినిమాల టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలు ఉండవు అని ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు ఉపసంరించుకుంది. గేమ్ ఛేంజర్‌కు ఇచ్చిన వెసులుబాటును ఉపసంరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకు గేమ్ ఛేంజర్ టికెట్ ధరలు, అదనపు షోలకు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంది. తెలంగాణలో ఇక నుంచి తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా సినిమాల స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వమని ప్రకటించింది.

Tags:    

Similar News