Miss World ఫెస్టివల్‌లో మెరవనున్న పోచంపల్లి చేనేత చీరలు
మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో ప్రపంచం దృష్టిని పోచంపల్లి చేనేత చీరలు ఆకర్షించనున్నాయి.పోచంపల్లిలో చేనేతలను సాంప్రదాయక గ్రాండ్ ఫ్యాషన్ షో నిర్వహించనున్నారు.;
By : Shaik Saleem
Update: 2025-04-16 15:41 GMT
హైదరాబాద్ నగరంలో మే 15వతేదీన జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో (Miss World Festival) పోచంపల్లి చీరలు (Pochampally Handloom Sarees) మెరవనున్నాయి. తెలంగాణ చేనేత వారసత్వం, సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రపంచ వేదిక మిస్ వరల్డ్ ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. చేనేత, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన పోచంపల్లి చేనేత చీరల హైలెట్ చేయనున్నారు.
పోచంపల్లి చీరలతో అందాల భామల గ్రాండ్ ఫ్యాషన్ షో
మిస్ వరల్డ్ ఫెస్టివల్ లో తెలంగాణ చేనేత వారసత్వాన్ని, శతాబ్దాల నాటి వస్త్ర సంప్రదాయాలను ప్రపంచ సుందరాంగుల ముందుంచాలని నిర్ణయించారు. మిస్ వరల్డ్ ఫెస్టివల్‌కు సన్నాహాక కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా యునెటెడ్ నేషన్స్ గుర్తింపు పొందిన తెలంగాణ చేనేత ఐకాన్ పోచంపల్లి గ్రామాన్ని రాష్ట్ర పర్యాటక కార్యదర్శి స్మితా సభర్వాల్ (Smitha Sabharwal) సందర్శించారు. తెలంగాణ సాంస్కృతిక వస్త్రాలను, చేనేత వారసత్వాన్ని ప్రపంచ ప్రేక్షకుల కోసం ప్రదర్శించడానికి మిస్ వరల్డ్ ఫెస్టివల్ కార్యక్రమం ఉపయోగపడనుంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిస్ వరల్డ్ పోటీదారులు తెలంగాణ చేనేత కళాత్మకతను పోచంపల్లిలో అనుభవపూర్వకంగా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖ నిర్వహించనుంది.
తెలంగాణ జానపద సాంస్కృతిక ప్రదర్శనలు
ఈ కార్యక్రమం లో ఆకర్షణీయమైన తెలంగాణ జానపద సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు వీటిలో డైనమిక్ "చిందు యక్షగానం" మనోహరమైన "మెటల్ కెన్నెరా", లయబద్ధమైన "రింజా" సంగీత ప్రదర్శనలు ఉండేలా తెలంగాణ పర్యాటక శాఖ కార్యక్రమాన్ని రూపొందించింది.
తెలంగాణ చేతివృత్తులను ప్రపంచానికి చాటిచెబుతాం : స్మితా సబర్వాల్
మిస్ వరల్డ్ పోటీదారులకు ఆతిథ్యం ఇవ్వడం, తెలంగాణ ప్రత్యేకమైన చేనేత వారసత్వం, సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉందని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ చేతివృత్తులవారి నైపుణ్యం, తెలంగాణ గుర్తింపు, సంప్రదాయాల వేడుకను ప్రపంచానికి చాటేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రపంచాన్ని పోచంపల్లికి స్వాగతించడానికి పర్యాటక ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.