ఎస్సీ వర్గీకరణకు మేము అనుకూలం.. మోదీ

బిజెపి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణకి వచ్చారు. మంగళవారం మెదక్ జిల్లా అల్లాదుర్గంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

By :  Vanaja
Update: 2024-04-30 17:37 GMT

బిజెపి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణకి వచ్చారు. మంగళవారం మెదక్ జిల్లా అల్లాదుర్గంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో భారత్ లో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో, పదేళ్ల బిజెపి పాలనలో దేశం ఎంతగా అభివృద్ధి చెందిందో అందరూ చూశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశం అవినీతి ఊబిలోకి నెట్టివేయబడిందని ఆరోపించారు.

"కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట పంచ సూత్రాలతో పాలన చేస్తుంది. ఆ పంచ సూత్రాలు ఏంటంటే.. అవినీతి, అబద్ధాలు, మాఫియా, కుటుంబ పాలన, ఓటు బ్యాంకు రాజకీయాలు. దేశంలో మళ్లీ పాతరోజులు తీసుకురావాలని ఆ పార్టీ చూస్తోంది. RRR సినిమా సూపర్ హిట్ అయిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈరోజు తెలంగాణలో డబుల్ 'ఆర్' ట్యాక్స్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల ప్రపంచమంతా గర్వపడితే.. డబుల్ ఆర్ ట్యాక్స్ తో దేశం సిగ్గుపడుతోంది. పారిశ్రామిక వేత్తల నుంచి వసూలు చేస్తున్న ఆర్ఆర్ ట్యాక్స్ ఢిల్లీకి చేరవేస్తున్నారు. పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన వారసత్వ సంపద నుంచి కొత్త ట్యాక్స్ వసూలు చేస్తామంటున్నారు. దీనికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి" అని మోదీ తెలంగాణ ఓటర్లకు పిలుపునిచ్చారు.

అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే...

"కాళేశ్వరం అతి పెద్ద కుంభకోణం. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారాస దోచుకుందని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ భారాసను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. అవినీతిలో ఈ రెండు పార్టీలు ఒక్కటే. తల్లిదండ్రులు సంపాదించిన దాంట్లో నుంచి 55శాతం ఆస్తి మన పిల్లలకు దక్కకుండా కాజేసేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నుతోంది. ఇలాంటి భయానక నిర్ణయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గతంలో బీఆర్ఎస్ ఎలా అవినీతికి పాల్పడి తెలంగాణను దోచుకుందో.. ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తోంది." అని మోదీ విమర్శించారు.

ఎస్సీ వర్గీకరణకు మేము రెడీ

"ఉమ్మడి ఏపీలో 2004-09లో రికార్డు స్థాయిలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపించారు. కానీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను ఆ పార్టీ కాలరాసింది. 26 బీసీ కులాలను కేంద్ర జాబితాలో చేర్చకుండా రాత్రికి రాత్రి ముస్లింలను ఓబీసీ జాబితాలో చేర్చింది. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న లింగాయత్, మరాఠాలకు కాంగ్రెస్ న్యాయం చేయలేదు. ఎస్సీ వర్గీకరణకు మేము అనుకూలం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజల సంపదకు రక్షణ. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు తావులేదు. రాజ్యాంగం అంటే విచిత్ర గ్రంథంగా భావిస్తాం. రాజ్యాంగంపై, అంబేద్కర్ పై కాంగ్రెస్ కి గౌరవం లేదు. తొలి ప్రధాని నెహ్రూ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తే.. ఇందిరాగాంధీ తూట్లు పొడిచారు. రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడింది బీజేపీ మాత్రమే” అని ప్రధాని మోదీ మెదక్ సభలో ప్రసంగించారు.

Tags:    

Similar News