ట్యాపింగ్ టూ మొయినాబాద్ ఫార్మ్ హౌస్.. రాధాకిషన్ పాత్ర ఏంటి?

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు అరెస్టు తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

By :  Vanaja
Update: 2024-04-05 11:25 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు అరెస్టు తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

రాధా కిషన్, ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా BRS నాయకుడికి చెందిన ఒక ప్రైవేట్ విమానంలో కేరళ, ఢిల్లీకి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రాధా కిషన్‌ను విచారిస్తే విమాన యజమాని ఎవరనేది వెల్లడవుతుందని ఇన్వెస్టిగేషన్ అధికారులు భావిస్తున్నారు.

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో డీల్ కుదిర్చేందుకు బీజేపీ పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఏజెంట్లను ట్రాప్ చేయడానికి ఉపయోగించే స్నూపింగ్ పరికరాలను రాధా కిషన్ ఏర్పాటు చేసినట్లు విచారణలో తేలింది. నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డిలను రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజులు సంప్రదించారని ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్న మాజీ ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు, రాధా కిషన్‌ను అప్రమత్తం చేశారు. దీంతో వారిని పట్టుకోవడానికి ఘటనకు ఒక్కరోజు ముందు రాధా కిషన్ రావు ఫామ్‌హౌస్‌లో కెమెరాలు, మైక్రోఫోన్‌లను ఏర్పాటు చేశారు.

స్నూపింగ్ సెటప్‌లో కెమెరాలు, రికార్డింగ్ పరికరాలతో సహా 74 ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. ఫార్మ్ హౌస్ ఆపరేషన్ జరగడానికి ఒక రోజు ముందు ఐటీ వింగ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి జూపల్లి రమేశ్‌రావు ఫామ్‌హౌస్‌లోని సెటప్ మొత్తాన్ని పర్యవేక్షించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఇదిలా ఉండగా, అధికార పార్టీకి రాజకీయ ప్రయోజనం చేకూర్చడానికి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినందున రాధా కిషన్‌పై దర్యాప్తు జరుగుతోందని వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్ తెలిపారు. దర్యాప్తులో కీలకమైన సాక్ష్యాధారాలు దొరకకుండా రికార్డులను ధ్వంసం చేశారన్న అభియోగాలపైనా రాధా కిషన్‌పై విచారణ జరుగుతోంది. రాధా కిషన్‌ పోలీసు కస్టడీలో ఉన్నారని, గురువారం నుంచి బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయనని విచారిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఏప్రిల్ 10 వరకు టాస్క్ ఫోర్స్ అధికారులు రాధాకిషన్ రావుని విచారించనున్నారు.

Tags:    

Similar News