సొంత పార్టీలో సీఎంకి హైడ్రా చిక్కులు తప్పినట్టేనా?

తెలంగాణ అంతటా ఒకటే మాట గట్టిగా వినిపిస్తోంది. అదే హైడ్రా. కబ్జాకి గురైన చెరువులు, నాలాలు, పార్కులు తిరిగి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా అక్రమ నిర్మాణాలు హైడ్రా కూల్చివేస్తోంది.

By :  Vanaja
Update: 2024-08-26 15:19 GMT

తెలంగాణ అంతటా ఒకటే మాట గట్టిగా వినిపిస్తోంది. అదే హైడ్రా. కబ్జాకి గురైన చెరువులు, నాలాలు, పార్కులు తిరిగి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా అక్రమ నిర్మాణాలు హైడ్రా కూల్చివేస్తోంది. హైడ్రాకి ప్రజలతో పాటు సిపిఐ, బీజేపీ నేతలు కూడా మద్దతు పలుకుతున్నారు. ఎటొచ్చి బీఆర్ఎస్ మాత్రం వ్యతిరేకిస్తోంది. పైగా మీ పార్టీలో చాలామంది నేతల ఇళ్ళు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలోనే నిర్మించారు.. మరి వాటిని కూడా కూల్చేస్తారా అంటూ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ ముఖ్య నేతల్లో ఎవరెవరి ప్రాపర్టీస్ చెరువుల అంచునున్నాయో చెబుతూ శ్యాటిలైట్ ఫోటోలు విడుదల చేసి నిలదీస్తున్నారు. సొంత పార్టీ నేతల జోలికి వెళ్లేంత సీన్ రేవంత్ కి లేదని సెటైర్లు వేస్తున్నారు. వారిని టచ్ చేస్తే సీఎం పదవికే ప్రమాదం అంటూ ఛాలెంజులు చేస్తున్నారు.

రేవంత్ కి విషమ పరీక్ష...

ఓన్లీ ప్రతిపక్షాల, ప్రయివేట్ వ్యక్తుల ప్రాపర్టీస్ పైనే హైడ్రా చర్యలు తీసుకుంటే అది కాంగ్రెస్ కే ప్రమాదం. టార్గెట్ ప్రకారం చేస్తున్నారనే నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పోనీ కాంగ్రెస్ నాయకుల ఆస్తులు నిబంధనలకు విరుద్ధంగా లేవా అంటే అది నమ్మశక్యం కానీ విషయం. అలాంటప్పుడు సొంతవారిపైన కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే. తీసుకుంటే అంతర్గత కుమ్ములాటలు తప్పవు. దీంతో ఈ వ్యవహారం రేవంత్ రెడ్డికి విషమ పరీక్ష అనే చెప్పాలి.

హైడ్రా విస్తరించాలి...

ఇలాంటి సంకట సమయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ కి మద్దతు ప్రకటిస్తున్నారు. హైదరాబాద్ లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా లాంటి వ్యవస్థను విస్తరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎంకి బహిరంగ లేఖలు రాస్తున్నారు. హైడ్రాపై అభినందనలు తెలుపుతూ రేవంత్ కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ లేఖ రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో హైడ్రా తరహా వ్యవస్థ కోసం సీఏం రేవంత్ కి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లేఖ రాశారు. వేములవాడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ఎన్టీఎల్ పరిధిలో గెస్ట్ హౌజ్ కట్టాడని ఆది శ్రీనివాస్ లేఖలో పేర్కొన్నారు. హైడ్రాను తమ నియోజకవర్గంలో కూడా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రిక్వెస్ట్ చేశారు.

నకిరేకల్ నియోజకవర్గంలో కూడా ఆక్రమణకు గురైన భూములను కాపాడాలని వేముల వీరేశం లేఖ రాశారు. ఆలేరు నియోజకవర్గంలో ఆక్రమణకు గురైన భూములు, అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎంకి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లేఖ రాశారు. తమ నియోజకవర్గంలో హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకు రావాలని మానుకొండూర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్యే కాలే యాదయ్య, తదితరులు రేవంత్ కి లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీఅధికార ప్రతినిధి జ్ఞాన సుందర్ నేడు గాంధీ భవన్లో మాట్లాడుతూ.. హైడ్రాకి ప్రజల మద్దతు ఉందన్నారు. తెలంగాణ అంతటా హైడ్రా లాంటి వ్యవస్థను విస్తరించాలని కోరారు. 

Tags:    

Similar News