వరద-బురదలో ప్రతిపక్షాలు చేయాల్సిందేమిటి?

ఉత్తరాది లో ఏ ప్రకృతి విపత్తు సంభవించినా చాలా వేగంగా స్పందించే కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో తగు స్థాయిలో స్పందించినట్లు కనిపించడంలేదు.

Update: 2024-09-04 06:18 GMT

బాధ్యతారహిత పాలన, ఆర్ధిక విశృంఖలత్వం వల్ల అసలే కష్టకాలంలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలను గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు అతలాకుతలం చేశాయి. అప్పుల సుడిగుండంలో ఉండి అలవికాని హామీలు అమలుచేయడానికి నిధులు లేక ఏమి చేయాలో తెలియక వెర్రి చూపులు చూస్తున్న చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి లను వరద నీరు సునామీలా తాకి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు గుండెకాయ లాంటి విజయవాడ, సరిహద్దు జిల్లా ఖమ్మం తో పాటు ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలు కుంభవృష్టికి బలయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవకుండా ఉంటే వరద నీరు తీయడానికి రెండు మూడు రోజులు పట్టేట్లు ఉంది. కనీసం 15 రోజులు అయితే గానీ సాధారణ పరిస్థితి వచ్చేట్లు లేదు. ఈ విషమ పరీక్షను ఎదుర్కొనడానికి కొత్త ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఆపన్నులకు అభయ హస్తం అందించే ప్రయత్నం చేస్తుంటే, ప్రతిపక్షాలు ఇదే అదనుగా రాజకీయ అస్త్రాలు సంధిస్తున్నాయి.


భారత దేశ పెను విపత్తుల జాబితాలో ఒకటైన 1977 నవంబర్ నాటి దివిసీమ ఉత్పాతంతో పోల్చలేనిదైనప్పటికీ, తీరానికి దూరంలో విజయవాడ నగరంలో సురక్షితంగా ఉన్నారనుకున్న దాదాపు లక్ష మందిని తాత్కాలికంగా నైనా నిరాశ్రయులను చేసిందీ కుంభవృష్టి. విజయవాడ ఇంతలా ముంపుకు గురికావడం అరుదు. బుడమేరు వరద ముంపు పెద్ద ముప్పు తెచ్చిపెట్టింది. లక్షల మంది ప్రజల భవితను ప్రశ్నార్థకం చేసింది. చంద్రబాబు, ఆయన నేతృత్వంలోని మంత్రులు, అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. అదే స్థాయిలో కాకపోయినా, రేవంత్ రెడ్డి ఖమ్మం వెళ్లి బాధితులను పరామర్శించి సహాయక చర్యలు ముమ్మరం చేసి వచ్చారు.

వర్షాలు ప్రకృతి ప్రసాదాలు అయినా, ఇప్పటి వరద బీభత్సం ముమ్మాటికీ మానవ తప్పిదమే. అదీ అనాగరిక రాజకీయాల పుణ్యమే. సమగ్రాభివృద్ధి (సస్టైనబుల్ డెవలప్మెంట్) అంటే ఏమిటో తెలియని పాలకుల మహిమ. వర్షపు వరద నీరు ఒక పద్ధతి ప్రకారం వాగుల్లో కలిసేందుకు ఉన్న ఏర్పాట్లను కబ్జాసురులు చెరబట్టి అక్రమ కట్టడాలు కట్టిన దుషఫలితం ఇది. చెరువులు, కుంటలు, ఏర్లు, వాగులు, నాళా లు క్రమంగా కబళించడం కాలనీలు లేపడం వల్ల ఈ దురవస్థ. కాంగ్రెస్ అధికారం లో ఉంటే 'రాజీవ్ నగర్', తెలుగు దేశం ఉంటే 'ఎన్టీఆర్ నగర్', వై ఎస్ ఆర్ సీ పీ ఉంటే 'వైఎస్సార్ నగర్' ఏకంగా వరదప్రవాహ ప్రాంతాల్లో వెలవడం సాధారణమయ్యింది. స్థానిక నాయకులు పదివేలు, ఇరవై వేల ఓట్ల కోసం, పదో పరకో వెనకేసుకోవడం కోసం కబ్జాలకు నాయకత్వం వహించడమో, లేదా రియల్టర్ల కొమ్ముకాయడమో యథేచ్ఛగా జరిగింది. ఊళ్ళో ఉన్న విద్యావంతులు, మేధావులు మాట్లాకుండా ఉండేందుకా అన్నట్లు ఆక్రమణ చుట్టూ నడక కోసం ఏర్పాటు చేసి లైట్లు పెట్టి సుందరీకరించడం కూడా కామన్ అయ్యింది.
ఉదాహరణకు-ఖమ్మంలో లకారం చెరువు ఉంది. దాని మానాన దాన్ని వదలకుండా బాగా డబ్బు వెచ్చించి చుట్టూ ఆనకట్ట కట్టి ట్యాంక్ బండ్ అనే కలర్ ఇచ్చి సూపర్ గా సుందరీకరించారు. బల్లేపల్లి నుంచి న్యూ విజన్ స్కూల్ మీదుగా లకారం చెరువు అలుగు నుండి దిగువకు వెళ్లాల్సిన వరద నీరు ..లకారం చెరువుకు చుట్టూ వాక్ వే నిర్మించడం వల్ల వెనుకకు పోటెత్తడంతో కవిరాజ్ నగర్ కాలనీలు, పాత కలెక్టర్ ఆఫీస్ వెనక ఉన్న ప్రాంతాలు, చెరువు బజార్, చైతన్య నగర్, మైసమ్మ గుడి ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. లకారం చెరువుకు చుట్టూ ఆనకట్ట వేయటం, ఎగువ నుంచి వచ్చే వరద నీరు వెళ్లే కాలువ చిన్నగా ఉండటం వంటి కారణాలతో ప్రజలకు చిక్కు తెచ్చాయని స్థానికులు అంటున్నారు.
ఒక కరుడుగట్టిన కమ్యూనిస్టు సంతానం గులాబీ జెండా సాక్షిగా ఎడాపెడా కుమ్మేస్తే అడిగే నాథుడే లేకుండా పోయాడు. మున్నేరు ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి ఖమ్మం వాసులకు చాలా సమయం పట్టేట్లు ఉంది. కబ్జా స్థలాల్లో ఉండే ఓట్లు స్థిరమైన ఓట్లు, అందులో ఉండే యువకులు ఎన్నికలప్పుడు దొరికే చీప్ లేబర్ కూడా. కబ్జాలకు రాజముద్ర వేసిన పాపం కూడా ఆయా సందర్భాల్లో ప్రభుత్వంలో ఉన్న వారిదే కదా. తిలాపాపం తలా పిడికెడు. మరోపక్క, బుడమేరు కాల్వ నిర్వహణ పనులను శ్రద్ధగా చేసి ఉంటే విజయవాడ లో పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు. ఈ వరద బీభత్సం ఇప్పటికైనా పాలకులకు, కబ్జాకోర్లకు గుణపాఠం నేర్పితే బాగు.
వరద మృతుల విషయంలో కూడా రాజకీయం కనిపిస్తోంది. బుడమేరు వరద వల్ల 32 మంది మరణించారని, లెక్కలేనన్ని మరణాలు ఎన్నో ఉన్నాయని వై ఎస్ ఆర్ సీ పీ అధికారిక వాణి ప్రకటించింది. అట్లానే రేవంత్ రెడ్డి గారు చెప్పిన 16 మరణాల కన్నా ఎక్కువ మందే మరణించారని బీ ఆర్ ఎస్ వాదిస్తోంది. ప్రభుత్వ లెక్కలకు, విపక్ష లెక్కలకు మధ్య రెండు చోట్లా చాలా అంతరం ఉంది. ఈ విషయంలో దాపరికం రెండు ప్రభుత్వాలకు కూడా మంచిది కాదు. ఒక పక్క ప్రభుత్వం రంగంలోకి దిగి చర్యలు తీసుకోవడం కళ్ళముందు కనిపిస్తుంటే, అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యం ఉందని రెండు చోట్లా విపక్షాలు అనడం బాగోలేదు.

ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అధికార, విపక్షాలది లక్ష్యం ఒకటే ఒకటి ఉండాలి. అదే-ప్రజలను ఆదుకోవడం. ఇది చెత్త, బురద రాజకీయాలకు సరైన సమయం కాదు. కానీ దురదృష్టవశాత్తూ, రెండు రాష్ట్రాల్లో విపక్షాలు సరైన నిర్మాణాత్మక పాత్ర పోషించడంలేదని నాకు అనిపిస్తోంది. ప్రతిపక్ష నాయకుడి హోదా అధికారికంగా లేకపోయినా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు ఎట్లా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. కానీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా, చంద్రబాబు నివాసానికి వరద పోటెత్తకుండా ఉండడానికి ఎక్కడో గేట్లు ఎత్తడం వల్ల ఈ ఉపద్రవమని అయన అన్నారు.

తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు, పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారైతే బైటికే రావడం లేదు. గతంలో భద్రాచలంలో వరద వస్తే, అప్పటి గవర్నర్ టూర్ ప్లాన్ చూసి బాగుండదని కేసీఆర్ అక్కడికి వెళ్లారన్న ఆరోపణ మూటగట్టుకున్నారు. బీఆర్ ఎస్ ఘోరంగా ఓడిపోయాక అయన అసెంబ్లీ లో చర్చకు రాలేదు, ఇప్పుడు వరద బాధితులకు మొహం చూపించలేదు. ఇది పద్ధతి కానే కాదు. కేసీఆర్ గారి కుమారుడు, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అమెరికా పర్యటనలో ఉండగా, మాజీ మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలోని బృందం ఖమ్మంలో పర్యటించింది. తమ బృందంపై కాంగ్రెస్ రాళ్ళ దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుల కుటుంబాలకు పాతిక లక్షల చొప్పున ఇవ్వాలన్న డిమాండ్ చేస్తోంది. చెరువులు, నాళాల ఆక్రమణల భరతం పట్టేలా హైడ్రా అనే అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేసి కార్యాచరణలోకి దిగిన రేవంత్ ప్రభుత్వానికి సంకుచిత రాజకీయ లెక్కలు మాని అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి.

ఉత్తరాది లో ఏ ప్రకృతి విపత్తు సంభవించినా చాలా వేగంగా స్పందించే కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో తగు స్థాయిలో స్పందించినట్లు కనిపించడంలేదు. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సింది ఎంతో ఉంది. రెండు చోట్లా బీజేపీ నాయకులు ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు సాధ్యమైనంత ఎక్కువ సాయం రాబట్టాలి.


(ఇందులో వ్యక్తం చేసినవన్నీ రచయిత సొంత అభిప్రాయాలు. భిన్నాభిప్రాయాలకు ఫెడరల్ -తెలంగాణ ఒక వేదిక మాత్రమే.)

Tags:    

Similar News