మార్మోగుతున్న అపరేషన్ సింధూర్ పేరు, ఇప్పుడు నవ జాత శిశువుకు నామకరణం
దేశ వ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్ పేరు మారుమోగుతోంది. మన భారత సైన్యం పెట్టిన ఈ పేరును బీహార్ లో జన్మించిన తన కుమార్తెకు ‘సింధూర్’అని తల్లిదండ్రులు నామకరణం చేశారు.;
By : Shaik Saleem
Update: 2025-05-08 17:15 GMT
పహెల్‌గామ్ ఉగ్ర దాడి ఘటనలో సింధూరం కోల్పోయిన మహిళలకు న్యాయం చేసేందుకు భారత సైన్యం పాకిస్థాన్ దేశంలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసేందుకు ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని చేపట్టింది. పహెల్ గామ్ లో ఎందరో మహిళల బొట్టు చెరిపి వితంతువులుగా మార్చిన ఉగ్రవాదుల భరతం పట్టేందుకు మన ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమానికి దేశ ప్రజల నుంచి అపూర్వ మద్ధతు లభిస్తోంది.
ఆపరేషన్ సింధూర్ గుర్తుగా...
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గుర్తుగా ఈ ఆపరేషన్ విజయవంతం చేసిన రోజే బీహార్ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాకు చెందిన ఆసుపత్రిలో కుందన్ కుమార్ మండల్ దంపతులకు పండంటి ఆడపిల్ల జన్మించింది. అంతే ఆపరేషన్ సింధూర్ జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు తమ కుమార్తెకు సింధూర్ పేరు పెట్టామని కుందన్ కుమార్ చెప్పారు.
ఉగ్రవాదులను మట్టుపెట్టి మన భారతదేశ సాయుధ దళాల ఆపరేషన్ విజయవంతం అయిన రోజు గుర్తుగా తాము ఈ పేరు పెట్టామని చెప్పారు. తన కుమార్తెకు సింధూర్ పేరు పెట్టడం తమకెంతో సంతోషాన్నిచ్చిందని ఆ కుటుంబ సభ్యులు ఆనందంగా చెప్పారు.
సింధూరం వివాహిత హిందూ మహిళలు పెట్టుకునేది.ఇప్పుడు ఈ పేరు పహెల్ గామ్ విషాదానికి భారత సైన్యం ప్రతీకారాత్మక చర్యగా నిలిచింది. తమ నవజాత శిశువుకు సిందూర్ పేరు పెట్టడం భవిష్యత్ తరాల్లో ఈ సంఘటన గుర్తుగా నిలుస్తుందని కుందన్ కుమార్ చెప్పారు.