టికెట్ల కోసం ఎమ్మెల్యే కొత్త నిబంధన

స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ ముస్తాబవుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ సాధించాలని ప్రయత్నిస్తున్న ఆశావాహుల సంఖ్య కూడా అధికంగానే ఉంది.

Update: 2024-10-03 10:39 GMT

స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ ముస్తాబవుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ సాధించాలని ప్రయత్నిస్తున్న ఆశావాహుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి పడితే వారికి టికెట్ ఇవ్వకూడదని నిశ్చయించుకుందని, ప్రజలకు ఆదర్శంగా ఉండే నేతలకు టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా మద్యం వంటి వ్యసనాలను దూరంగా ఉన్నవారికి స్థానిక సంస్థల్లో టికెట్ లభించనుందని ప్రేమ్‌సాగర్ బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే పౌరులకు ఆదర్శింగా నిలవాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా పలువురు యువత, నాయకులతో ప్రమాణం కూడా చేయించారాయన. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, చెడు వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ప్రజలకు చెప్పాలంటే ముందు మనం చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, అప్పుడు ప్రజలకు చెప్పే అర్హతన మనకు ఉంటుందని, ఆ కారణంతోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ప్రమాణం ఏమని చేయించారంటే..

‘‘కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలమైన మేము గాంధీ జయంతి సందర్భంగా .. మద్యం తాగం, డ్రగ్స్ ముట్టుకోబోమని, నమ్మిన దేవునిపై ప్రమాణం చేస్తున్నాము. కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా ఉంటాం. వర్గ విభేదాలు, కుల మతాలు, రాగ ద్వేషాలు, కక్షలు, ప్రతీకారాలు లేకుండా అంతా కలిసిమెలిసి ఉంటాం. అందరం కలిసి అభివృద్ధి, సంక్షేమంలో భాగస్వాముల అవుతాం. దేవునిపై ప్రమాణం’’ అని కాంగ్రెస్ నేతలు ప్రమాణం చేశారు. గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నిర్వమించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈమేరకు ప్రకటన చేశారు. వారికి నివాళులు అర్పించిన అనంతరం వారు ప్రతిజ్ఞ చేశాారు. ఈ సందర్భంగానే మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు.

రాత్రి 9 దాటితే అంతా బంద్..

యువతకు వ్యసనాలకు దూరంగా ఉంచే క్రమంలో భాగంగా రాత్రి 9 దాటితే మంచిర్యాల నియోజకవర్గంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసేసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవానలి వారు నిర్ణయించారు. దీనిని తూచా తప్పకుండా పాటించాలని వారు నిశ్చయించుకున్నారు. వీటిని ఉల్లంఘించిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల ఇవ్వబోమని, వారికి ఇతర పదవులు కూడా రావని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు. దీనిని తూచా తప్పకుండా పాటిస్తే వచ్చే తరానికి ఆదర్శవంతమైన నాయకులు అందుతారని వారు అంటున్నారు. ఎమ్మెల్యే చేపట్టిన ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని తామంతా కోరుకుంటున్నట్లు ప్రజలు చెప్తున్నారు.

Tags:    

Similar News