దీపావళి వేళ టపాసులు కాలుస్తున్నారా? జర జాగ్రత్త
దీపావళి సందర్భంగా టపాసులు కాలుస్తూ గాయపడ్డారా? అయితే జాగ్రత్త అంటున్నారు సరోజినిదేవి కంటి ఆసుపత్రి వైద్యులు...
By : Shaik Saleem
Update: 2025-10-20 02:09 GMT
దీపావళి పర్వదినం వేళ ప్రజలు ఇంటి ముందు అందమైన ముగ్గులు, పూల తోరణాలు, కళకళలాడే దీపాలతో లక్ష్మీ పూజ చేస్తున్నారు. దీపావళి వేళ పిల్లల నుంచి పెద్దల దాకా టపాసులు కాలుస్తూ వేడుకలు చేసుకుంటున్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.
టపాసులు కాలుస్తున్నారా? జర జాగ్రత్త
టపాసులు కాలుస్తున్నపుడు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదాల బారిన పడతారని హైదరాబాద్ లోని సరోజిని దేవి కంటి ఆసుపత్రి వైద్యులు హెచ్చరించారు. ప్రతీ ఏటా దీపావళి సందర్భంగా కాలిన గాయాలతో వస్తున్న బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. టపాసులు కాల్చే ముందు చేతులకు రక్షిత తొడుగులు వాడాలని సరోజిని దేవి కంటి ఆసుపత్రి డాక్టర్ సన్బాల్ సూచించారు. ప్రథమ చికిత్స పెట్టెను అందుబాటులో ఉంచుకొని టపాసులు కాల్చాలని కోరారు.టపాసులు కాల్చేటపుడు కాటన్ దుస్తులు ధరించాలని డాక్టర్ కోరారు.
చికిత్సకు ఏడుగురు వైద్యుల బృందం
దీపావళి సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో గాయపడితే హైదరాబాద్ నగరంలోని సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో చికిత్స చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోడీని పంధర్‌పుర్కర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పండుగ సందర్భంగా చర్మం కాలడంతోపాటు కంటికి గాయాలైన వారికి తాము చికిత్స చేసేందుకు ఏడుగురు వైద్యులతో ప్రత్యేక బృందాన్ని నియమించామని ఆమె పేర్కొన్నారు. కనురెప్పలు, కార్నియా, రెటీనాలకు గాయాలైతే దృష్టికి ముప్పు కలుగుతుందని డాక్టర్లు హెచ్చరించారు. ఆసుపత్రిలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, సీనియర్ డాక్టర్లు, రెటీనా, కార్నియా వైద్యులు అందుబాటులో ఉంచామని వివరించారు.
కంటి గాయాలకు చికిత్స
దీపావళి టపాసులు కాలుస్తున్నపుడు ప్రమాదాలు జరిగి కంటికి గాయాలైతే తాము చికిత్స చేస్తామని సరోజినిదేవి కంటి ఆసుపత్రి వైద్యులు చెప్పారు. ముఖం, మెడ పై భాగం, ఇతర గాయాలైతే వారిని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి పంపిస్తామని వైద్యులు తెలిపారు. టపాసులు కాల్చేటపుడు కళ్లద్దాలు ధరించాలని వైద్యులు సూచించారు. పెద్దల పర్యవేక్షణలోనే క్రాకర్లు కాల్చాలని, బహిరంగ ప్రదేశంలోనే పేల్చాలని కోరారు.కాలిన గాయాలను శుభ్రమైన చల్లటి నీటితో కడిగి బర్న్ ఆయింట్ మెంట్ వేయాలని వైద్యులు సూచించారు.