చెరువు మధ్యలో అక్రమ నిర్మాణం.. బాంబులు పెట్టిన అధికారులు..

చెరువులను కబ్జా చేసి భవనాలు కట్టడం చూసుంటాం. కానీ సంగారెడ్డిలో ఓ వ్యక్తి అంతకుమించి అనేలా చెరువలోనే ఇల్లు కట్టేశాడు. దానిని అధికారులు ఏం చేశారంటే..

Update: 2024-09-26 10:27 GMT

హైడ్రా.. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో అక్రమ నిర్మాణాల యజమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఎప్పుడు ఎక్కడకు వచ్చి కూల్చివేతలు చేపడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. చెరువులు, కుంటలు, నాలాలు, ఎఫ్‌టీఆర్, ప్రభుత్వ భూములను కబ్జా కోరల నుంచి కాపాడటమే ప్రధాన ధ్యేయంగా ఏర్పడిందే ఈ హైడ్రా. రంగంలోకి దిగిన తొలి రోజు నుంచీ కూడా హైడ్రా.. తన మార్క్ చూపుతోంది. మెరుపువేగంతో ఆక్రమణలను గుర్తించడం.. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం చేసేస్తోంది. తాజాగా హైడ్రాకు ఓ భవనం కూల్చడం కాస్తంత చిక్కు ప్రశ్నలా మారింది. ఆ భవనాన్ని చెరువును ఆక్రమించి కట్టినట్లు నిరూపించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేకపోవడంతో.. వెంటనే కూల్చడానికి చర్యలు చేపట్టింది హైడ్రా. కానీ ఎలా చూల్చాలి.. అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. జేసీబీలు కాదు కదా మరే ఇతర హెవీ వెహికల్ కూడా ఆ భవనాన్ని చేరుకోలేదని నిర్ధారించుకుని.. చివరకు చేసేదేమీ లేక బాంబులు పెట్టి భవనాన్ని నేలమట్టం చేసింది. ఎందుకంటారా.. ఆ భవాన్ని చెరువు మధ్యలో నీళ్లలోనే కట్టేయడమే ఇందు కారణం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

చెరువు చుట్టు పక్కల స్థలాలను కబ్జా చేయడం సాధారణం. కొందరు మరో అడుగు ముందుకేసి చెరువులో కొంత భాగాన్ని మట్టితో పూడ్చేసి ఆ స్థలాన్ని కూడా తన ప్రాపర్టీలో కలిపేసుకుంటారు. అంత శ్రమ కూడా ఎందుకనుకున్నారేమో కానీ.. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీలోని కొందరు వ్యక్తులు.. చెరువులోనే బహుళ అంతస్తు బిల్డింగ్ కట్టేశారు. ఈ భవనం అక్రమ కట్టడం అని చెప్పడానికి పెద్ద చదువులు కానీ, ఉద్యోగాలు కానీ అవసరం లేదు. చిన్న పిల్లోడు కూడా చెప్పేస్తాడు. మరి అంత ధైర్యంగా చెరువును ఆక్రమించి మరీ భవనం ఎలా కట్టేశారో ఆ వ్యక్తులకే తెలియాలి. తాజాగా ఈ భవనం నిర్మాణం రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల కంటపడింది. చర్యలు చేపట్టాలని ఫిక్స్ అయ్యారు. భవనం నీటి మధ్యలో ఉండటంతో జేసీబీలు, ట్రక్కులు అక్కడకు చేరుకోవడం అసాధ్యం. దాంతో బాంబులు పెట్టి భవనాన్ని కూల్చేశారు అధికారులు. ఈ బాంబులు పేలిన సమయంలో శిథిలాలు ఎగిరిపడి ఇద్దరికి గాయాలయ్యాయి. వారికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

అనుమతులున్నాయా?

అయితే ఈ భవనం ఇప్పుడు కట్టింది కాదని, సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పదేళ్ల కిందటే దీనిని నిర్మించినట్లు సమాచారం. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో కట్టిన ఈ భవనం లోపలికి నీళ్లలో అడుగు పెట్టకుండా వెళ్లడానికి కొంత దూరం నుంచే స్కైవే తరహాలో మెట్లు నిర్మించుకున్నారు. అదే విధంగా భవనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మరికొన్ని మెట్లు కిందకు నీటిలోకి కూడా ఉన్నాయి. అంటే అలా సరదాగా స్విమ్మింగ్ పూల్‌లో కాళ్లు పెట్టుకుని కూర్చున్నట్లుగా ఇక్కడ చెరువులో కూడా కూర్చోవచ్చన్నమాట. ఈ క్రమంలోనే అసలు ఈ భవనం నిర్మించుకోవడానికి ఏమైనా అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? చెరువులో భవన నిర్మాణం జరిగిన ఇంత కాలం అవుతున్నా ఏ అధికారి ఎందుకు పట్టించుకోలేదు? వంటి ప్రశ్నలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.

Tags:    

Similar News