Uttam Kumar Reddy | కొత్త రేషన్ కార్డుపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ..
అసెంబ్లీ సమావేశాల్లో రేషన్ కార్డులపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.;
అసెంబ్లీ సమావేశాల్లో రేషన్ కార్డులపై వాడి వేడి చర్చ జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్య అక్రమ రవాణా కావడంపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుందని తెలిపారు. ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్ట్‌లను వెంటనే భర్తీ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. కుల గణన సర్వే ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, ఇప్పటికే కులగణన డేటా సేకరించామని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం ధరఖాస్తులు తీసుకుని, ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాతో కంపేర్ చేసిన తర్వాత కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. ఉన్న రేషన్ డీలర్ల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని, ఈ ప్రక్రియలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కొత్తగా పది లక్షల రేషన్ కార్డుల మంజూరు కావొచ్చని వివరించారు తద్వారా 31 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
‘‘ కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరుతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.956 కోట్ల భారం పడుతుంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు జారీ చెయ్యబోతున్నాం. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులలో అదనపు పేర్ల నమోదుకు గాను మీ సేవ కేంద్రం ద్వారా గడిచిన పదేళ్లలో వచ్చిన 18 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు’’ అని గుర్తు చేశారు.
‘‘నన్ను చైర్మన్‌గా సహచర మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉన్న ఈ ఉప సంఘం పలుమార్లు సమావేశమై సిఫారసులను క్యాబినెట్ ఆమోదం కోసం పంపింది. తెల్ల రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియలో సుప్రీంకోర్టుకు సక్సేనా కమిటీ సమర్పించిన సిఫారసులను పరిగణనలోకి తీసుకున్నాం. అంతేకాకుండా రాష్ట్రంలోని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు,లోకసభ,రాజ్యసభ సభ్యుల నుండి సేకరించిన సూచనలను కుడా మంత్రివర్గ ఉప సంఘం పరిగణనలోకి తీసుకుంటున్నాం. వీటన్నింటినీ అధ్యయనం చేసిన ఉపసంఘం కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరికి అర్హతా ప్రమాణాలు నిర్ణయిస్తూ చేసిన సిఫారసులను రాష్ట్ర క్యాబినెట్ ముందుంచాం’’ అని ఆయన తెలిపారు
‘‘రాష్ట్రంలో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణాల డీలర్ల భర్తీ ప్రక్రియను చేబడతాం. అంతేకాకుండా కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలతో పాటు తాండాలలో కుడా కొత్త చౌక ధరల దుకాణాల ఏర్పాటు ఉంటుంది. చౌక ధరల దుకాణాల ద్వారా ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న దొడ్డు రకం బియ్యాన్ని ప్రజలెవ్వరు వినియోగించక పోవడంతో దారి మళ్లు తున్న వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకనే తెల్ల రేషన్ కార్డు దారులందరికి ఇకపై సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చౌక ధరల దుకాణాల ద్వారా ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ ఆలోచన ఇప్పటి వరకైతే లేదు. ఏదన్నా ఉంటే క్యాబినెట్ ముందు పెట్టి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం’’ అని వెల్లడించారు.
‘‘తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో 91 లక్షల 68 వేల 231 రేషన్ కార్డులు ఉండేవి. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3.38 కోట్లు. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఇక్కడి నుండి ఆంద్రప్రదేశ్‌కు చెందిన వారు తమ తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లడంతో 2 లక్షల 46 వేల 324 రేషన్ కార్డులు రద్దు అయ్యాయి. అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డాక 2.7 కోట్ల లబ్ధిదారులకు గాను మొత్తం 89 లక్షల 21 వేల 907 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం సిరీస్‌కు కొత్త ఆహారభద్రత కార్డులు అనుసంధానం చేశాం’’ అని వివరించారు.
‘‘అదనంగా 2016 నుండి 2023 వరకు కొత్తగా 20 లక్షల 69 వేల మంది లబ్ధిదారులకు 6,47,479 ఆహార భద్రతా కార్డులు మంజూరు చేయడం జరిగింది. అదే 2016 నుండి 2023 వరకు 19 లక్షల మంది లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించి 5,98,000 ఆహార భద్రత కార్డులు తొలగించాం. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గడిచిన పదేళ్ళ వ్యవధిలో అంటే 2014 నుండి 2023 వరకు 86 వేల మంది లబ్ధిదారులకు మంజూరు చేసిన తెల్ల రేషన్ కార్డుల్లో ప్రభుత్వం జారీ చేసింది 49 వేల కార్డులు మాత్రమే. ప్రస్తుతం ఈ రోజున రాష్ట్రంలో మొత్తం 89.95 లక్షల తెల్ల రేషన్ కార్డులతో 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా జాతీయ ఆహారభద్రత కింద కేంద్ర ప్రభుత్వం 54 లక్షల కార్డులు అందించగా కోటి 91 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 35 లక్షల ఆహార భద్రతా కార్డులతో 89 లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారు’’ అని ఆయన సభకు వివరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.