Basant Nagar Airport| బసంత్ నగర్ విమానాశ్రయం ఏర్పాటుపై కొత్త ఆశలు

ప్రతిపాదనల్లో మగ్గుతున్న బసంత్ నగర్ విమానాశ్రయం ఏర్పాటుపై కొత్త ఆశలు ఏర్పడ్డాయి.కొత్త విమానాశ్రయాలపై సీఎం చేసిన ప్రకటనతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Update: 2024-11-26 02:59 GMT

బసంత్‌నగర్‌ విమానాశ్రయం (Basant Nagar Airport)డిమాండ్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్‌కు సమీపంలో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌ను (airstrip)విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన చాలా కాలంగా ఉంది.(long-standing proposal) తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై ఇటీవల తెలంగాణ సీఎం ప్రకటనతో బసంతనగర్‌ విమానాశ్రయం ఏర్పాటుపై ప్రజల్లో ఆశలు చిగురించాయి.

- వరంగల్‌, రామగుండం, కొత్తగూడెం, ఆదిలాబాద్‌లలో విమానాశ్రయాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(A Revanth Reddy) ఇటీవల చేసిన ప్రకటనతో బసంతనగర్‌ విమానాశ్రయం అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
- బసంత్ నగర్ విమానాశ్రయం ఏర్పాటుకు హై టెన్షన్ వైర్లు, కొండలు ఆటంకంగా మారినందున, వాటిని తొలగిస్తే ఉడాన్ పథకం కింద విమానాశ్రయం ఏర్పాటు సాధ్యమవుతుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మాజీ ఓఎస్‌డీ, ఏవియేషన్ నిపుణుడు తెలంగాణకు చెందిన నోముల శ్రీనివాసరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

బసంతనగర్‌ ఎయిర్‌స్ట్రిప్‌
1980వ దశకంలో కేసోరం సిమెంట్ ఫ్యాక్టరీ అధికారులు బసంత్ నగర్ లో ప్రభుత్వ భూమిని అద్దెకు తీసుకుని ఎయిర్‌స్ట్రిప్‌ను అభివృద్ధి చేశారు.ఇక్కడ వాయుదూత్ విమానాలను ల్యాండ్ చేయడానికి ఉపయోగించారు.ఆ తర్వాత వాయుదూత్‌ విమాన సేవలు నిలిపివేయడంతో ఎయిర్‌స్ట్రిప్‌కు ప్రయోజనం లేకుండా పోయింది.బసంత్ నగర్ లో విమానాశ్రయం కోసం ప్రతిపాదన వచ్చినా వివిధ కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు.

ఉడాన్ కార్యక్రమం కింద...
2017 వ సంవత్సరం ఆగస్టు నెలలో ప్రకటించిన ఉడాన్ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా చిన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈ నేపథ్యంలో బసంత్ నగర్ లో విమానాశ్రయం కోసం ఆశలు మొదలయ్యాయి. ఉడాన్ కార్యక్రమంలో భాగంగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన బృందం కూడా 2019వ సంవత్సరం మార్చి నెలలో బసంత్‌నగర్‌ను సందర్శించి వివిధ అంశాలను పరిశీలించింది. టెక్నో సాధ్యాసాధ్యాల నివేదికను సిద్ధం చేయడానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండి టెక్నికల్ ఇంజనీర్ శ్రీనివాస మూర్తి 2020వ సంవత్సరం ఆగస్టు 10వతేదీన బసంత్ నగర్ ఎయిర్‌స్ట్రిప్‌ను సందర్శించి, ఏఏఐకి నివేదికను సమర్పించారు.

వరద నీటి స్థాయిపై నివేదిక
ఈ నివేదిక ఆధారంగా ఎయిర్ పోర్టు అథారిటీ (Airport Authority of India) ప్రతిపాదిత బసంత్ నగర్ వద్ద వరద నీటి స్థాయిల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరింది.వరదనీటి వివరాలను పంపించాలని రోడ్ అండ్ బిల్డింగ్స్ ఇంజనీర్-ఇన్-చీఫ్ వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్‌లకు లేఖలు రాశారు.వరంగల్, ఆదిలాబాద్, నజియాబాద్‌లోని జక్రాన్‌పల్లి, బద్రాద్రి-కొత్తగూడెం, పెద్దపల్లిలోని బసంత్‌నగర్, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్ర వంటి ప్రతిపాదిత ఆరు విమానాశ్రయ స్థానాలకు సంబంధించిన వరదనీటి వివరాలను అందించాలని ఎస్‌ఈలను కోరారు.

బసంత్ నగర్ విమానాశ్రయం సాంకేతికంగా సాధ్యం కాదా?
తర్వాత బసంత్ నగర్ విమానాశ్రయం ఏర్పాటు అంశం పురోగతిలో లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత సంవత్సరం బడ్జెట్‌లో ప్రకటించిన 152 విమానాశ్రయాలలో బసంత్‌నగర్ విమానాశ్రయం గురించి ప్రస్తావించలేదు. అంతేకాదు బసంత్‌నగర్‌లోని విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడం సాంకేతికంగా సాధ్యం కాదని అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి వీకే సింగ్ స్పష్టం చేశారు.

హై టెన్షన్ వైర్లు, కొండలు ఆటంకమా?
బసంత్ నగర్ విమానాశ్రయం ప్రతిపాదిత ప్రాంతానికి సమీపంలో ఉన్న హై టెన్షన్ వైర్లు, కొండలు విమానాశ్రయానికి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు చెప్పారు.బసంత్ నగర్ సమీపంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి దక్షిణ భారతదేశానికి విద్యుత్ సరఫరా చేసే హైటెన్షన్ వైర్లు ప్రస్తుత బసంత్ నగర్ ఎయిర్‌స్ట్రిప్ గుండా వెళుతున్నాయి. హైటెన్షన్ వైర్లతో పాటు కన్నాల గ్రామంలో ఉన్న బోడగుట్ట కొండ విమానాశ్రయానికి మరో అడ్డంకిగా మారిందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యలను కూడా ఎయిర్ పోర్టు అథారిటీ అధికారుల బృందం తన పర్యటనలో లేవనెత్తింది. హైటెన్షన్ వైర్లు, బోడగుట్ట గుట్టల వల్ల విమానం ల్యాండింగ్‌కు వెళ్లే మార్గంలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని బృందం పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగానికి సూచించింది.

హైటెన్షన్ వైర్లు తొలగిస్తామని అధికారుల ప్రతిపాదన
విమానాశ్రయం ఏర్పాటుకు మార్గం క్లియర్ చేయడానికి హైటెన్షన్ వైర్లు, కొండలను తొలగిస్తామని పెద్దపల్లి జిల్లా అధికారులు ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులకు హామీ ఇచ్చారు.బసంత్ నగర్ ఎయిర్‌స్ట్రిప్ 288 ఎకరాల్లో విస్తరించి ఉంది.విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి మరో 350 ఎకరాల భూమి అవసరం. 291 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండగా మరో 60 ఎకరాలు సేకరించాలని పెద్దపల్లి జిల్లా అధికారులు నిర్ణయించారు. తెలంగాణలో కొత్త విమానాశ్రయాల నిర్మాణం చేపట్టనున్న తరుణంలో బసంత్ నగర్ విమానాశ్రయం నిర్మాణంపై ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.



Tags:    

Similar News