National Turmeric Board | నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభం

ఇందూరు పసుపు రైతుల దీర్ఘకాల కల సాకారం అయింది.నిజామాబాద్‌లో పసుపుబోర్డు కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ప్రారంభించారు.;

Update: 2025-01-14 06:11 GMT

ఇందూరు పసుపు రైతుల దీర్ఘకాల కల ఎట్టకేలకు సాకారం అయింది. నిజామాబాద్ నగరంలో పసుపు బోర్డు కార్యాలయం మంగళవారం ప్రారంభమైంది. పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ప్రారంభించారు.

- గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోదీ 2023 అక్టోబరు 1వతేదీన మహబూబ్ నగర్ బహిరంగ సభలో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబరు 4వతేదీన కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తర్వాత నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించారు.
- పసుపు బోర్డుకు ఛైర్మన్ గా అంకాపూర్ గామానికి చెందిన రైతు , బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని కేంద్రం నియమించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- సంక్రాంతి కానుకగా మోదీ పసుపుబోర్డును తెలంగాణకు ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను పసుపు రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని బోర్డు ఛైర్మన్ పల్లెపు గంగారెడ్డి చెప్పారు.

మకర సంక్రాంతికి మర్చిపోలేని బహుమతి ఇచ్చారు...
ప్రధానమంత్రి మోదీ ఆశీస్సులతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పట్టుదలతో దశాబ్దాల పసుపు రైతుల కల నెరవేరింది. మోదీ దీవించారు, ధర్మపురి అర్వింద్ సాధించారు అంటూ ఇందూరు రైతులు వ్యాఖ్యానించారు. ‘‘మకర సంక్రాంతికి మోదీజీ మరచిపోలేని బహుమతి ఇచ్చారు, నిజామాబాద్ ప్రధాన కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ప్రారంభం అయింది, మాటిచ్చా నెరవేర్చా’’ అని అర్వింద్ వ్యాఖ్యానించారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, కేంద్ర వాణిజ్యశాఖ అధికారులు కేసంగి యంగోజామ్ శేర్పా, రేమాశ్రీ, హేమలత తదితరులు పాల్గొన్నారు.


కేంద్రమంత్రికి పసుపు కొమ్ముల దండ

పసుపు బోర్డు ప్రారంభం వల్ల రైతులు పండించిన పంటకు మంచి ధర రావడంతోపాటు స్టోరేజీ సౌకర్యం పెరుగుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. పసుపు బోర్డు ప్రారంభం సందర్భంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు పసుపుకొమ్ములతో తయారు చేసినదండను వేశారు. కేంద్రమంత్రితో కలిసి ఢిల్లీ నుంచి పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో పసుపుబోర్డు ప్రారంభంతో గిట్టుబాటు ధర లభిస్తుందని అర్వింద్ చెప్పారు. దీంతోపాటు మరిన్ని ప్రాజెక్టులు తీసుకువస్తానని అర్వింద్ హామి ఇచ్చారు.

పసుపు రైతుల జీవితాల్లో మోదీ వెలుగు నింపారు...

పసుపుబోర్డును సరైన దిశగా నడిపించాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పల్లె గంగారెడ్డిని కోరారు.నిజామాబాద్ లో పసుపుబోర్డును ఏర్పాటు చేసి మోదీ పసుపు రైతుల జీవితాల్లో వెలుగు నింపారని పీయూష్ వ్యాఖ్యానించారు.రైతులకు మోదీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని పీయూష్ వ్యాఖ్యానించారు. తాను రైతులకు అండగా ఉంటానని నిజామాబాద్ పసుపుబోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి హామి ఇచ్చారు.



Tags:    

Similar News