కొండా సురేఖకు కోర్టు నోటీసులు.. మంత్రికి రెండు వారాలే టైమ్..!

హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసు విచారణలో భాగంగా మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.

Update: 2024-10-10 12:06 GMT

హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసు విచారణలో భాగంగా మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై తన వివరణ ఇవ్వాలని న్యాయస్థానం సదరు మంత్రిని నోటీసుల్లో కోరింది. అనంతరం కేసు విచారణను ఈ నెల 23 వరకు వాయిదా వేసింది. తదుపరి విచారణలోపు మంత్రి కొండా సురేఖ తన వివరణ అందించాలని న్యాయస్థానం వెల్లడించింది. కాగా తన కుటుంబం గురించి మంత్రి అసభ్యకరంగా మాట్లాడారని, తమకు సామాజికంగా ఉన్న పరువు ప్రతిష్టలను దెబ్బతీశారంటూ అక్టోబర్ 8న నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో భాగంగా నాగార్జున సహా పలువురు సాక్ష్యుల వాంగ్మూలాలను అధికారులు రికార్డ్ చేసుకున్నారు.

అనంతరం విచారణలో భాగంగా న్యాయస్థానం మంత్రి వివరణ కోరారు. తన వివరణ ఇవ్వడానికి సదరు మంత్రికి రెండు వారాల సమయం ఇచ్చింది న్యాయస్థానం. ఇంతలోనే మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. తనను ఉద్దేశించి మంత్రి అత్యంత దారుణంగా మాట్లాడి తన పరువుకు భంగం కలిగించారని, మాజీ మంత్రికి, ప్రజా నాయకుడిగా ఆమె మాటలను తన, తన కుటుంబ పరువును దెబ్బతీశాయని ఆయన ఈరోజు నాంపల్లి కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కొండా సురేఖ చుట్టూ పరువు ఉచ్చు బిగుస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రణాళికలు వేగవంతం చేయడంతో.. కొండా సురేఖ పదవి హుష్ కాకి అవుతుందా అన్న చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి.

కేటీఆర్ డిమాండ్లు ఏంటో..?

కొండా సురేఖపై హీరో నాగార్జున దాదాపు రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ప్రస్తుతం ఈ కేసు నాంపల్లి కోర్టు విచారణలో ఉంది. ఈ క్రమంలోనే తాజాగా కేటీఆర్ కూడా సురేఖ మీద పరువు నష్టం దావా వేశారు. మరి కేటీఆర్ తాజా డిమాండ్ ఏమిటన్నది ఇంకా తేలలేదు. కేటీఆర్ మీద నిరాధార ఆరోపణలు చేసినందుకు మంత్రి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నేతలు చాలామంది డిమాండ్లు చేశారు. అయితే కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్లు సురేఖ పదేపదే చెప్పారు. దాంతో ఇక లాభంలేదని అనుకుని కేటీఆర్ గురువారం సురేఖ మీద కేసు వేసినట్లున్నారు. ఇదే విషయమై నాలుగురోజుల క్రితం సురేఖ తరపు లాయర్ తిరుపతి వర్మ మీడియాతో మాట్లాడుతు మంత్రి మీద నాగార్జున వేసిన కేసు నిలవదని చెప్పారు. ఎందుకంటే మంత్రికి వ్యతిరేకంగా వేసిన కేసులో నాగార్జున, నాగచైతన్య, సాక్షి సుప్రియ భిన్నమైన స్టేట్మెంట్లు ఇచ్చినట్లు చెప్పారు. ఒకే కేసులో ఇన్ని రకాల స్టేట్మెంట్లు ఇచ్చారు కాబట్టే మంత్రి మీద వేసిన కేసు నిలబడదని వర్మ ధీమా వ్యక్తంచేశారు. మరీ నేపధ్యంలో కేటీఆర్ వేసిన కేసు ఏమవుతుందో చూడాలి.

నాగార్జున వాంగ్మూలంలో ఏముందంటే..!

కొండా సురేఖపై నాగార్జున ఫైల్ చేసిన పిటిషన్ విచారణ మంగళవారం తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్బంగా పిటిషన్ వేయడానికి కారణం ఏంటని కోర్టు ప్రశ్నించింది. అందుకు నాగార్జున బదులిస్తూ.. ‘‘మంత్రి కొండా సురేఖ.. నా కుటుంబం గురించి అమర్యాదగా వ్యాఖ్యలు చేశారు. ఆమె తన వ్యాఖ్యల ద్వారా మా కుటుంబం పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించారు. సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి ఇండస్ట్రీలో కానీ, సమాజంలో కానీ మంచి పేరు, ప్రతిష్టలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మా కుటుంబానికి గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలు కూడా మా కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. మా కుటుంబీకులు అనేక జాతీయ స్థాయి అవార్డులు కూడా అందుకున్నాం. అటువంటి మా కుటుంబాన్ని ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నా కొడుకు విడాకులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ కారణమని చెప్తూ మంత్రి అసభ్యకరంగా మాట్లాడారు. ఆమె మాటల వల్ల మా పరువుకు భంగం కలిగింది. అందుకు న్యాయం పొందాలనే పిటిషన్ దాఖలు చేశాం. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరుతున్నాను’’ అని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News