తెలంగాణా టీడీపీ @ 30

ఆదివారం ఉదయం ఎన్టీయార్ ట్రస్ట్ భవన్లో తెలంగాణా నేతలు, క్యాడర్ సమావేశంలో చంద్రబాబులోని ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనబడింది.

Update: 2024-07-07 09:32 GMT

చంద్రబాబునాయుడులో రెట్టించిన ఉత్సాహం కనబడుతోంది. ఆదివారం ఉదయం ఎన్టీయార్ ట్రస్ట్ భవన్లో తెలంగాణా నేతలు, క్యాడర్ సమావేశంలో చంద్రబాబులోని ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనబడింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ నేతలతో కలవటానికి పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. అలాంటిది ఎన్నికల్లో అఖండ విజయం ఇచ్చిన ఉత్సాహంతో తెలంగాణాలో కూడా పార్టీని రీస్ట్రక్చర్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.

ఇదే విషయమై నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతు తెలంగాణా గడ్డమీద పుట్టిన తెలుగుదేశంపార్టీ ఉండాలా వద్దా ? అని అడిగారు. తెలుగువాళ్ళ ప్రయోజనాల కోసం తెలుగుదేశంపార్టీ ఉండాలా ? లేదా అని అడిగారు. నేతలు, క్యాడర్ ముక్తకంఠంతో టీడీపీ ఉండాలని గట్టిగా జవాబిచ్చారు. అంటే తెలంగాణాలో టీడీపీని మళ్ళీ బలోపేతం చేయాలన్న తన ఆలోచనను నేతలు, కార్యకర్తలతోనే చెప్పించారు. పార్టీని రీ స్ట్రక్చర్ చేసి బలోపేతం చేయబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. పార్టీని బలోపేతం చేయటంలో భాగంగానే సభ్యత్వ నమోదు చేయటం, తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో పాల్గొనే విషయమై నేతలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకోవటం, పార్టీ పదవుల్లో యువతకు టాప్ ప్రయారిటి ఇవ్వటం లాంటి విషయాలను చంద్రబాబు ఆలోచిస్తున్నారు.

తొందరలోనే పార్టీకి అధ్యక్షుడిని నియమించి, కమిటీలను ఏర్పాటుచేసి మరో 30 ఏళ్ళు తెలంగాణాలో టీడీపీ బలంగా ఎదిగేట్లు అన్నీ చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ అభివృద్ధికి తానుచేసిన కృషిని చంద్రబాబు గుర్తుచేశారు. హైటెక్ సిటీని నిర్మించటం, నగరంలో రోడ్లు విశాలంచేయటం, ఐటి రంగాన్ని తీసుకురావటాన్ని చంద్రబాబు చెప్పుకున్నారు. తన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా డెవలప్మెంట్ ను కంటిన్యు చేసినట్లు చెప్పారు. అలాగే ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అభివృద్ది చేసిందన్నారు. ఇపుడు రేవంత్ ప్రభుత్వం కూడా అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నట్లు కితాబిచ్చారు. తన 15 నిముషాల ప్రసంగంలో ఎక్కడ కూడా తెలంగాణాకు వ్యతిరేకంగా చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడకపోవటాన్ని పక్కనపెడితే కనీసం బీఆర్ఎస్ లేదా కేసీయార్ ప్రస్తావన కూడా రాకుండా జాగ్రత్తపడ్డారు. మొత్తంమీద తెలంగాణా గడ్డపై టీడీపీ బలోపేతానికి చంద్రబాబు చర్యలు తీసుకోబోతున్న విషయంలో క్లారిటి వచ్చేసింది. మరి చర్యలు ఎప్పటినుండి మొదలుపెడతారు ? ఏ రూపంలో మొదలుపెడతారన్న విషయం మాత్రం సస్పెన్సుగా ఉండిపోయింది. రాష్ట్రవిభజనతోనే తెలంగాణాలో పార్టీ దెబ్బతిన్నది. కేసీయార్ దెబ్బకు దాదాపు నేలమట్టమైపోయింది. 2019లో ఓటమి కారణంగా తెలంగాణాలో టీడీపీ కేవలం లెటర్ హెడ్లకు మాత్రమే పరిమితమైంది. అలాంటిది 2024 ఎన్నికల్లో అఖండవిజయంతో మళ్ళీ తెలంగాణాలో పార్టీకి జవసత్వాలు రాబోతున్నాయి. మరి అందుకు చంద్రబాబు నాంది ఎప్పుడు, ఏ రూపంలో వేస్తారో చూడాల్సిందే.

Tags:    

Similar News