Nagarjuna | తెలంగాణ పర్యాటక స్థలాలపై నాగార్జున ప్రచార వీడియో
తెలంగాణ సీఎం పిలుపు మేర సినీనటుడు నాగార్జున పర్యాటక స్థలాలపై ప్రచార వీడియోను విడుదల చేశారు. రండి తెలంగాణలో ఎంజాయ్ చేయండి అంటూ నాగార్జున వీడియోలో కోరారు.;
By : Shaik Saleem
Update: 2025-01-09 14:49 GMT
తెలంగాణ రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.తెలంగాణలోని శక్తివంతమైన సంస్కృతి, గొప్ప వారసత్వం, అద్భుతమైన పర్యాటక ప్రదేశాల గురించి ప్రతిబింబిస్తుంది. జోడేఘాట్ వ్యాలీ,వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, భోగోత జలపాతం, యాదగిరిగుట్ట ఎన్నెన్నో అందాల పర్యాటక కేంద్రాలంటే తనకు ఎంతో ఇష్టమని ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున గురువారం విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు.
తెలంగాణను సందర్శించండి
‘‘నేను చిన్నప్పటి నుంచి తెలంగాణలోని అన్ని పర్యాటక స్థలాలన్నీ తిరిగాను. జోడేఘాట్ వ్యాలీ, వేయి స్తంభాల గుడి,రామప్ప దేవాలయం, భోగోత జలపాతం, యాదగిరిగుట్ట పలు సార్లు సందర్శించాను. తెలంగాణ భోజనంలో జొన్నరొట్టెలు, అంకాపూర్ చికెన్ , సర్వపిండి, హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ ఛాయ్, కరాచీ బిస్కెట్లు అంటే నాకెంతో ఇష్టం... మీరందరూ తప్పకుండా తెలంగాణకు రండి, తెలంగాణలో పర్యాటక కేంద్రాలను సందర్శించి ఎంజాయ్ చేయండి, జరూర్ ఆనా హమారా తెలంగాణ’’ అంటూ నాగార్జున వీడియోలో పర్యాటకులకు పిలుపునిచ్చారు.
గోదావరి తీరంలో యేరు ఉత్సవాలు
నాగార్జున విడుదల చేసిన పర్యాటక ప్రాంతాల ప్రచార వీడియో తెలంగాణలోని ప్రత్యేక ఆకర్షణలను వెలుగులోకి తెస్తుందని, తెలంగాణ అందాలను చాలా మందికి స్ఫూర్తినిస్తుందని పర్యాటక శాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ జనవరి 1 నుంచి 9వతేదీ వరకు భద్రాద్రిలోని గోదావరి తీరంలో యేరు ఉత్సవాలు ఏర్పాటు చేసింది. దివ్యమైన సాంస్కృతిక ప్రదర్శనలు, అలంకరించిన నదీ ఘాట్, స్వచ్ఛమైన సేంద్రీయ సంప్రదాయ గిరిజన ఉత్పత్తులు, భద్రాచలం గోదావరి ఘాట్‌లో నదిలో బోటింగ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.