కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన నాగార్జున.. ఏం చెప్పారంటే..!

తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువునష్టం దావా విచారణలో భాగంగా నాగార్జున, ఆయన కుటుంబం ఈరోజు కోర్టులో తమ వాంగ్మూలం ఇచ్చారు.

Update: 2024-10-08 10:58 GMT

తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువునష్టం దావా విచారణలో భాగంగా నాగార్జున, ఆయన కుటుంబం ఈరోజు కోర్టులో తమ వాంగ్మూలం ఇచ్చారు. కోర్టు విచారణకు నాగార్జున‌తో నాగచైతన్య, అమల, సుశీల కూడా హాజరయ్యారు. సాక్షులుగా సుప్రియ, అట్ల వెంకటేశ్వర్లు హాజరయ్యారు. వారంతో అధికారుల సమక్షంలో తమ వాంగ్మూలాలు అందించారు. అయితే తన రాజకీయాల కోసం మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై నిరాధారమైన, అతి జుగుప్సాకరమైన ఆరోపణలు చేశారంటూ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబ పరువుకు ఆమె తీవ్ర భంగం కలిగించారని, ఆమె చేత పరువు నష్టం ఇప్పించడంతో పాటు ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన పిటిషన్ విచారణలో భాగంగా.. సోమవారం విచారణ జరిపిన కోర్టు.. నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోరారు. ఈ సందర్భంలోనే సాక్షుల వాంగ్మూలాలను కూడా రికార్డు చేయాలని న్యాయవాదులు కోరారు. అయితే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు కొండా సురేఖ చెప్పినప్పటికీ నాగార్జున కావాలనే కేసులు అంటూ ఆమె ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, ఈ విషయంలో తామూ నాగార్జునపై కేసు పెడతామని కొండా సురేఖ తరపు న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు.

నాగార్జున వాంగ్మూలం ఇదే..

కొండా సురేఖపై నాగార్జున ఫైల్ చేసిన పిటిషన్ విచారణ మంగళవారం తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్బంగా పిటిషన్ వేయడానికి కారణం ఏంటని కోర్టు ప్రశ్నించింది. అందుకు నాగార్జున బదులిస్తూ.. ‘‘మంత్రి కొండా సురేఖ.. నా కుటుంబం గురించి అమర్యాదగా వ్యాఖ్యలు చేశారు. ఆమె తన వ్యాఖ్యల ద్వారా మా కుటుంబం పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించారు. సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి ఇండస్ట్రీలో కానీ, సమాజంలో కానీ మంచి పేరు, ప్రతిష్టలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మా కుటుంబానికి గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలు కూడా మా కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. మా కుటుంబీకులు అనేక జాతీయ స్థాయి అవార్డులు కూడా అందుకున్నాం. అటువంటి మా కుటుంబాన్ని ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నా కొడుకు విడాకులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ కారణమని చెప్తూ మంత్రి అసభ్యకరంగా మాట్లాడారు. ఆమె మాటల వల్ల మా పరువుకు భంగం కలిగింది. అందుకు న్యాయం పొందాలనే పిటిషన్ దాఖలు చేశాం. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరుతున్నాను’’ అని నాగార్జున చెప్పుకొచ్చారు.

ఇదిలా ఈ నెల 3న మంత్రి కొండా సురేఖపై హీరో అక్కినేని నాగార్జున రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేశారు. సమంత, తన కుటుంబాన్ని ఉద్దేశించి ఆమె చేసిన నిరాధారా వ్యాఖ్యలకు గానూ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టును కోరారు. ఆమె తన కుటుంబ పరువును దెబ్బతీసేలా మాట్లాడారాని, అందుకు గానూ తగిన చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి మనోరంజన్ కోర్టును ఆశ్రయించారు. వారి స్వార్థ రాజకీయాల కోసం తమ కుటుంబాన్ని బజారుకీడ్చటం ఏమాత్రం సబబు కాదని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. మరెవరూ తమ స్వార్థ రాజకీయాల కోసం మరో కుటుంబాన్ని రోడ్డుకీడ్చే ధైర్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని నాగార్జున తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది.

కొండా సురేఖ ఏమన్నారంటే...

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ కి కేటీఆర్ కారణమంటూ కొండా సురేఖ ఇటీవల మీడియా ఎదుట ఆరోపించారు. వరుసపెట్టి కేటీఆర్ పై విరుచుకుపడుతున్న ఆమె... జరుగుతున్న ఇష్యూకి ఎలాంటి సంబంధం లేని నాగ చైతన్య-సమంత విడాకుల వ్యవహారం బయటకి తెచ్చి, అక్కినేని ఫ్యామిలీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "సమంతను తన దగ్గరకు పంపమని కేటీఆర్ అడిగారు.. సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్ళమని నాగార్జున వాళ్ళు ఒత్తిడిపెట్టారు.. కేటీఆర్ దగ్గరకు వెళ్ళటం ఇష్టంలేదని సమంత తెగేసి చెప్పారు.. కేటీఆర్ దగ్గరకు వెళ్ళకపోతే ఇంట్లో ఉండొద్దని చెప్పటంతోనే సమంత నాగచైతన్యకి విడాకులిచ్చి ఇల్లు విడిచి బయటకు వచ్చేసింది" అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఇండస్ట్రీ మొత్తం ఒక్కటై కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అక్కినేని ఫ్యామిలీకి మద్దతు తెలుపుతూ, మీ స్వార్ధ రాజకీయాల కోసం ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను బయటకి లాగొద్దంటూ చురకలంటించారు.

Tags:    

Similar News