‘‘ఖాళీ చేసేది లేదు’’.. అధికారులకు చుక్కలు చూపించిన మూసీ నిర్వాసితులు

మూసీ నది ప్రక్షాళనను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా దీనిని పూర్తి చేయాలన్న లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తోంది.

Update: 2024-09-26 07:20 GMT

మూసీ నది ప్రక్షాళనను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా దీనిని పూర్తి చేయాలన్న లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను తొలగించడానికి ప్రత్యేక సర్వే చేపట్టింది. తొలి విడత సర్వే పూర్తిగా.. మరోసారి అక్కడ రీసర్వేను చేపట్టారు అధికారులు. కూల్చివేయాల్సిన నిర్మాణాలను మార్క్ చేస్తున్నారు. ఈ మేరకు దాదాపు 16 బృందాలు రంగంలోకి దిగి రీసర్వేను పరుగులు పెట్టిస్తున్నాయి. వీటిలో 4 బృందాలు రంగారెడ్డిలో, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో ఐదు బృందాలు సర్వే చేస్తున్నాయి. బఫర్‌జోన్‌లో ఉన్న నిర్మాణాలను గుర్తించి.. వాటిని తొలగించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. చాదర్‌ఘాట్, మూసానగర్, శంకర్‌నగర్‌లో అధికారులు సర్వే నిర్వహించారు. ఈ క్రమంలోనే హదరాబాద్‌లో మూసీ పరివాహక ప్రాంతంలో సర్వే కొసం వెళ్లిన అధికారులను అక్కడి స్థానికులు అడ్డగించారు. సర్వే చేయడానికి వీళ్లేదంటూ మండిపడ్డారు. తాము కూల్చేందుకు రాలేదని, కేవలం వివరాలు తీసుకుని వెళ్లిపోతామని అధికారులు చెప్పినా ససేమిరా అంటూ అడ్డంగా నిలిచారు స్థానికులు.

ఖాళీ ప్రసక్తే లేదు..

అధికారులను అడ్డుకున్న స్థానికులు.. ఎవరు ఏం చెప్పినా.. ఎన్ని నోటీసులు ఇచ్చినా తాము తమ ఇళ్లను ఖాళీ చేసే ప్రసక్తే లేదంటూ మండిపడ్డారు. తమ ఇళ్లను కూల్చే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని కూడా అధికారులను నిలదీశారు. తాము కూల్చివేతలకు రాలేదని, సర్వేకు మాత్రమే వచ్చామంటూ అధికారులు చెప్పినా స్థానికులు వినిపించుకోలేదు. వెంటనే వారు అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అధికారులను హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక.. అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

ఆ తర్వాత కూల్చివేతలు

ఇదిలా ఉంటే మూసీ నది అభివృద్ధి కార్యాచరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రభుత్వం చెప్తోంది. దాదాపు బఫర్ జోన్‌లో ఉంటున్న 15 వేల కుటుంబాలకు రెండు గదుల ఇళ్లను కేటాయించడానికి రంగం సిద్ధం చేసినట్లు ప్రభుత్వం వివరిస్తోంది. ముసీ పరివాహక ప్రాంతాల్లో ఏళ్ల తరబడి వేల కుంటుంబాలు ఉంటున్నాయని, ఎందరో చిరు వ్యాపారస్తులు కూడా ఉంటున్నారని, వారందరికీ పునరావాసం కల్పించిన తర్వాతనే మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు చేస్తామని కూడా ప్రభుత్వం తెలిపింది.

Tags:    

Similar News