ఆలస్యం, అంతరాయం.. అందుకే చింతిస్తున్నాం !!

ఒకప్పుడు హైదరాబాద్ లో ఎక్కువ ఆదరణ పొందిన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థలో (MMTS) ఒకటి. తక్కువ కనెక్టివిటీ ఉన్న ఎంఎంటీఎస్ సేవలు సరసమైన ధరలలో ఉంటాయి.

By :  Vanaja
Update: 2024-04-08 13:05 GMT

ఒకప్పుడు హైదరాబాద్ లో ఎక్కువ ఆదరణ పొందిన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం (MMTS) ఒకటి. మహానగరంలో మారుతున్న జీవన శైలి, రవాణా వ్యవస్థలో అత్యాధునిక మార్పులు జోడవడంతో క్రమంగా ఎంఎంటీఎస్ లలో ప్రయాణించేవారి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. మరోవైపు ఇవి సకాలంలో రాకపోవడం, ఆకస్మికంగా రద్దు చేయబడడం కూడా ప్రజలు ఇతర రవాణా వ్యవస్థలపై ఆధారపడుతున్నారు.

తక్కువ కనెక్టివిటీ ఉన్నప్పటికీ సామాన్యుడికి ఎంఎంటీఎస్ సేవలు సరసమైన ధరలలో ఉంటాయి. ఒక ప్రయాణికుడు 20 కిలోమీటర్ల దూరానికి ఆర్టీసీ బస్సుల్లో రూ. 30, అదే మెట్రోలో అయితే రూ. 50 చెల్లించాల్సి ఉండగా, MMTSలో టికెట్ ధర రూ. 10 కంటే తక్కువ. కానీ ఇప్పుడు ప్రయాణికులు డబ్బు కంటే సమయానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. తరచూ ఈ రైళ్లు ఆలస్యంగా రావడం, రద్దుల కారణంగా ఇతర ప్రత్యామ్నాయ రవాణాను చూసుకుంటున్నారు.

ఎంఎంటీఎస్ నెట్‌వర్క్ దాదాపు 40 స్టేషన్‌లతో 140 కి.మీల మేర విస్తరించి ఉన్నప్పటికీ, రైడర్‌షిప్ రోజుకు 50,000 కంటే తగ్గిపోయింది. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం లోకల్ రైళ్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా, అది ఆచరణలో కనిపించడం లేదు. ట్రాక్ మెయింటెనెన్స్, ఆపరేషనల్ అంశాల వంటి పలు కారణాల వల్ల ఎంఎంటీఎస్ సర్వీసులు లాభదాయకంగా లేవని తరచూ రద్దు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌, లింగంపల్లి, ఘట్‌కేసర్‌, ఫలక్‌నుమా, తెల్లాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఆలస్యమైన, రద్దు చేసిన రైళ్లపై ప్రయాణికుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి దాదాపు 40 ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దయ్యాయని, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు.

"లోకల్ ట్రైన్స్ సమయానికి రాకపోవడం వలనే చాలా మంది ప్రయాణీకులు ఇతర రవాణా మార్గాలకు మారుతున్నారు" అని రామకిష్టాపురం కి చెందిన ప్రైవేట్ ఉద్యోగిని స్నేహిత తెలిపారు.

"మేము అల్వాల్ కూరగాయల మార్కెట్ నుండి కూరగాయలు కొనుక్కుని, అక్కడ లోకల్ ట్రైన్ ఎక్కి అమ్ముగూడ లేదా రామకిష్టాపురంలో దిగి చుట్టుపక్కల తిరిగి కూరగాయలు అమ్ముకుని సాయంత్రం మళ్ళీ లోకల్ ట్రైన్ లో మా ప్రాంతాలకు వెళ్లిపోయేవాళ్ళం. కరోనా తర్వాత నుండి ట్రైన్స్ సరిగా ఉండట్లేదు, ఒక్కోసారి పొద్దున్న ఆలస్యంగా వస్తున్నాయి. దీంతో ఆటోలకి రావాల్సి వస్తుంది. వచ్చిన లాభం ఆటో ఛార్జీలకు సరిపోతున్నాయి" అని కొండయ్య అనే కూరగాయల వ్యాపారి తెలిపారు.

సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు MMTS రైళ్ల ప్రోత్సాహాన్ని పెంచడానికి చేసిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇవ్వడంలో విఫలమయ్యాయని చెబుతున్నారు. రద్దీ సమయాల్లో సుదూర ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే ఎంఎంటీఎస్ రైళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. మెట్రో ట్రైన్స్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ‘మహాలక్ష్మి’ ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రభావం ఎంఎంటీఎస్ రైళ్లపై పడిందని ప్రయాణికులు భావిస్తున్నారు.

Tags:    

Similar News