కార్పొరేట్ సీఈఓగా మరో హెచ్పీఎస్ పూర్వ విద్యార్థి

ట్రంప్ బెదిరించినా పెరుగుతున్న ఇండియన్ గ్లోబల్ సీఈఓలు;

Update: 2025-07-30 05:11 GMT
శైలేష్ జెజురికర్

హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్న శైలేష్ జెజురికార్ ప్రాక్టర్ అండ్ గాంబుల్ (పీ &జీ) గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా నియమితులయ్యారు.

ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఉన్న జెజురికార్, జాన్ మెల్లర్ స్థానంలో జనవరి1, 2026 లో బాధ్యతలు స్వీకరిస్తారు. భారత్ లో చదువుకున్న అనేక మంది కార్పొరేట్ సీఈఓలు కొనసాగుతున్నారు.

వారిలో మైక్రోసాప్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ముందు వరుసలో ఉన్నారు. శైలేష్ కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లోనే చదువుకున్నారు. ఆయన సత్యనాదెళ్ల క్లాస్ మేట్.

శైలెష్ కు క్రికెట్ అంటే మక్కువ. హైదరాబాద్ తరఫున అండర్ -17 టోర్నమెంట్ లో చురుకుగా పాల్గొన్నారు. శైలేష్ జెజురికర్ 2020 నుంచి మహీందా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సీఈఓ గా ఉన్న రాజేష్ జెజురికర్ సోదరుడు.

ట్రంప్ మాట బేఖాతరు
రెండు రోజుల క్రితం వాషింగ్టన్ లో కార్పొరేట్ అధినేతలతో జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ సహ ఏ దేశం వారిని ఉద్యోగాలలోకి తీసుకోరాదని హెచ్చరించారు. కేవలం అమెరికన్లకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆయన ఈ మాట అని రెండు రోజులు గడవక ముందే పీ అండ్ జీ శైలేష్ ను గ్లోబల్ సీఈఓగా ప్రకటించింది.


 


కెరీర్..
లక్నో ఐఐఎం పూర్వ విద్యార్థి కూడా అయిన జెజురికర్ 1989 లో పీ అండ్ జీ లో అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్ గా తన కెరీర్ ప్రారంభించారు. అక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.
పీ అండ్ జీ ని 1837 సబ్బుల తయారీ రంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది.ప్రస్తుతం దీని మార్కెట్ విలువ 84 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. ఫార్చూన్ 500 లో 51 వ స్థానంలో స్థానం సంపాదించుకుంది.
పీ అండ్ జీ కి అంబీపుర్, ఏరియల్, జిల్లెట్, హెడ్ అండ్ షోల్డర్స్, ఓలే, ఓరల్ బీ, ప్యాంపర్స్, పాంటీన్, టైడ్, విక్స్, విస్పర్ వంటి బ్రాండ్లను విక్రయిస్తుంది. డిసెంబర్ 31, 2024 నాటికి నికర అమ్మకాలు 2 శాతం పెరిగి 84 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
భారత్ లో ఈ సంస్థ మూడు వ్యాపార సంస్థల ద్వారా తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. పీ అండ్ జీ ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
జెజురికార్ 2025 అక్టోబర్ జరగబోయే వార్షిక వాటాదారుల సమావేశంలో డైరెక్టర్ పదవికి నామినేట్ చేసింది. ‘‘సీఈఓగా జాన్ నాయకత్వం కింద కంపెనీ బలమైన వృద్దిరేటును నమోదు చేసింది. సంపదను సృష్టిస్తూనే ఉంది. స్థిరమైన విజయాల కోసం బలమైన ప్రణాళికను అమలు చేస్తున్నాం. ఇప్పుడు శైలేష్ సీఈఓగా మారాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని పీ అండ్ జీ బోర్డు లీడ్ డైరెక్టర్ జో జిమెనెజ్ అన్నారు.
మార్చితో ముగిసిన తొలి క్వార్టర్ లో ప్రాక్టర్ అండ్ గాంబుల్ నికర అమ్మకాలు 19.8 బిలియన్ల వార్షిక తగ్గుదలను నమోదు చేసింది. విదేశీ మారకం, కొనుగోళ్లు, పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావాలు, సేంద్రీయ అమ్మాకాలు మాత్రం గత ఏడాదితో పోలిస్తే ఒక శాతం పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ రెండేళ్ల పునర్నిర్మాణ ప్రణాళికను ప్రకటించింది. ఇందులో ఏడు వేల ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించింది.


 


హెచ్పీఎస్ ప్రతిభ..
ఒక శతాబ్ధం(1923) క్రితం ప్రారంభమైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వ్యాపార, రాజకీయ, క్రీడా, దౌత్య రంగాలలో అద్భుతమైన నాయకులను అందించింది. ఈ స్కూల్ ఇతర పూర్వ విద్యార్థులలో.. గిరీష్ రెడ్డి, వ్యవస్థాపకుడు మేనేజింగ్ డైరెక్టర్ భాగస్వామి- ప్రిస్మా క్యాపిటల్ పార్టనర్స్, హర్ష భోగ్లే- ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత, జర్నలిస్ట్.. అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు, ప్రేమ్ వాట్సా, ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ సీఈఓ, కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు, సయ్యద్ అక్భరుద్దీన్ - మాజీ దౌత్య వేత్త, యూఎన్ లో భారత మాజీ శాశ్వత ప్రతినిధి.
అంతేకాకుండా టాలీవుడ్ యంగ్ హీరోలలో చాలా మంది కూడా హెచ్పీఎస్ లోనే చదుకున్నారు. వారిలో రామ్ చరణ్, రానా, శర్వానంద్ ఈ స్కూల్ లోనే విద్యాభ్యాసం చేశారు.
ఇక్కడ వార్షిక ఫీజు రూ. 1.71 లక్షల నుంచి 2.25 లక్షల వరకు ఉండటంతో హెచ్పీఎస్ నాణ్యమైన విద్యను అందిస్తూనే ఉంది. అందువల్ల గ్లోబల్ లీడర్లకు హైదరాబాద్ ఒక కేరాఫ్ అడ్రస్ గా మారింది. ప్రస్తుతం జెజురికార్ కూడా పీ అండ్ జీ సీఈఓ గా నియమితులు కావడంతో హెచ్పీఎస్ ఖ్యాతీ ఇనుమడించింది.


Tags:    

Similar News