153 రోజుల కవిత తీహార్ జైలు జీవితం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టై నేటి (ఆగష్టు 27)తో 165 రోజులు అయింది.

By :  Vanaja
Update: 2024-08-27 13:46 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టై నేటి (ఆగష్టు 27)తో 165 రోజులు అయింది. ఎట్టకేలకు ఆమెకు ఈడి సిబిఐ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. మరి కాసేపట్లో ఆమె విడుదల కానుండడంతో తీహార్ జైలు వద్ద పార్టీ నాయకులు ఆనందోత్సాహాలతో ఆమె కోసం ఎదురుచూస్తున్నారు. సోమవారం రాత్రి కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ చేరుకోగా... ఆమెకి బెయిల్ లభించింది అని తెలిసి మరికొందరు నేతలు ఈరోజు ఢిల్లీ చేరుకున్నారు.

కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత 153 రోజులు జైలు జీవితం గడిపారు. ఈ ఏడాది మార్చి 15న బంజారాహిల్స్ లోని నివాసంలో ఈడీ అధికారులు కవితని అరెస్టు చేశారు. ఈడీ కస్టడీ అనంతరం.. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఆమెకి జుడీషియాల్ కస్టడీ విధించింది. అందులో భాగంగా అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. తీహార్ జైల్లో ఉండగానే సీబీఐ అధికారులు ఢిల్లీ లిక్కర్ కేసులో ఏప్రిల్ 15న ఆమెని అరెస్టు చేశారు. ఈ రెండు కేసుల్లో దాదాపు ఐదు నెలల పాటు రిమాండ్ ఖైదీగా కవిత జైలు జీవితం గడిపారు. ఈ సమయంలో ఆమె 11 కేజీల బరువును తగ్గినట్టు కేటీఆర్ వెల్లడించారు.

రెండుసార్లు ఆసుపత్రిపాలైన కవిత...

జైల్లో ఉన్న ఐదు నెలల కాలంలో కవిత రెండుసార్లు ఆసుపత్రి పాలయ్యారు. జులై 16న అస్వస్థతకి గురయ్యారు. దీంతో అధికారులు ఆమెను ఢిల్లీలోని దీనదయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. అనారోగ్య సమస్యలతో ఉన్న కవిత ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో మెరుగైన చికిత్స కోసం అధికారులు ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం తిరిగి కవితను అధికారులు తీహార్ జైలుకు తరలించారు. జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె అస్వస్థతకి గురయ్యారని, ఆసుపత్రి వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చి పంపించారు.

ఆగస్టు 22 న మరోసారి కవిత అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆమెని ఢిల్లీ ఎయిమ్స్ కి తరలించారు జైలు అధికారులు. కవిత భర్త అనిల్ సమక్షంలో వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అదేరోజు మధ్యాహ్నం తిరిగి జైలుకి తరలించారు. అయితే గైనిక్ సమస్యల కారణంగానే ఆమె అనారోగ్యం పాలైనట్టు సమాచారం. కాగా ఐదు నెలల జైలు జీవిత కాలంలో కవిత 11 కేజీలు బరువు తగ్గారు.

Tags:    

Similar News