కాంగ్రెస్ లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే సిట్టింగ్ ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.

By :  Vanaja
Update: 2024-07-08 10:13 GMT

తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే సిట్టింగ్ ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. మంగళవారం హస్తం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్టు సమాచారం. ఈ క్రమంలో సోమవారం చల్లా వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని జూబిలీహిల్స్ లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిని చల్లా మర్యాదపూర్వకంగా కలిసారని, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సాగునీరు అందించే నెట్టింపాడు, ఆర్దీఎస్ ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

కాగా, సాధారణ ఎన్నికలు ముగిసిన అనంతరం కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. పార్టీని బలోపేతం చేసేందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది. ఆ విషయంలో సక్సెస్ కూడా అవుతున్నట్టుగానే కనిపిస్తోంది. అయితే పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నప్పటికీ అంతకంటే ముఖ్యంగా ఎమ్మెల్సీల సంఖ్యాబలం ఇప్పుడు కాంగ్రెస్ కి చాలా అవసరం.

ఏదైనా బిల్లు పాస్ అవ్వాలంటే శాసన సభలోనే కాదు శాసన మండలిలోనూ మెజారిటీ సభ్యుల ఆమోదం అవసరం. కానీ శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆరుగురే ఉన్నారు. దీంతో ఎమ్మెల్సీలను సైతం లాక్కునే పనిలో పడింది హస్తం పార్టీ. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ గూటికి చేరారు. దండే విఠల్, భాను ప్రసాద్, బి. దయానంద్, ప్రభాకర్ రావు, ఎగ్గె మల్లేశం, బసవరాజు సారయ్యలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే బాటలో చల్లా వెంకట్రామిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. ఈరోజు ఆయన సీఎంని కలవడం ఆ వార్తలకి మరింత బలాన్ని చేకూరుస్తోంది. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజేయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ ఖాళీ అవనుంది.

Tags:    

Similar News