రాజీనామా బాధ్యత నేను తీసుకుంటా -బల్మూర్ వెంకట్

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా హరీష్ రావుకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈరోజు మధ్యాహ్నం బల్మూర్ వెంకట్ అమరవీరుల స్థూపం దగ్గరకి చేరుకున్నారు.

By :  Vanaja
Update: 2024-04-26 10:40 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చేసిన ఛాలెంజ్ లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం ఉదయం అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్దకి చేరుకున్నారు. ప్రభుత్వం పంద్రాగస్టు లోపల రైతులకి రుణమాఫీ, 6 గ్యారెంటీల హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానని అమరవీరుల స్థూపం వద్ద ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖని కూడా జర్నలిస్టులకి ఇచ్చారు. రేవంత్ కూడా తన రాజీనామా లేఖతో రావాలని, ఆయన రాలేకుంటే పీఏ తో లేదా స్టాఫ్ తో రాజీనామా లేఖని పంపించాలని కోరారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

హరీష్ రావు చర్యకి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు. ఆయన రాజీనామా లేఖపై స్పందించిన రేవంత్ రెడ్డి పంద్రాగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతాం. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసేందుకు హరీష్ రావు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా హరీష్ రావుకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈరోజు మధ్యాహ్నం బల్మూర్ వెంకట్ అమరవీరుల స్థూపం దగ్గరకి చేరుకున్నారు. స్థూపాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు.


అనంతరం బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ... అమరవీరుల చావుకి కారణమైన హంతకుడు హరీష్ రావు అని ఆరోపించారు. ఉద్యమ సమయంలో నిరుద్యోగులను, యువతను పొట్టనపెట్టుకున్న వ్యక్తి అమరవీరుల స్థూపం వద్దకు రావడంతో ఈ ప్రాంతం మైలపడిందన్నారు. అందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేశామని చెప్పారు. 10 ఏళ్లుగా హరీష్ రావుకి, బీఆర్ఎస్ నాయకులకు ఏనాడు అమరవీరులు గుర్తుకు రాలేదు. కేవలం రాజకీయం కోసం వచ్చి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.

హరీష్ రావు స్పీకర్ ఫార్మాట్ లో కాకుండా రాజీనామా లేఖను రాజకీయం చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా పని చేసిన ఆయనకి రాజీనామా ఎలా చేయాలో కూడా తెలీదా అని నిలదీశారు. హరీష్ రావు రాజీనామా లేఖ వృధా కానివ్వను. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరుతారు. ఆగస్టు 15 తర్వాత కచ్చితంగా హరీష్ రావు రాజీనామాను ఆమోదింపజేసే బాధ్యత నేను తీసుకుంటాను అని బల్మూర్ వెంకట్ తెలిపారు.


Tags:    

Similar News