కౌశిక్ రెడ్డిపై స్పీకర్‌కు అందిన ఫిర్యాదు

కరీంనగర్‌ జెడ్‌పీ సమీక్ష సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హంగామా సృష్టించారు.;

Update: 2025-01-13 08:49 GMT

కరీంనగర్‌ జెడ్‌పీ సమీక్ష సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హంగామా సృష్టించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కి కౌశిక్ రెడ్డిక మధ్య మొదలైన వాగ్వాదం కాస్తా చేయి చేసుకునే వరకు వెళ్లింది. నువ్వు ఏ పార్టీ అంటూ సంజయ్‌పైకి కౌశిక్ రెడ్డి వెళ్లారు. దీంతో సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే స్పందించిన పోలీసులు కౌశిక్‌కు బయటకు లాక్కుని వెళ్లారు. కాగా ఈ ఘటనపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సోమవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన సమావేశంలో కౌశిక్ తనను తీవ్రంగా దుర్భాషలాడారని, ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకోవడమే కాకుండా చేయి చేసుకున్నారని సంజయ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రౌడీలో ప్రవర్తిస్తున్న కౌశిక్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా సంజయ్ ఫిర్యాదును స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్.. ఘటనకు సంబంధించి వివరాలు తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌పై దాడికి ప్రయత్నంచేశారని కౌశిక్‌పై పోలీసులు కేసులు నమోదుచేశారు.

పబ్లిసిటీ కోసమే రచ్చా?

పాడి కౌశిక్ రెడ్డి పేరు వింటేనే వివాదాలు గుర్తుకొస్తున్నాయి. ఆయన ఏం చేసినా అది వివాదంగా మారుతోంది. అలా మారాలనే ఆయన కూడా ప్రతి అంశాన్ని భూతద్దంలో చూపుతూ నానా హంగామా చేస్తున్నారు. రైతు భరోసా, రైతుబంధు వంటి పథకాల అమలు డిమాండ్ చేస్తూ చేసిన ధర్మా కావచ్చు, తన ఫోన్ ట్యాప్ అయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన అంశం కావచ్చు.. ప్రతి విషయంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి కావాలనే ఒక మెట్టు అధికంగా రచ్చ చేశారు. తనకు ఎదురు చెప్పకూడదు అన్న తరహాలోనే ప్రవర్తించారు. అరికపూడి గాంధీతో జరిగిన వివాదం కూడా అదే విధంగా కావాలనే పెద్ద అంశం చేయాలని కౌశిక్ ప్రవర్తించారు. అయితే ప్రతి విషయంలో కౌశిక్.. ప్రవర్తిస్తున్న తీరును పబ్లిసిటీ కోసం పడుతున్న తాపత్రయమేనని విశ్లేషకులు అంటున్నారు.

బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, కవిత, హరీష్ తర్వాత తన పేరు వినిపించాలన్న తాపత్రయంతోనే కౌశిక్ రెడ్డి ఈ తరహాలో ప్రతి అంశాన్ని పెద్ద అంశంగా మారుస్తున్నారని, ఏదో ఒకటి చేసి వార్తల్లో నిలుస్తూ ఉంటే పార్టీలో కీలక స్థానం వచ్చేస్తుందని ఆయన భావిస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. సమయం దొరికినపుడు లేదా సందర్భం దొరికిచ్చుకుని ఫిరాయింపు ఎంఎల్ఏలతో రాజీనామాలకోసం గొడవలుపడటం కౌశిక్ అలవాటుగా చేసుకున్నాడు. గొడవలుపడగానే వెంటనే మీడియా, సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతాడు. ఆ విధంగా తమ అధినేతల దృష్టిలో పడేందుకే పాడి ఈ విధంగా అలజడి సృష్టిస్తున్నారన్న విషయం అర్ధమైపోతోంది. ఈ పద్దతిని కౌశిక్ రెడ్డి ఇంకా ఎంతకాలం కంటిన్యుచేస్తారో చూడాలి.

Tags:    

Similar News