BRS మళ్ళీ TRS గా మారనుందా.. హరీష్ సంకేతాలిచ్చారా?

బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా మారనుందా? మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అవే సంకేతాలిచ్చారా?

By :  Vanaja
Update: 2024-07-17 10:17 GMT

బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా మారనుందా? మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అవే సంకేతాలిచ్చారా? ఆయన బీఆర్ఎస్ కండువాకి బదులు టీఆర్ఎస్ కండువా వేసుకోవడం వెనుక ఆంతర్యమేంటి? ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన పొరపాటున ఆ కండువా వేసుకున్నారా? లేక కావాలనే వేసుకున్నారా? అనేదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చ.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని జాతీయ పార్టీగా తీసుకొస్తూ భారత రాష్ట్ర సమితి అని కేసీఆర్ నామకరణం చేశారు. అనంతరం ఆయన దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఆయన దేశ రాజకీయాలపై ఫోకస్ చేసి రాష్ట్రంలో ఓటమిపాలయ్యారు. బీఆర్ఎస్ అని పేరు మార్చిన దగ్గర నుంచి కలిసి రావడంలేదనే చర్చ శ్రేణుల్లో మొదలైంది. మళ్ళీ టీఆర్ఎస్ గా పేరు మార్చాలనే డిమాండ్స్ కూడా మొదలయ్యాయి.

పార్టీలో కీలక నేతలు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చిన తర్వాత పార్టీ తెలంగాణ ప్రజలకి దూరం అయిందనే భావన కలిగిందన్నారు. పార్టీ తెలంగాణ సెంటిమెంట్ కోల్పోయిందని అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం పేరు మార్చే ఆలోచనలో లేరనేది పార్టీ వర్గాలు చెబుతోన్న విషయం.

అయితే, సడెన్ గా ఇప్పుడు హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా దర్శనమివ్వడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రగల్చడానికి మళ్ళీ టీఆర్ఎస్ గా పేరు మార్చనున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పటాన్ చెరు పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకుని సంకేతాలిచ్చారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కార్యక్రమంలో బీఆర్ఎస్ కండువాలు లేక దొరికింది కదా అని పాత కండువా కప్పుకున్నారా అంటే ఆయనకి ఒక్కరికే ఎందుకు ఉండదు? పైగా పార్టీ హైకమాండ్ లో ఆయన కీలక సభ్యుడు... అలాంటి వ్యక్తి అజాగ్రత్తగానో, ఏమరపాటునో పార్టీ కండువా మార్చరు కదా! టీఆర్ఎస్ కండువా కప్పుకుని ప్రజల రియాక్షన్ ఎలా ఉందొ తెలుసుకోవడానికి ఈ పని చేశారేమో అనే సందేహాలు కూడా మొదలవుతున్నాయి. ఏది ఏమైనా బీఆర్ఎస్ అలానే ఉంటుందా? లేక టీఆర్ఎస్ గా మారనుందా తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

Tags:    

Similar News