అందాల వేడుకలతో హైదరాబాద్ హంగు బంగారమౌతుందా?

హైదరాబాద్ నగరంలో మే 7 నుంచి జూన్ 2వతేదీ వరకు జరగనున్న మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ పర్యాటక రంగానికి మంచిరోజులు రానున్నాయి.;

Update: 2025-04-29 09:18 GMT
ఫెమినా మిస్ ఇండియా నందినీ గుప్తా రామప్ప సందర్శన

వచ్చే నెలలో జరుగనున్న అంతర్జాతీయ అందాల పోటీలు మీద హైదరాబాద్ చాలా ఆశలపెట్టుకుంది.  అనేక దేశాల నుంచి వచ్చి అందాలరాణులు పోటీ తర్వాత వెళ్లితూ హైదరాబాద్ అందాలను తమ దేశాలకు మోసుకుపోతారని  తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్నది. 72వ మిస్ వరల్డ్ పోటీలు,  హైదరాబాద్ చార్మినార్ ని, హైదరాబాద్ బిరియానీని, ఇరానీ చాయ్ ని, రామప్పగుడిని,పోచంపల్లి చీరెలను ప్రపంచల నలుమూలకు మరొక సారి తీసువెళ్తాయని ప్రభుత్వం ఆశిస్తుంది. ప్రపంచ తారలంతా ఈ తమ ఫోటోలతో పాటు హైదరాబాద్ ని తెలంగాణని కూడా కొత్త ప్రపంచానికి పరిచయం పర్యాటక రంగానికి ఉతమిస్తాయని ప్రభుత్వం భావిస్తున్నది.  దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.


ఈ  మిస్ వరల్డ్ ఫెస్టివల్ -2025 ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు తీసుకువచ్చేలా మిస్ వరల్డ్ పోటీలను వైభవంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పర్యాటక , సాంస్కృతికి శాఖ అధికారులను ఆదేశించారు.

 విదేశీ అందాల భామల పర్యాటక ప్రాంతాల సందర్శన

మిస్ వరల్డ్ పోటీల్లో ప్రపంచం నలుమూలల నుంచి తరలిరానున్న అందాల భామలు తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలైన చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, రామప్ప, యాదగిరిగుట్ట దేవాలయాలతోపాటు నాగార్జున సాగర్, చేనేత చీరలు నేస్తున్న భూదాన్ పోచంపల్లి ప్రాంతాలను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా అందాల రాణుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందాల రాణులు తెలంగాణ పర్యాటక కేంద్రాలను సందర్శిస్తే, వీటిపై విదేశీ పర్యాటకుల దృష్టిని ఆకర్షించవచ్చని యోచిస్తున్నారు.



 ఫెమినా మిస్ ఇండియా నందినీ రామప్పలో సందడి

హైదరాబాద్ నగరంలో జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశం తరపున ఫెమినా మిస్ ఇండియా నందినీ గుప్తా పాల్గొననున్నారు.నందిని గుప్తా మిస్ వరల్డ్ పోటీలపై తన ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధమవుతున్నానని నందినీ ప్రకటించారు.ఇటీవల హైదరాబాద్ నగరాన్ని సందర్శించిన నందినీ గుప్తా చార్మినార్ చెంత లాడ్ బజార్ లో గాజుల షాపింగ్ చేశారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన రామప్పను మిస్ ఇండియా నందిని గుప్తా సందర్శించారు.



72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ కార్యక్రమాలు ఇవీ...

హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ కార్యక్రమాలను మే 7వతేదీ నుంచి జూన్ 2వతేదీవరకు వేర్వేరు వేదికలపై వేర్వేరు థీమ్ లతో చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. దేశ,విదేశాల నుంచి మిస్ వరల్డ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు అతిథులు మే6,7 తేదీల్లో హైదరాబాద్ కు రానున్నారు. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకలు ఏర్పాటు చేశారు. మే 12వతేదీన బుద్ధవనంలో అందాలభామలతో ఆధ్యాత్మిక పర్యటన ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నాగార్జునసాగర్, హైదరాబాద్ లలో హెరిటేజ్ వాక్ ఏర్పాటు చేశారు.మే 13వతేదీన చౌమహల్లాప్యాలెస్ లో సుందరాంగులు, అతిథులకు వెల్ కం డిన్నర్ ఠఇవ్వాలని నిర్ణయించారు.



 కాకతీయ హెరిటేజ్ టూర్

మే 14వతేదీన అందాల భామలతో కాకతీయ హెరిటేజ్ టూర్ ఉంటుంది. ఇందులో భాగంగా రామప్ప దేవాలయాన్ని సుందరాంగులు సందర్శించి, అక్కడి శిల్పకళను చూసి విద్యార్థులు, స్థానికులతో మాట్లాడనున్నారు. మే 15వతేదీన యాదగిరిగుట్టలోి దేవాలయాన్నిసందర్శించనున్నారు. అనంతరం పోచంపల్లి వీవర్స్ గ్రామాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత ఏఐజీ, అపోలో, యశోదా ఆసుపత్రులను అందాల భామలు సందర్శిస్తారని నిర్వాహకులు తెలిపారు. మే 17వతేదీన గచ్చిబౌల ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్సుఫినాలే, కల్చరల్ ఈవెనింగ్ కార్యక్రమాలుంటాయి. అనంతరం ఎక్స్ పీరియం ఎకో టూరిజం పార్కులో తెలంగాణ కుషన్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు.



 టీ హబ్ లో మిస్ వరల్డ్ పోటీదారుల ఎంపిక

టీ హబ్ లో మే 21వతేదీన మిస్ వరల్డ్ పోటీదారుల ఎంపిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మే19వతేదీన అందాల పోటీల్లో పాల్గొనే వారందరూ తెలంగాణ పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, రాష్ట్రసచివాలయం, ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహాలన సందర్శించనున్నారు.సుందరాంగులు మే 21వతేదీన శిల్పకళా వేదికపై ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ వర్కషాప్ లో పాల్గొంటారు.మే 22వతేదీన శిల్పకళావేదికపై మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే ఉంటుంది. మే 23వతేదీన గచ్చిబౌలిలోని ఐఎస్ బీలో ఫినాలే రౌండ్స్ ఏర్పాటు చేశారు. మే 24వతేదీన హైదరాబాద్ హైటెక్స్ లో మిస్ వరల్డ్ టాప్ మోడల్ అండ్ ఫ్యాషన్ ఫినాలే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మే 25వతేదీన హైటెక్స్ లో ముత్యాల షోలో అందాల భామలు పాల్గొంటారు.



 మే 31న హైటెక్స్ లో మిస్ వరల్డ్ ఫైనల్ సెర్మనీ

మే 31వతేదీన హైదరాబాద్ హైటెక్స్ లో మిస్ వరల్డ్ ఫైనల్ సెర్మనీ నిర్వహించాలని నిర్ణయించారు. మే 26వతేదీన బ్రిటీష్ రెసిడెన్సీ అయిన తాజ్ ఫలక్ నుమాలో గాలా డిన్నర్ కార్యక్రమం ఉంటుంది. జూన్ 2వతేదీన మిస్ వరల్డ్ విజేత తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుకుమార్ దేవ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని కలవనన్నారు.



 మిస్‌ వరల్డ్‌ క్రిస్టినా పిస్కోవా సందడి

మిస్‌ వరల్డ్‌ క్రిస్టినా పిస్కోవా ఇటీవల హైదరాబాద్ సందర్శన సమయంలో తెలంగాణ చేనేత చీర ధరించి, తలపై మిస్ వరల్డ్ కిరీటాన్ని, మల్లెపూల చెండును పెట్టుకొని, నుదుటన సంప్రదాయ బొట్టు పెట్టుకొని ముకుళిత హస్తాలతో నమస్కారం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఆమె దర్శించుకొని సాంప్రదాయ చీరకట్టులో మెరిశారు.చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టినా స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై సీఎం సమీక్ష
మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంగళవాం పర్యాటక, సాంస్కృతిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ కార్యక్రమాల గురించి సీఎం తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



 మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వస్తున్న అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎయిర్ పోర్టు, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. తెలంగాణలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు.విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు.మిస్ వరల్డ్-2025 ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు, ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.



Tags:    

Similar News