సహాయక చర్యలపై నిష్ణాతులతో మంత్రి సమీక్ష
ఎట్టి పరిస్థితుల్లో లోపల చిక్కుకున్నవారిని రక్షించాలని, అందుకోసం ఎంతటి పరిజ్ఞనాన్ని అయినా ఉపయోగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రులు తెలిపారు.;
శ్రీశైలం ఎడగట్టు కాలుల దగ్గర నిర్మిస్తున్న ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో నాలుగు రోజుల క్రితం ప్రమాదం జరిగింది. సొరంగం పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. మరో ఏడుగురి వరకు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన అధికారులు.. లోపల చిక్కుకున్న వారిని రక్షించడం కోసం సహాయక చర్యలు చేపట్టారు. వారిని రక్షించడం కోసం ప్రభుత్వం సైతం అన్ని విధాలా సహకారం అందిస్తోంది. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే ఈ సహాయక చర్యల్లో ఆర్మీ, ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, సింగరేణి, ఎన్‌జీఆర్ఐ, జీఎస్ఐ, ర్యాట్ మైనింగ్ బృందం, మేఘా, ఎల్ అండ్ టీ, ఐఐటీ మద్రాస్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి రెస్క్యూ బృందాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఎట్టి పరిస్థితుల్లో లోపల చిక్కుకున్నవారిని రక్షించాలని, అందుకోసం ఎంతటి పరిజ్ఞనాన్ని అయినా ఉపయోగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రులు తెలిపారు. నిష్ణాతులతో నిర్వహించిన సమావేశంలో.. రెస్క్యూ ఆపరేషన్‌ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లనున్నారు అన్న అంశంపై చర్చించారు. రెస్క్యూ ఆపరేషన్ స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు. 1600 టన్నుల బరువున్న టీబీఎం మిషన్‌ను ఎలా అడ్డు తీయనున్నారు? అందుకు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు? వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.