‘విద్య వ్యవస్థ నాశనానికి వాళ్లే కారణం’.. మంత్రి సీతక్క విసుర్లు

తెలంగాణ విద్య వ్యవస్థపై పంచాయతిరాజ్, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ విద్య వ్యవస్థ సర్వనాశనమైందన్నారు.

Update: 2024-11-01 12:20 GMT

తెలంగాణ విద్య వ్యవస్థపై పంచాయతిరాజ్, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ విద్య వ్యవస్థ సర్వనాశనమైందని, విద్య వ్యవస్థ కోసం కేసీఆర్ చేసింది ఏమైనా ఉందా?అని ప్రశ్నించారామే. కేటీఆర్ రాష్ట్రానికి చేసిందే శూన్యమైతే.. ఇక విద్య వ్యవస్థకు ఏం చేస్తారంటూ చురకలంటించారు. విద్యార్థులు ఎన్ని కష్టాలు పడుతున్నా కేసీఆర్ మాత్రం పట్టనట్లు వ్యవహరించారని, తమకు సరైన సదుపాయాలు అందడం లేదని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోడ్డెక్కి రోజుల తరబడి నిరసనలు చేసిన లాభం లేదని విమర్శించారు.

కానీ ఇప్పుడు లెక్క వేరని, ప్రస్తుతం రాష్ట్రంలో విద్యార్థుల బాధలు, సమస్యలు తెలిసిన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలన్నదే రేవంత్ రెడ్డి లక్ష్యమని, ఆ దిశగానే ఆయన పనిచేస్తున్నారని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు కష్టాలు తగ్గాయని, రాష్ట్రంలోని విద్య వ్యవస్థ మళ్ళీ పుంజుకోవడం ప్రారంభించిందన్నారు.

రాష్ట్ర నలుమూలల్ల ప్రతి విద్యార్థికి ప్రతి సదుపాయం అందేలా విద్య వ్యవస్థను మెరుగుపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కూడా మంత్రి సీతక్క వెల్లడించారు. అందులో భగంగానే కనివినీ ఎరుగని రీతిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు డైట్ కాస్మోటిక్‌ ఖర్చును 40 శాతం పెంచడం జరిగినట్లు తెలిపారు.

పెంచింది పిసరంత.. చేసింది చాటంత..

‘‘హాస్టల్, గురుకుల విద్యార్థుల డైట్ ఛార్జీలను 40 శాతం పెంచిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. విద్యార్థుల డైట్ కాస్మోటిక్ ఛార్జీలను 40 శాతం పెంచడం చరిత్రలో ఇదే తొలిసారి. గత ఏడేళ్లుగా డైట్ ఛార్జీలను, 16 ఏళ్లుగా కాస్మోటిక్ ఛార్జీలను పెంచిన దాఖలాలు లేవు. బీఆర్ఎస్ హయాంలో డైట్ ఛార్జీలను పిసరంత పెంచి ప్రచారం మాత్రం చాటంత చేసుకున్నారు. ఏడేళ్లలో కూరగాయలు, నిత్యావసరాల సరుకుల ధరలకు విపరీతంగా పెరిగాయి. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయినా అందుకు అనుగుణంగా డైట్, కాస్మోటిక్ ఛార్జీలను ఎందుకు పెంచలేదో బీఆర్ఎస్ పార్టీ, లేదా ఆనాటి సీఎం కేసీఆర్ బయటకొచ్చి చెప్పాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ చేసిన ఈ పనులకు విద్యార్థులు అర్థాకలితో ఇబ్బందులు పడ్డారు. రుచిపచి లేని ఆహారం తినలేక.. ఆకలి తట్టుకోలేక తింటే.. సరిపడా లేక చాలా సమస్యలు ఎదుర్కొన్నారు విద్యార్థులు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు సీతక్క.

పదేళ్లలో ఏం చేశారు..

‘‘రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారం వెలగబెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా అందించలేదు. తాగునీరు కూడా లేక ఇబ్బంది పడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఒక్క టాయిలెట్ కూడా కట్టించలేదు. దాని వల్ల విద్యార్థినులు నరకయాతన పడ్డారు. కానీ మా ప్రభుత్వం అలా కాదు. సీఎం రేవంత్ రెడ్డి.. పాఠశాలలు, కళాశాలల్లోని మౌలిక వసతులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి విద్యార్థికి కావాల్సిన ప్రతి వసతిని కల్పించడమే సీఎం ధ్యేయం. ఆ దిశగా ఆయన అన్ని చర్యలు చేపడుతున్నారు’’ అని వివరించారు.

7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

‘‘డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచడంతో 7.65 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతోనే పెరిగిన ఛార్జీలకు అనుగుణంగా డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచడం జరిగింది. పెంచిన ఛార్జీలతో విద్యార్థులకు మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని కడుపునిండా పెట్టగలం. కాగా ప్రతి విద్యార్థికి పోషకాహారం అందేలా చూసే బాధ్యత టీచర్లు, హాస్టల్ సిబ్బందిదే. హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలను గ్రీన్ ఛానెల్ ద్వారా చెల్లిస్తాం. విద్యార్థుల నుంచి వసతులు, ఆహారానికి సంబంధించి ఒక్క ఫిర్యాదు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు సీతక్క.

Tags:    

Similar News