Seethakka | ‘స్మగ్లర్ హీరో అంటే అదేం సినిమా’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాపై మంత్రి సీతక్కా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-23 12:27 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాపై మంత్రి సీతక్కా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఒక స్మగ్లర్ హీరో అంటే అదేం సినిమా? అని ప్రశ్నించారు. ఈ సందర్బంగా పుష్ప సినిమాకు గానూ అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడంపై కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జై భీమ్’ వంటి సందేశాత్మక సినిమాకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూనే స్మగ్లర్ సినిమాకు జాతీయ అవార్డు రావడం ఏంటి? అని అన్నారు. జైభీమ్ వంటి సినిమాలకు ప్రోత్సహకం సైతం అందలేదని, మరోవైపు పోలీస్ దుస్తులు విప్పి నిలబెట్టి.. పోలీస్ స్టేషన్‌ను కొన్ని స్మగ్లర్ సినిమాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. ఒక స్మగ్లర్ హీరో.. స్మగ్లింగ్‌ని కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతారని? నిలదీశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగానే ఇటువంటి సినిమాలు తీసే హీరోలకు, డైరెక్టర్లకు, ఇలాంటి సినిమాలపై డబ్బులు వెచ్చించే నిర్మాతలకు ఆమె ఒక సందేశం ఇచ్చారు. ఎప్పుడైనా సందేశాత్మక సినిమాలు తీస్తే ప్రజలు స్వాగతిస్తారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే రెండు హత్యలు చేసిన నేరస్థుడు ఒకడు ముంబైలో పుష్ప-2 సినిమా చూస్తూ దొరికిపోయాడని గుర్తు చేశారు.

హింసకు ఊతం

‘‘ఇటువంటి సినిమాలు హింసను. నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయి. మానవతా దృక్పథం ఉన్న సినిమాల అవసరం ఎంతైనా ఉంది. మతాలు, కులాలు ముఖ్యం కాదని, మనిషఇకి ఉండాల్సింది మానవత్వం అని చెప్పే సినిమాలు కావాలి’’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే మానవత్వాన్ని వివరించే సినిమాలకు ప్రోత్సాహం ఇవ్వాలని ఆమె కేంద్రానికి సూచించారు. చంకలో బిడ్డను పెట్టుకుని ఉన్న ఒక మహిళకు హక్కులు అందించడం కోసం ఒక న్యాయవాది పోరాడిన సినిమా ‘జైభీమ్’కు ఒక్క అవార్డు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తాము సినిమాలకు వ్యతిరేకంగా కాదని, ప్రతి సినిమాను గౌరవిస్తామని, కానీ సందేశాత్మక సినిమాలు ఈ సమాజానికి అవసరం ఉందని చెప్తున్నామని అన్నారు.

సినిమా వాళ్లూ ఆలోచించిండి

ఇటీవల వచ్చిన చాలా సినిమాల్లో హీరోను బ్యాడ్ బాయ్‌గా చూపడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కకుండా స్మగ్లింగ్ చేయడం, వందల మందిని అతి కిరాతకంగా నరికి చంపడం వంటిని హీరో మ్యానరిజంగా మారడంపై మంత్రి సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని చూసి సమాజం ఏం నేర్చుకోవాలని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సినిమా వాళ్లు సమాజానికి సందేశాత్మక చిత్రాలు చేయాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, మానవ హక్కులపై అవగాహన కల్పించే, మతకులాలకు అతీతమైన సినిమాలను తెరకెక్కించాలని కోరారు. ఈ విషయంపై సినిమా వాళ్లు ఆలోచన చేయాలని కోరారు.

Tags:    

Similar News