గ్రామీణ రోడ్లపై టోల్.. ఆ ఆలోచనే మాకు లేదన్న మంత్రి
బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ఆర్‌అండ్‌బీ పనుల గురించి లెక్కలు బయటకు తీద్దామని, రోడ్ల గురించి ఒకరోజు ప్రత్యేకంగా చర్చిద్దామని హరీష్ అన్నారు.;
‘గ్రామీణ, రాష్ట్ర రహదారులపై కూడా టోల్ ఫీజు వసూలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈమేరకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అతి త్వరలోనే టోల్ నిర్వహణకు టెండర్లను కూడా పిలవనుంది’ కొన్ని రోజులుగా ప్రచారమవుతున్న వార్తలివి. రాష్ట్రవ్యాప్తంగా ఈ వార్తలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ ప్రచారానికి అసెంబ్లీ వేదికగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫుల్ స్టాప్ పెట్టారు. అవన్నీ అవాస్తవేలనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంపై బురదజల్లడానికే కొందరు ఈ ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులపై టోల్ ఫీజు విధించాలన్న ఆలోచన కూడా తమకు లేదని తేల్చి చెప్పారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40శాతాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఆరు లేదా మూడు నెలలకు కాంట్రాక్టర్లకు ఈ చెల్లింపులు చేస్తున్నామని మంత్రి క్లారిటీ ఇచ్చారు.
‘‘ప్రతిగ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తాం. బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే రోడ్లు వేశారు. ఆ మూడు చోట్ల రోడ్లు వేయడానికి ఆఖరికి సింగరేణి నిధులను కూడా వాడేశారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా.. రాష్ట్రమంతా కలియతిరిగి చూద్దామా హరీష్’’ అని సవాల్ విసిరారు కోమటిరెడ్డి. కాగా మంత్రి ఛాలెంజ్‌ను మాజీ మంత్రి హరీస్ రావు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ఆర్‌అండ్‌బీ పనుల గురించి లెక్కలు బయటకు తీద్దామని, రోడ్ల గురించి ఒకరోజు ప్రత్యేకంగా చర్చిద్దామని హరీష్ సూచించారు.