డాక్టరునంటూ రోగులకు వైద్యం, నకిలీ డాక్టరుపై మెడికల్ కౌన్సిల్ కేసు
డాక్టర్లమంటూ రోగులను మోసగిస్తున్న నకిలీ వైద్యులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పట్టుకుంది.ఇలా మరో 25 మంది నకిలీ డాక్టర్లపై కేసు నమోదు చేశారు.
By : Shaik Saleem
Update: 2024-11-16 13:18 GMT
ఇన్‌స్టాగ్రామ్‌లో తాను డాక్టర్ అని చెప్పుకుంటున్న నకిలీ వైద్యుడిని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు శనివారం పట్టుకున్నారు.హైదరాబాద్ నగరానికి చెందిన రామ్ అలియాస్ వేములవలస రాంబాబు తాను డాక్టర్ అంటూ ఇన్‌స్టా ఐడీతో ప్రాక్టీసు చేస్తున్నాడని మెడికల్ కౌన్సిల్ అధికారుల విచారణలో తేలింది.
- అంబులెన్స్‌లో పనిచేసేందుకు రాంబాబు ప్రథమ చికిత్స శిక్షణ తీసుకుని డాక్టర్‌గా నటిస్తూ ప్రజలను మోసగిస్తున్నాడని మెడికల్ కౌన్సిల్ అధికారులు చెప్పారు. అత్యవసర సమయాల్లో ఏం చేయాలో అశాస్త్రీయమైన ఆరోగ్య సలహాలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడని విచారణలో వెల్లడైంది.
నకిలీ వైద్యుల పట్ల జాగ్రత్త
నకిలీ వైద్యులు ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియాలో ఇస్తున్న సలహాలను నమ్మి మోసపోవద్దని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రజలకు సూచించింది. గత కొద్ది రోజులుగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డాక్టర్‌ని అని చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న నకిలీ వైద్యుడు వేములవలస రాంబాబు ప్రజలను మభ్యపెడుతున్నాడు.అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి వైద్య అర్హత లేకుండా ఐసీయూలో పనిచేశాడని సమాచారం.
ఎన్‌ఎంసీ యాక్ట్ కింద కేసు
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ఇమ్రాన్ అలీలు మూడు నెలలుగా వెతికి రాంబాబు కోసం సోదాలు నిర్వహించి చివరకు హైదరాబాద్‌లోని సాయివాణి ఆస్పత్రిలో పట్టుకున్నారు.నకిలీ వైద్యుడు రాంబాబుపై ఎన్‌ఎంసీ యాక్ట్ 34,54, టీఎస్‌ఎంపీఆర్ యాక్ట్ 22 ప్రకారం కేసు నమోదు చేస్తామని టీజీఎంసీ సభ్యుడు డాక్టర్ ఇమ్రాన్ అలీ చెప్పారు.
25 నకిలీ వైద్యులపై కేసులు
వికారాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీజీఎంసీ) నాలుగు బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నకిలీ వైద్యులు వైద్యం చేస్తున్న కేంద్రాలను గుర్తించారు. వికారాబాద్, పరిగి, తాండూరు ప్రాంతాల్లో 25 నకిలీ వైద్యుల కేంద్రాల్లో విద్యార్హత లేకుండా వైద్యం అందిస్తున్నారని, అవగాహన లేకుండా మందులు ఇస్తున్నారని అధికారులు గుర్తించారు. ఈ 20 మంది నకిలీ వైద్యులపై ఎన్ఎంసీ చట్టం 34, 54 కింద కేసు నమోదు చేస్తామని, వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష రూ. 5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
ఆర్‌ఎంపీ, పీఎంపీలపై చట్టపరమైన చర్యలు
సోషల్ మీడియా ద్వారా వైద్యులమని చెప్పుకునే పలువురు షుగర్, బీపీ, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు అశాస్త్రీయ సలహాలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా వాటిని పాటిస్తూ కొందరు అమాయకులు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారని మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. సామాజిక మాధ్యమాలు, ఇతర మాధ్యమాల ద్వారా వైద్యులమని చెప్పుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ఆర్‌ఎంపీ, పీఎంపీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ వీ నరేష్ కుమార్ హెచ్చరించారు.