మారుమూల గిరిజన గర్భిణుల కోసం ప్రసవ నిరీక్షణ గదులు

గిరిజన గూడేల్లో నవోదయం;

Update: 2025-07-10 06:08 GMT
గిరిజన గర్భిణులకు వరం..ప్రసవ నిరీక్షణ కేంద్రం

ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం మారుమూల గిర్జాయి గిరిజన గ్రామానికి చెందిన సోంబాయి నిండు గర్భిణి.తొమ్మిది నెలలు నిండి నొప్పులతో బాధపడుతున్న సోంబాయిని ప్రసవం కోసం సోనాలలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని నిర్ణయించారు. అయితే ఒక వైపు కురుస్తున్న భారీవర్షాలతో గర్జాయి వాగు పొంగి ప్రవహిస్తుండటంతో గర్భిణీని వాగు దాటించడం కష్టతరంగా మారింది.అంతే ఆ లోగా తీవ్ర నొప్పులతో ప్రసవం కాక ఆ గర్భిణీ మరణించింది. ఇదీ గతం...కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ ప్రసవ నిరీక్షణ గదులను ఏర్పాటు చేసి ప్రసవ మరణాలకు చెక్ పెట్టింది


అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ
ఇలా అతి భారీవర్షాల వల్ల ఆదిలాబాద్ జిల్లాలోని పలు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుంటాయి. ఇలాంటి మరణాలు జిల్లాలో సంభవించరాదనే లక్ష్యంతో ముందు జాగ్రత్త చర్యగా వైద్య ఆరోగ్య శాఖ(Medical and Health) అప్రమత్తమై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవ నిరీక్షణ గదులను(Birth Waiting Rooms) ఏర్పాటు చేసి పదిరోజులు ముందుగానే గర్భిణులను ఆయా కేంద్రాలకు తరలిస్తున్నారు. వర్షాకాలంలో వాగులు,వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.వాగులు పొంగుతున్నపుడు గర్భిణులను ప్రసవం కోసం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలంటే సాధ్యం కాదు. దీంతో మారుమూల వాగులు, వంకలు, గుట్టలు దాటి ఉన్న గిరిజన తండాల్లో గర్భిణులు(Tribal Pregnant Women) ప్రసవ సమయంలో వైద్య సహాయం అందక మృత్యువాత పడిన సంఘటనలు గతంలో జరిగాయి. ఈ నేపథ్యంలో గిరిజన గర్భిణులకు సుఖ ప్రసవం చేయించేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వినూత్నంగా ఆలోచించి ప్రసవ నిరీక్షణ గదులను పీహెచ్ సీల్లో ఏర్పాటు చేసింది.

ప్రసవసమయంలో గర్భిణుల మృతి
గతంలో ఆదిలాబాద్ (Adilabad)జిల్లాలో ప్రసవ సమయంలో 12 మంది గర్భిణులు మరణించడం ఆందోళన కలిగించింది. 2018వ సంవత్సరంలో 27 మంది గర్భిణులు ప్రసవ సమయంలో మృత్యువాత పడ్డారు. ఈ మరణాలలో చాలా వరకు వర్షకాలంలో రోడ్డు సదుపాయం లేకపోవడం, వాగులపై వంతెనలు లేకపోవడం వల్ల సంభవించాయని గుర్తించిన వైద్యాధికారులు ప్రసవ నిరీక్షణ గదులను ఏర్పాటు చేశారు.

201 గ్రామాలకు రాకపోకలు బంద్
ఆదిలాబాద్ జిల్లాలో జులై నెలలో ప్రసవించనున్న 47 మంది మహిళలకు ఈ కేంద్రాల్లో వసతి కల్పిస్తామని ఉట్నూరు ఐటీడీఏ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు ఆగస్టులో ప్రసవించనున్న 53 మంది మహిళలకు ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు వారు వివరించారు.జనన నిరీక్షణ గదులు గిరిజన ప్రాంతాల్లో ప్రసూతి మరణాలను నివారించడానికి సహాయపడ్డాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ నాయక్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో 201 నివాస ప్రాంతాలను సమస్యాత్మకంగా వైద్యశాఖ అధికారులు గుర్తించారు. భారీ వర్షాలు,వరదల సమయంలో ఈ గ్రామాలు తరచుగా ప్రధాన రహదారుల నుంచి తెగిపోతుంటాయి.ఉట్నూర్ రెవెన్యూ డివిజన్‌లో 120 గిరిజన గ్రామాలు,ఆదిలాబాద్ డివిజన్‌లో 81 గిరిజన తండాలు ఉన్నాయి.

వర్షమొస్తే చాలు పొంగుతున్న వాగులు
ఆదిలాబాద్ జిల్లాలో ఏటా సాధారణ వర్షపాతం 110 సెంటీమీటర్లు నమోదు అవుతుంటుుంది. వర్షమొస్తే చాలు సిరికొండ మండలం కన్నాపూర్ తండా, బజార్ హత్నూర్ మండలం గిర్జాయి, ఉమార్ధ, ఇంద్రనగర్, మోర్కండి, మాడగూడ, గోకొండ, కొత్తపల్లి, బుర్కపల్లి, గులాబ్ తండడా, నేరడిగొండ మండలం రేంగన్ వాడి, లక్ష్మీపూర్, సేవాదాస్ నగర్, గాజిలి, గాంధారి, తలమడుగు మండలం తొక్కిగూడ, కొత్తూరు, చిట్యాల బోరి,భీంపూర్ మండలంలోని అంతర్ గావ్, కరంజి, గోముత్రి, రాజుల వాడి,కరన్ వాడి,టేకడీ రాంపూర్ ఉట్నూరులోని వంకతుమ్మ, నర్సాపూర్ తదితర గిరిజనగ్రామాలకు వాగులు పొంగటంతో రాకపోకలు నిలిచిపోతుంటాయి.

నాలుగు గిరిజన జిల్లాల్లో...
తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు ప్రధాన గిరిజన ప్రాంతాల్లోని మారుమూల అటవీ గ్రామాలు, గుట్టలపై ఉన్న గ్రామాల్లో గర్భిణులు ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలంటే వర్షాకాలంలో పొంగుతున్న వాగులు, వంకలు దాటడం కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, వరంగల్ జిల్లా ఏటూరునాగారం, ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మన్ననూర్ ఐటీడీఏల ఆధ్వర్యంలో గర్భిణులైన గిరిజన మహిళల కోసం ప్రత్యేకంగా ప్రసవ నిరీక్షణ గదులను వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసింది.ఈ కేంద్రాల ఏర్పాటు వల్ల మారుమూల గిరిజన గర్భిణులు సుఖ ప్రసవం అయ్యేలా తమ వైద్య బృందాలు చూస్తున్నాయని డాక్టర్ నాయక్ వివరించారు.

ప్రసవానికి ముందు గర్భిణుల తరలింపు
ప్రసవానికి వారం పదిరోజుల ముందు గిరిజన గర్భిణులను గుర్తించి వారిని ముందుగా బర్త్ వెయిటింగ్ రూంలకు తరలిస్తున్నారు. ఇలా నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ నాయక్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఈ కేంద్రాల పనితీరుపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు,గిరిజన సంఘాల నేతలతో మాట్లాడి ప్రత్యేక స్టోరీ ఇవ్వగలను.

ప్రసవానికి 10 రోజుల ముందు గర్భిణుల తరలింపు
వర్షాకాలంలో గిరిజన గర్భిణులను రక్షించడానికి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవ నిరీక్షణ గదులు ఏర్పాటు చేశారు. మారుమూల అటవీ గ్రామాల్లో వాగులు, వంకలు, కొండలు, గుట్టలు దాటాక తండాల్లో నివాసముంటున్న గిరిజన గర్భిణులను వారి ప్రసవ తేదీకి కనీసం 10 రోజుల ముందు ఈ కేంద్రాలకు తరలించి వైద్యులు పర్యవేక్షించనున్నారు.వర్షాకాలంలో గిరిజన గర్భిణులను రక్షించడానికి జనన నిరీక్షణ గదులు ఏర్పాటు చేశామని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రసవ నిరీక్షణ గదులు
వర్షాకాలంలో ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేని గిరిజన గర్భిణుల మరణాలను నివారించడానికి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవ నిరీక్షణ గదులు ఏర్పాటు చేశారు.అడవుల్లోని మారుమూల, వరదలకు గురయ్యే ప్రాంతాల నుంచి వచ్చిన గర్భిణీల కోసం ఆదిలాబాద్ జిల్లాలో అంకోలి, బజార్‌హత్నూర్, బేలా, భీమ్‌పూర్, గుడిహత్నూర్, హస్నాపూర్, జైనథ్, ఝరి, ఇంద్రవెల్లి, పిట్టబొంగరం, శ్యాంపూర్,సోనాల మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 13 ప్రసవ నిరీక్షణ గదులను ఏర్పాటు చేశారు.ఈ కేంద్రాల్లో మొత్తం 40 పడకలను గర్భిణుల కోసం సిద్ధం చేశారు.

ఎడ్ల బండ్లలోనూ గర్భిణుల తరలింపు
బోథ్, ఉట్నూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS)లో ప్రసవ నిరీక్షణ గదులను ప్రారంభించారు. మారుమూల గ్రామాల నుంచి గర్భిణులను సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించడానికి అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచామని ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీకాంత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వరదలు రాకపోకలకు ఆటంకం కలిగించే సందర్భాల్లో, మహిళలను వారి ఇళ్ల నుంచి ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లడానికి ఎడ్ల బండ్లను కూడా ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.

బర్త్ వెయిటింగ్ రూముల్లో సౌకర్యాలు
ఉట్నూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నాలుగు బర్త్ వెయిటింగ్ రూముల్లో గర్భిణులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ గదుల్లో గర్భిణుల కోసం మంచాలు, దోమతెర, అటాచ్డ్ టాయిలెట్‌ ఏర్పాట్లు చేశారు. గదుల బయట గర్భిణుల సహాయకులు నివాసముండటానికి ఏర్పాట్లు చేశారు.వారికి శుద్ధి చేసిన తాగునీటి సౌకర్యం కల్పించారు. తెలంగాణలోని సుదూర ఏజెన్సీ గ్రామాల గిరిజన గర్భిణులకు ప్రసవ నిరీక్షణ గదులు ఒక వరం లాంటిదని చెప్పవచ్చు.


Tags:    

Similar News