మనేకాగాంధీ జోక్యంతో కుక్కను చంపిన యువకుడిపై కేసు

కుక్కను చంపినందుకు ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. కేంద్ర మాజీ మంత్రి మనేకాగాంధీ ఫోన్ కాల్‌తో పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2024-10-18 12:47 GMT

కరీంనగర్ పట్టణంలోని వెంకటేశ్వర దేవాలయం సమీపంలోని కూరగాయల మార్కెట్ ప్రాంతంలో తనతోపాటు ప్రజలను కరుస్తుందని ఓ వీధికుక్కను అజాజ్ అనే దుకాణదారుడు చంపాడు.

- ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని కరీంనగర్ లోని స్ట్రే యనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన జంతు హక్కుల కార్యకర్త ఎ గౌతమ్ కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుక్క కళేబరానికి పోస్టు మార్టం చేయించారు. మొదట కుక్కను చంపిన వ్యక్తిపై కేసు నమోదు చేసేందుకు వన్ టౌన్ పోలీసులు నిరాకరించారు.

- దీంతో గౌతమ్ ఈ విషయాన్ని సాక్షాత్తూ కేంద్ర మాజీ మంత్రి మనేకా గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు. అంతే మనేకాగాంధీ కరీంనగర్ పోలీసులకు ఫోన్ లో మాట్లాడారు. మనేకాగాంధీ జోక్యంతో పోలీసులు అజాజ్ పై జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. వీధి కుక్కలు పిల్లల్ని చంపినా కేసు నమోదు చేయని పోలీసులు,కుక్కను చంపిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది.


కుక్క కరిచిందనే కోపంతోనే...
కూరగాయల మార్కెట్ లో దుకాణం నడుతున్న అజాజ్ ను గతంలో ఈ కుక్క కరిచిందనే కోపంతోనే దానిపై పగ పెంచుకొని దాన్ని చంపాడని స్థానికులు చెప్పారు. అజాబ్ నే కాకుండా పలువురిని ఈ కుక్క కరిచిందని స్థానికులు పేర్కొన్నారు.

కుక్కలను చంపితే స్పందిస్తున్న మనేకాగాంధీ
దేశంలో ఎక్కడ కుక్కలే కాదు జంతువులను చంపితే వాటిపై మాజీ మంత్రి మనేకాగాంధీ స్పందించి కేసు నమోదు చేసే దాకా పోరాడుతున్నారు. గతంలోనూ పంజాబ్‌లోని కపుర్తల సమీపంలోని దండుపూర్ గ్రామానికి చెందిన హర్‌బన్స్ సింగ్ కుమారుడు గుర్జిందర్ సింగ్ కుక్కల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాడని మేనకా గాంధీ ఎక్స్ లో పేర్కొన్నారు.గుర్జిందర్ సింగ్ తన కారు కుక్క మీద నుంచి పోనిచ్చాడు. ఫలితంగా ఆ కుక్క విపరీతమైన బాధతో మూలుగుతూ అరగంటలోనే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కూడా గతంలో మనేకాగాంధీ కేసు పెట్టించారు.


Tags:    

Similar News