‘మరో ఉద్యమానికి సిద్ధం కావాలి’.. మాదిగలకు మందకృష్ణ పిలుపు

ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారంటూ మందకృష్ణ మాదిగ మండిపడ్డారు.

Update: 2024-10-17 14:21 GMT

ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారంటూ మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. తమ హక్కులను సాధించుకోవడం కోసం మాదిగలు, ఉపకులాల వారు మరో ఉద్యమానికి సిద్ధం కావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఎస్సీ వర్గీకరణ చేయకుండా నియామక పత్రాలు అందించడం కోసం కాంగ్రెస్, సీఎం సన్నాహాలు చేశారని, ఇది మాదిగలను, ఉపకులాల వారిని అణచివేతకు గురిచేయడమేనంటూ మందకృష్ణ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తెలంగాణ ముందుంటుందని చెప్పిన సీఎం, అమలు విషయంలో చాలా వెనక ఉంటుందని చెప్పడం మరిచినట్లున్నారంటూ చురకలంటించారు. వర్గీకరణ చేపట్టడంలో ఇంతటి జాప్యానికి గల కారణాలేంటో చెప్పాలని సీఎంను కోరారు. ఇది మాదిగలకు అన్యాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రణాళిక ప్రకారం చేస్తున్న జాప్యమే తప్ప అనుకోకుండా జరుగుతున్నది కాదని అనుమానం వ్యక్తం చేశారు. అలాకాని పక్షంలో ఎందుకు జాప్యం జరిగిందో సీఎం రేవంత్ రెడ్డి వివరించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌కు నిద్రలేకుండా చేస్తాం..

మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తామని మందకృష్ణ చెప్పారు. అందులో భాగంగా భారీగా నిరసనలు, మహాసభలు నిర్వహిస్తామని వెల్లడించారు. ‘‘మాదిగల మహాసభలు,నిరసనలు, రథయాత్ర, బల ప్రదర్శనతో కాంగ్రెస్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తాం. కాంగ్రెస్ అధిష్టానానికి గాని, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్‌కు గాని ఎస్సీ వర్గీకరణ విషయంలో చిత్తశుద్ధి లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రంలో గాని, ఇటు రాష్ట్రంలో గాని వేసిన కమిషన్లు వాటి సిఫార్సులు ఎక్కడికి పోయాయి?’’ అని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ అమలు చేయడం రాదు..

‘‘కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు వేస్తుంది కానీ కమిషన్ల సిఫార్సులు మాత్రం అమలు చేయదు. కాంగ్రెస్ ప్రభుత్వాల విషయాల్లో ఇలాంటి ఉదాహరణాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు వేసిన కమిషన్ కూడా నమ్మశక్యం కాదు అని మాదిగలు బలంగా నమ్ముతున్నాం. వర్గీకరణ చేపడితేరేవంత్ రెడ్డి తమ ప్రయోజనాలు కోల్పోతామన్న భయంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి విషయంలో మాదిగలంతా కలిసి వర్గీకరణ కోసం పోరాడాలి. మాలలు వర్గీకరణను అడ్డుకోవాలి అనే అంశంతో తమ స్వప్రయోజనాలను కాపాడుకునే కుట్ర కోణం దాగుంది’’ అని విమర్శించారు.

రేవంత్ సర్కార్‌లో భయం

‘‘ఎస్సీ వర్గీకరణ చేపడితే మాదిగ మాలలు అందరూ కలిసి మళ్లీ ఒకసారి తమ ఉమ్మడి ప్రయోజనాల కోసం ఉద్యమిస్తారని భయం రేవంత్ రెడ్డి సర్కార్‌లో ఉంది. రేవంత్ రెడ్డి హామీలు ఇవ్వడంలో ఎంత దిట్టో ఆ హామీలను అమలు చేయకుండా మోసం చేయడంలో కూడా అంతకన్నా అందవేసిన చేయి. కేంద్రంలో,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు, ఇక్కడ ఉన్న డబ్బు గల కొంతమంది నాయకులు,టీవీ చానల్స్ తమ డబ్బు అధికారాన్ని ఉపయోగించి వర్గీకరణ జరిగితే తమ ఉనికిని అధికారాన్ని కోల్పోతామన్న భయంతో వర్గీకరణ అంశాన్ని అడ్డుకుంటున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భవిష్యత్ కార్యాచరణ ప్రకటన అప్పుడే

‘‘అందుకే ఎం ఆర్ పి ఎస్ ఆధ్వర్యంలో నిన్న నిజామాబాద్ కేంద్రంగా నిర్వహించిన మాదిగల కార్యాచరణ సమావేశం లో పలు అంశాలు చర్చించి మాదిగల భవిష్యత్తు కార్యాచరణను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రకటిస్తున్నాం. నవంబర్ నెలలో మొదట మహాసభలు, తరువాత నిరసనలు, రథయాత్రతో 21తేదీ హైదరాబాద్ కేంద్రంగా మాదిగల మహాబల ప్రదర్శనను చేపడతాం. మాదిగల బల ప్రదర్శన ఏ రూపం తీసుకుంటుందో దానికి రేవంత్ రెడ్డి సర్కారు మాత్రమే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నాం’’ అని సర్కార్‌కు వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే వర్గీకరణ తర్వాత ఉద్యోగాల నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుందని, వర్గీకరణ అమలు చేయడం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ సీఎం రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో మాదిగలు ఎవరూ లేరని, పోరాడి తమ హక్కులను సాధించుకుంటామని మందకృష్ణ మండిపడ్డారు.

ఇంతకీ రేవంత్ ఏమన్నారంటే..

‘‘న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఎస్సీ జనాభా లెక్కలకు సంబంధించి 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలి. ఏకసభ్య కమిషన్‌కు అవసరమైన సమాచారాన్ని అన్ని విభాగాలు అందించాయి. ఈ విషయంలో సమాచారం ఇవ్వడంలో ఏ విభాగం కూడా జాప్యం చేయకూడదు. ఈ సమాచారం అందేలా చూసే బాధ్యత సీఎస్‌దే. ఈ ఏకసభ్య కమిషన్ పది జిల్లాల్లో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నాం’’ అని సీఎం వివరించారు. ఎస్సీ వర్గీకరణ బాధ్యతల కోసం వన్ మ్యాన్ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా వర్గీకరణ జరగాలని రేవంత్ చెప్పారు. కమిషన్ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా అవసరమైన ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. వర్గీకరణపై సవివరమైన రిపోర్టు వచ్చిన తర్వాతే ఉద్యోగాల నియామకాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ చెప్పారు. గడువులోగా కమిషన్ వర్గీకరణ రిపోర్టును ఇవ్వాలని సీఎం గట్టిగా చెప్పారు.

మందకృష్ణ ఇచ్చిన వార్నింగ్ ఇదే..

ఎస్సీ వర్గీకరణ లేకుండా ఈ నెల 11న ఉపాధ్యాయ ఉద్యోగ నియామక పత్రాలు అందించాలని సర్కార్ చూసిందని మందకృష్ణ చెప్పారు. ఇలానే చేస్తే రేవంత్ రెడ్డి.. మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్బంగానే ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలు అన్ని సమావేశమై భవిస్యత్ కార్యాచారణపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఇదేంటని అడిగిన కొందరు ఎమ్మెల్యేలతో మాల సామాజిక వర్గానికి చెందని ఖర్గు, కొప్పుల రాజు ఆగ్రహానికి గురై పదవి పోగోట్టుకోవాలా? అని రేవంత్ అన్నారని, అవసరమైతే అతి త్వరలోనే ఆ ఎమ్మెల్యేల పేర్లు కూడా బయట పెడతానని మందకృష్ణ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఎస్సీ వర్గీకరణ జరగకుండా ఉద్యగాల విషయంలో ముందుకు వెళ్లొద్దని ఆయన హెచ్చరించారు.

Tags:    

Similar News