Mahesh Kumar Goud | ‘రాజకీయ మనుగడ కోసమే కేటీఆర్, కవిత, హరీష్ తపన’

హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వేళయింది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఉర్రూతలూగుతున్నాయి.;

Update: 2025-01-30 12:07 GMT

బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, కవిత.. రాజకీయ ఉనికి కోల్పోతున్నారా? పొలిటికల్ మైలేజీ కోసం తనసకలాడుతున్నారా? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అవునన్న సమాధానమే వినిపిస్తోంది. అధికారంతో పాటు రాజకీయ మనుగడను కూడా వారు కోల్పోయారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాలను ఉద్దేశించి వారు చేస్తున్న వ్యాఖ్యలు, నిర్వహిస్తున్న ధర్నాలు, సమావేశాలు అన్నీ కూడా రాజకీయ మనుగడను కాపాడుకోవడం కోసమేనని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వేళయింది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఉర్రూతలూగుతున్నాయి. విస్తృత ప్రచారం కోసం శ్రేణులు రంగంలోకి దించుతున్నాయి. ప్రత్యర్థులను ఓటమిపాలు చేసేలా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న మున్సిపల్ ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేది కాంగ్రెస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ మేయర్ పదవిని కాంగ్రెస్ మరోసారి కైవసం చేసుకుంటుందని వెల్లడించారు. రిజర్వేషన్ల పెంపు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

గ్రేటర్‌పై ఫోకస్ పెట్టాం

‘‘హైదరాబాద్ లో కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. గ్రేటర్ మీద దృష్టి పెట్టాం. GHMC లో అత్యధిక సీట్లు గెలిచి.. మేయర్ పీఠం మరోసారి కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి తెచ్చిన నిధులు.. ప్రాజెక్టులు ఎన్ని..? కానీ ఇవ్వాళ బీజేపీ కార్పొరేటర్లు బిక్షాటన చేస్తుండటం విడ్డూరం. గాంధీ కలలు కన్న సమానత్వం కోసం పథకాలు అందిస్తున్నాం. ప్రతిపక్షాలు కుల గణనను ఎన్ని విధాల అడ్డుకోవాలని చూసినా పూర్తి చేశాం. ఫిబ్రవరి 5న కుల గణన రిపోర్ట్ క్యాబినెట్ సబ్ కమిటీ.. క్యాబినెట్‌కి అందజేస్తుంది. రిజర్వేషన్ పెంపు పై క్యాబినెట్ లో చర్చించి.. లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణ మీద నిర్ణయం తీసుకుంటుంది’’ అని తెలిపారు.

‘‘కాంగ్రెస్ దూరదృష్టి తో విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులు పెట్టాం. బీఆర్ఎస్ హయంలోనే రియల్ ఎస్టేట్ పడిపోయింది.. దానిని మా ప్రభుత్వం గాడిన పెడుతుంది. కుల గణన స్వతంత్ర భారతదేశంలోనే చరిత్రాత్మకం. అధికారిక యంత్రాంగానికి క్లారిటీ లేక స్కీం లు ఆలస్యం అవుతుంది. స్పీకర్ ఉద్దేశ్యం కూడా అదే. బీఆర్ఎస్ మాదిరి హామీలు అమలు చేయకుండా వదిలి వేయం. ఆలస్యం అయినా ఒక్కొక్కటి అమలు చేస్తాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పటికే ముగ్గురు అభ్యర్థుల పేర్లతో అధిష్టానానికి నివేదిక ఇచ్చాం. రాహుల్ గాంధీ సభ ఫిబ్రవరి 2వ వారంలో సూర్యాపేట జిల్లాలో నిర్వహించబోతున్నాం’’ అని చెప్పారు.

‘‘ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారిక నివాసంలో సీఎం ఫోటోతో పాటు.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే ఫోటోలు పెట్టుకోవాలని సూచిస్తున్నాం. రాజగోపాల్ రెడ్డి వాఖ్యలు వక్రీకరించారు. కేసీఆర్ పదేళ్లు పాలించాడు.. ఉద్యమ నాయకుడిగా ఆయన్ను ప్రజలు అభిమానిస్తారు. కానీ పాలన పదేళ్లు గాడిన పెట్టలేకపోయారు. అధికారం దుర్వినియోగం చేశారు. వైఎస్ఆర్‌కు ఉన్నంత అభిమానులు ఎవ్వరికి లేరు. అన్ని సౌకర్యాలు ఉన్న పాత సెక్రటేరియట్ ఎందుకు కేసీఆర్ కూల్చారు. సమయాభావం దృష్టిలో పెట్టుకొని సీసీసీ,సీఎం నివాసంలో సమీక్షలు చేస్తున్నారు అందులో తప్పేం ఉంది. పదేళ్లలో కేసీఆర్ చేసిన రుణమాఫీ సొమ్ము ఎంత..? రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన రుణమాఫీని కంపేర్ చేసి చూడండి. ఫాం హౌస్ పాలన కోరుకునేది దొరలు మాత్రానే. కేటీఆర్, హరీష్ రావు, కవిత రాజకీయ ముఖచిత్రంలో ఉండేందుకు.. అసిత్వం కోసం కామెంట్స్ చేస్తున్నారు’’ అని విమర్శించారు.

Tags:    

Similar News