Mahesh kumar Goud | ‘రాజకీయాలు పక్కనపెట్టి కేంద్రాన్ని నిలదీద్దాం’

బడ్జెట్‌లో కొన్ని రాష్ట్రాలకే అధిక నిధులు కేటాయించడం ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని అన్నారు మహేష్ కుమార్.;

Update: 2025-02-02 15:00 GMT

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఎటువంటి నిధులు కేటాయించకపోవడం రాష్ట్రంలో తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. ఈ అంశంపై తెలంగాణ రాజకీయ నేతలు తీవ్ర అసంతృప్తి, అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం కావాలనే తెలంగాణపై వివక్ష చూపిస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న కారణంతోనే తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణలోని రాజకీయ నాయకులకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బడ్జెట్‌లో తెలంగాణను మరవడంపై కేంద్రాన్ని నిలదీయాలని, అందుకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. వార్హిక బడ్జెట్‌లో కొన్ని రాష్ట్రాలకే అధిక నిధులు కేటాయించడం ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని అన్నారు మహేష్ కుమార్. ట్యాంక్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఈ ధర్నాలో మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమెరికాను చూసి నేర్చుకోవాలి: మహేష్

‘‘5.1 శాతం GDP కి పన్ను మనం సమకూర్చితే.. 2.1 శాతం కూడా తెలంగాణ కు నిధులు కేంద్రం కేటాయించడం లేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు మొండి చేయి చూపిస్తుంది. అమెరికాను చూసి నేర్చుకోవాలి. ఎన్నికలు ఉన్న రాష్ట్రానికే నిధులు కేటాయించడం రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కాళ్ళు అరిగేలా మోదీని, కేంద్ర మంత్రులను కలిసినా నిధులు ఇవ్వలేదు. ఎక్కడికక్కడ వివక్ష చూపడం పట్ల కాంగ్రెస్ నిరసన చేస్తుంది’’ అని తెలిపారు.

మోడీపై యుద్ధం ప్రకటించాలి

‘‘కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులు రాజకీయాలు పక్కన పెట్టీ మోదీపై యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది. కొంత సేపు రాజకీయాలు పక్కన పెడదాం. మాతో రండి.. ఎందుకు ముఖం చాటుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం మీద యుద్ధం ప్రకటిద్దాం. యువ నాయకుడు సీఎం గా ఉన్నారు.. వీరిని అణగదొక్కాలని ఈ ధోరణి అనుసరిస్తున్నారు. కాంగ్రెస్‌తో పాటు సీపీఎం సీపీఐ మిగతా అన్ని పార్టీలు కలిసి రావాలి. తెలంగాణ రక్తం మీలో ఉంటే సీఎంతో కలిసి రండి. ఇవాల్టి ధర్నా కేవలం ఆరంభం మాత్రమే’’ అని చెప్పారు.

మీలో తెలంగాణ రక్తం లేదా

‘‘కేంద్రం దిగి వచ్చి నిధులు ఇచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. ఎన్నికల కోసం బడ్జెట్ పెట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీయడమే. బండి సంజయ్,కిషన్ రెడ్డి ఇద్దరు మంత్రులు ఉన్న ఎందుకు కొట్లాడటం లేదు. మీలో తెలంగాణ రక్తం లేదా..? తెలంగాణ మీద ప్రేమ ఉంటే మంత్రి పదవులకు రాజీనామా చేయండి. నిధుల కోసం కేంద్రం మీద ఒత్తిడి తెద్దాం’’ అని పిలుపిచ్చారు.

Tags:    

Similar News