Local Body Elections | త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు,ఈసీ కసరత్తు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది.130 మున్సిపాలిటీలలో మున్సిపల్ శాఖ స్పెషల్ ఆఫీసర్లను నియమించింది.;

Update: 2025-01-27 01:00 GMT

తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా? అంటే అవునని చెబుతున్నారు పలువురు రాజకీయ పరిశీలకులు. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో పాలకవర్గాల పదవీ కాలం ఆదివారంతో ముగిసింది. దీంతో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ డిపార్టుమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

- మున్సిపాలిటీలతోపాటు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ఇప్పటికే ముగిసింది. గ్రామ పంచాయతీలు, మండలపరిషత్, జిల్లాపరిషత్ ల పాలకవర్గాల పదవీ కాలం ఇప్పటికే ముగియడంతో ప్రత్యేక అధికారులను గతంలోనే నియమించారు.
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ నంబరు 15 పేరిట ఉత్తర్వుల జారీతో మున్సిపాలిటీల స్పెషల్ ఆఫీసర్ల పాలన ఆరంభమైంది. కరీంనగర్ కార్పొరేషన్ పదవీ కాలం ఈ నెల 28వతేదీ ముగియనున్నందున అక్కడ కూడా స్పెషల్ ఆఫీసరును నియమించనున్నారు.
- కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లోని కొత్తపల్లి, నస్పూర్ గ్రామాలను కార్పొరేషన్లలో విలీనం చేశారు. 128 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించేదాకా ఆయా పట్టణాలు స్సెషల్ ఆఫీసర్ల పాలనలోకి వచ్చాయి. మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించి, ఛైర్ పర్సన్లను ఎన్నుకునే దాకా ప్రత్యేక అధికారుల పాలన సాగనుంది.

జీహెచ్ఎంసీకి మరో ఏడాది పదవీ కాలం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు కొన్ని మున్సిపాలిటీల ఎన్నికలు 2021వ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగాయి. దీంతో ఈ కార్పొరేషన్లకు మరో ఏడాది పదవీ కాలం ఉంది. హైదరాబాద్ నగర శివార్లలోని 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

ఎన్నికల కోసమే నాలుగు సంక్షేమ పథకాలు
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఫిబ్రవరి నెల చివరిలో ఎన్నికలు జరపాలని ప్రతిపాదనలు రూపొందించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రేవంత్ ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా నాలుగు సంక్షేమ పథకాలను ఆదివారం ప్రారంభించింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈనెల 26న పలు పథకాల అమలు పూర్తి కాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే కోడ్ అమల్లోకి...
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తున్నందున కొత్త పథకాల అమలు కుదరదు. దీంతో ఎన్నికల షెడ్యూల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటోంది. ప్రభుత్వం పథకాల పూర్తి అమలు పూర్తికాకపోతే, స్థానిక ఎన్నికలను ఏప్రిల్ లేదా మే నెల దాకా వాయిదా వేయవచ్చని నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు ఆరంభించింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే స్థానిక సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.


Tags:    

Similar News