కుల గణన తర్వాతే ఎన్నికలు.. స్పష్టం చేసిన పొన్నం ప్రభాకర్

స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. స్థానిక ఎన్నికలపై ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

Update: 2024-10-12 09:47 GMT

స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. స్థానిక ఎన్నికలపై ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వాటిని ఎప్పుడు నిర్వహించేది కూడా వెల్లడించారు. దసరా పండగ సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎల్లమ్మతల్లి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగానే స్థానిక సంస్థలు ఎన్నికలు సహా పలు కీలక విషయాలపై ఆయన మాట్లాడారు. అతి త్వరలోనే రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వే నిర్వహించనున్నామని, దీని కోసమే జీవో 18ను తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. బీసీ కులగణను కూడా అతి త్వరలోనే చేపట్టనున్నట్లు కూడా ఆయన చెప్పారు. జీవో 18 సర్వేను 60 రోజులు కొనసాగుతుందని, ఆ నివేదికలను బట్టి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. అదే విధంగా బీసీ కులగణను పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. కుల గణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కుల గణను అనుకున్న విధంగా చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు కూడా ఆయన వివరించారు. అనుకున్న విధంగా 60 రోజులు సాగే సర్వేలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబ వివరాలను సేకరించేలా ఈ యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేసినట్లు ఆయన వివరించారు.

ఈ ఐదు అంశాలు కీలకం

కుల గణనను ఐదు అంశాలు కీలకంగా చేపట్టనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇందులో కులాన్ని కూడా కలిపితే ఆరు అంశాలు కీలకం కానున్నాయని ఆయన అన్నారు. ఈ సర్వేలో విద్య, ఉపాధి, సామాజిక, రాజకీయ, ఆర్థిక వెనకబాటుతనం వంటి అంశాలు ఉండనున్నాయని చెప్పారు. వీటికి సంబంధించి సమగ్ర డేటాను సేకరించనున్నామని, కులాల ఆధారంగా వివిధ వివరాలను సేకరటించడం ద్వారా ప్రతి కుటుంబానికి లభిస్తున్న అవకాశాలను అంచా వేస్తూ భవిష్యత్తులో వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వానికి సులభతరమవుతుందని ఆయన చెప్పారు. అంతే కాకుండా ఏ పథకం తీసుకురావడం ద్వారా అధిక మొత్తం ప్రజలకు మేలు చేయొచ్చు అన్న అంశాలను పరిశీలించడం, ఎక్కువ మందికి సంక్షేమం అందించే పథకాలు తీసుకురావడం ప్రభుత్వానికి తేలికగా మారుతుందని చెప్పారు.

వాటి అంచనా సులభం

బీసీ కులగణన ద్వారా ఆ సామాజిక వర్గంలోని ఓటర్ల సంఖ్య, వారి రాజకీయ స్థితిని అంచనా వేయగలుగుతామని, ఇది స్థానకి సంస్థల ఎన్నికలు(గ్రామ పంచాయతీ ఎన్నికలు)పై ప్రభావం చూపొచ్చు అని ఆయన అన్నారు. అదే విధంగా ఈ సర్వే ద్వారా సేకరించే సమాచారం భవిష్యత్తులో ప్రభుత్వానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుందని వివరించారు. ‘‘కులగణన విధానం కేవలం సంఖ్యలు, అంకెలు కాదు. సామాజిక అభివృద్ధికి మార్గదర్శకంగా ఉంటాయి. అందరికీ సమానమైన అవకాశఆలు కల్పించేలా పథకాలు రూపొందించడంలో ఈ కులగణన కీలకం కానుంది’’ అని ఆయన వివరించారు.

అధికార దుర్వినియోగమేనా..

కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండనున్నాయని, బీసీ కుల గణన ఎన్నికలపై ప్రభావం చూపుతుందని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం.. తమ రాజకీయ మైలేజీ పెంచుకోవడం వినియోగించుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే గ్రామ పంచాయతి ఎన్నికల ముందే కుల గణన చేసి.. ఓటర్లు టార్గెట్ చేసేలా ప్లాన్ చేస్తోందని కూడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమే అని, నిజంగా ప్రజలకు మేలు చేయాలని కాంగ్రెస్ అనుకుని ఉంటే.. ఈ పదినెలల్లోనే కులగణను ముగించి ఉండేదన్న వాదన వినిపిస్తోంది. మరి ఈ ప్రచారంపై కాంగ్రెస్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News