LIQER SALES RECORD | తెలంగాణలో పెరిగిన మద్యం విక్రయాల కిక్కు
తెలంగాణలో పండుగైనా, పబ్బమైనా, సంవత్సరాంతం అయినా, కొత్త సంవత్సరం అయినా మద్యం కిక్కు ఉండాల్సిందే. ఏ యేటి కా ఏడు మద్యం విక్రయాల జోరు పెరుగుతోంది.;
By : Shaik Saleem
Update: 2025-01-02 13:15 GMT
2023వ సంవత్సరం డిసెంబరు మాసాంతంలో రూ.410 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, 2024వ సంవత్సరం చివరి నాలుగు రోజుల్లోనే రెట్టింపు మద్యం విక్రయాలు సాగాయి. డిసెంబరు చివరి నాలుగు రోజుల్లోనే తెలంగాణ ప్రజలు రూ.926 కోట్ల మద్యాన్ని మందుబాబులు తాగారంటే లిక్కర్ కిక్ ఏమిటో విదితమవుతోంది.
- తెలంగాణలోని చాలా మందికి మద్యం తాగకుండా నూతన సంవత్సర వేడుక అసంపూర్తిగా ఉంటుంది. 2024 వ సంవత్సరం డిసెంబర్ 28వతేదీ నుంచి డిసెంబర్ 31వతేదీ రాత్రి వరకు రూ.926 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారుల గణాంకాలే చెబుతున్నాయి.
- డిసెంబర్ 30వతేదీన అత్యధికంగా రూ.402 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.దీంతో డిసెంబరు 31వతేదీన మద్యం విక్రయాలు 29.85 శాతం తగ్గాయి. డిసెంబర్ 29న రూ. 51 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. డిసెంబర్ 28వతేదీన లిక్కర్ విక్రయం రూ.191 కోట్లకు చేరింది. డిసెంబర్ నెల మొత్తం రూ. 3,615 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
- తెలంగాణ రాష్ట్రంలో విక్రయించే మద్యంలో 50 శాతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజలే తాగారని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.తెలంగాణలో డిసెంబర్ 2024లో 35,47,447 కేసుల మద్యం, 42,52,705 బీర్ కేసులు విక్రయించారని తేలింది.
దసరా సందర్భంగా మద్యం కిక్కు
తెలంగాణలో దసరా పండుగ మద్యం,ముక్క లేకుండా జరగదు. ఏటా బతుకమ్మ, దసరా సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు పెరుగుతున్నాయి.2024వ సంవత్సరంలో కేవలం 10 రోజుల వ్యవధిలో రూ.1,100 కోట్లకుపైగా మద్యాన్ని తాగేశారు.పది రోజుల్లో వెయ్యి కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.బార్‌లు,మద్యం దుకాణాలతో పాటుగా పబ్ లలోనూ లిక్కర్ అమ్మకాలు పెరిగాయి.
మద్యం ఆదాయం రైతుభరోసాకు...
తెలంగాణలో మద్యం విక్రయాలు పెరగడంతో సర్కార్ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది. మద్యం అమ్మకాల్లో ఎప్పటిలాగే హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.నూతన సంవత్సరం వేడుకల పేరిట అర్ధరాత్రి దాకా మద్యం దుకాణాలకు అనుమతులిచ్చి మద్యం విక్రయాలను పెంచారు.మద్యం అమ్మకాల ద్వారా భారీగా వచ్చిన ఆదాయాన్ని రైతు భరోసాకు ఉపయోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
ప్రత్యేక అనుమతులతో రూ. 56.46 లక్షల ఆదాయం
నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేక అనుమతుల ద్వారా ఎక్సైజ్ శాఖకు ఈ ఏడాది భారీ ఆదాయం సమకూరింది. 2024 వ సంవత్సరం 31వతేదీన 287 ఈవెంట్లకు అనుమతులు ఇచ్చారు. వీటి ద్వారా రూ.56.46 లక్షల ఆదాయం సమకూరిందని ఎక్సైజ్ శాఖ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే 243 అనుమతులు ఇచ్చినట్టు అధికారులు చెప్పారు. తెలంగాణలోని జిల్లాల్లో 44 అనుమతులు ఇచ్చారు. ఈవెంట్ అనుమతుల్లోను గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్సైజ్ శాఖకు ఆదాయం పెరిగింది.