అడవుల్లో వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్నదిలా...

మండుతున్న ఎండలతో అడవుల్లోని చెరువులు, కుంటలు, వాగులు, చెలిమలు ఎండిపోయాయి. దాహార్తితో అల్లాడుతున్న వన్యప్రాణులకు అటవీశాఖ అధికారులు మంచినీరందిస్తున్నారు.;

Update: 2025-04-01 12:22 GMT
అమ్రాబాద్ అడవిలోని నీటి కుంటలో నీరు తాగుతున్న జింకలు (ఫోటో : ఫారెస్ట్ కెమెరా ట్రాప్ చిత్రం)

వేసవికాలం రావడంతో మండుతున్న ఎండలతో తీవ్ర మంచినీటి కొరతతో ప్రజలే కాదు అడవుల్లోని వన్యప్రాణులు కూడా అల్లాడుతున్నాయి. నల్లమల అడవుల్లోని కొండలు, గుట్టలతో కూడిన అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని సహజసిద్ధంగా ఉన్న చెరువులు, కుంటలు ఈ వేసవిలో ఎండిపోయాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని పులులు, ఇతర వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు వీలుగా అటవీశాఖ అధికారులు అడవుల్లో నీటి కుంటలు,సాసర్ పిట్లు, సోలార్ మోటార్లు, చెక్ డ్యామ్ లు, నీళ్ల తొట్టెలు ఏర్పాటు చేశారు. అడవుల్లోని నీటి కుంటలు, సిమెంటు తొట్టెలను ఏర్పాటు చేసి ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని నింపుతూ వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్నారు. వేసవికాలంలో అడవిలోని వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు సోలార్ మోటార్లు ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ విధానంలో పనిచేస్తున్న ఈ సోలార్ మోటార్ల ద్వారా దట్టమైన అడవుల్లోని కుంటల్లోకి నీరు చేరుతుంది.




 తెలంగాణలో పెరిగిన వేడిగాలులు

తెలంగాణ రాష్ట్రంలో వేడిగాలులతోపాటు ఉష్ణోగ్రతలు పెరిగాయి.రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో హీట్ వేవ్ పెరుగుతాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అధికారి ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలే కాకుండా అడవుల్లోని వన్యప్రాణులు కూడా అల్లాడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.



 నీటి కొరతతో జనవాసాల్లోకి వన్యప్రాణులు

అడవుల్లో చెరువులు, కుంటలు ఎండిపోవడంతో వన్యప్రాణులు తాగేందుకు మంచినీరు కొరవడినాయి. దీంతో దాహార్తితో అల్లాడుతున్న కోతులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు అటవీ సమీప గ్రామాల్లోకి వచ్చే ప్రమాదం ఏర్పడింది.నీటి కోసం జనవాసాల్లోకి వస్తున్న జింకలు, దుప్పులు, కనుజులు మృత్యువాత పడుతున్నాయి. జంతువులు తాగేందుకు అడవిలో నీరు దొరికితే అవి జనవాసాల్లోకి రావని అటవీశాఖ అధికారి కారం శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.వన్యప్రాణుల దాహార్తి తీర్చడం ద్వారా మానవ-జంతు సంఘర్షణను తగ్గించేందుకు ప్రాధాన్యమిస్తున్నామని ఆయన వివరించారు.



 అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో...

అమ్రాబాద్ పులుల అభయారణ్యాన్ని 4 చదరపు కిలోమీటర్ల గ్రిడ్‌లుగా విభజించి కృత్రిమ నీటి వనరులను ఏర్పాటు చేశారు.అడవుల్లో సాసర్ బావులు, సోలార్ బోర్ బావులు, పెర్కోలేషన్ ట్యాంకులు నిర్మించారు.సోలార్‌ మోటారుతో ఆటోమేటిక్ గా పనిచేసే బోర్‌వెల్స్ ఏర్పాటు చేశారు. ఈ బోరు ద్వారా సాసర్ పిట్‌ల నింపుతున్నామని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అధికారి దేవజా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అమ్రాబాద్ అడవుల్లో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు తాము వందకు పైగా సోలార్ బోర్లు వేశామని చెప్పారు. సాసర్ పిట్లు, నీటి కుంటలను ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా నీటిని నింపి వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్నామని దేవజా వివరించారు. జూన్ నెలవరకు అడవుల్లో వన్యప్రాణులు తాగేందుకు నీటిని తాము సరఫరా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

వన్యప్రాణులెన్నో...
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 80 రకాల వన్యప్రాణులున్నాయి.పులి, చిరుతపులి, అడవి కుక్క, తోడేలు,నక్క, అడవి పిల్లి, మచ్చల పిల్లి, అడవి పంది,చిరుతపులి నాలుగు కొమ్ముల జింక, సాంబార్ జింకలున్నాయి. వీటితో పాటు అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో 303 పక్షి జాతులున్నాయి.ఈగల్స్, పావురాలు, పావురాలు, కోకిలలు, వడ్రంగిపిట్టలు, డ్రోంగోలు, బుల్బుల్స్, ఫ్లవర్ పెకర్స్, గ్రే హార్న్ బిల్, సన్‌బర్డ్స్, స్విఫ్ట్‌లు, కింగ్‌ఫిషర్లు, గుడ్లగూబలు, బార్బెట్‌లు, గాలిపటాలు, మినివెట్‌లు, పార్ట్రిడ్జ్‌లు, మైనాలు, థ్రష్‌లు, వార్‌బ్లర్‌లు ఉన్నాయి. పక్షులే కాకుండా అత్యంత విషపూరిత పాములు,ఊసరవెల్లి, ఇండియన్ కొండచిలువలున్నాయి. ఈ టైగర్ రిజర్వ్‌లో 100 రకాల సీతాకోకచిలుకలున్నాయని అమ్రాబాద్ ఫారెస్ట్ డీఎఫ్ఓ గోపిడి రోహిత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



 కవ్వాల్ టైగర్ జోన్‌లో నీటికి కటకట

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ పులుల అభయారణ్యంలో వాగులు, నీటి కుంటలు ఎండిపోయాయి. వాగులు కూడా ఎండిపోవడంతో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు వాగులపై రాళ్లు, ఇసుక, మట్టితో చెక్ డ్యామ్ లు కట్టి నీటిని నిల్వ చేస్తున్నారు. కవ్వాల్ ఫారెస్టులో 187 కుంటలను ట్రాక్టరు ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. కవ్వాల్ ఫారెస్టులో జంతువుల దాహం తీర్చేందుకు సోలార్ పంపుల ద్వారా నీటి కుంటలను నింపుతున్నామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కారం శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



ఖమ్మం అడవుల్లో...

ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం, కిన్నెరసాని, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు అడవుల్లో కుంటలు, చెలిమలు, వాగులు ఎండిపోవడంతో వన్యప్రాణులకు నీటికి కటకట ఏర్పడింది. వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అడవుల్లో 591 చెక్ డ్యామ్ లు, 861 సాసర్ పిట్లు, 402 పెద్ద నీటి కుంటలు, 379 చిన్న నీటి కుంటలు, 100 సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేశామని ఖమ్మం జిల్లా అటవీ శాఖ అధికారి కిష్ణాగౌడ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.


Tags:    

Similar News