కృష్ణానదిలో లాంచీలో విహరిద్దాం, నల్లమల అటవీ అందాలు తిలకిద్దాం

గల గల పారుతున్న కృష్ణా నది నీటిలో,పచ్చనిచెట్లు, కొండలు,గుట్టలు,దీవులతో ఉన్న నల్లమల అందాలను తిలకిస్తూ సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీలో విహార యాత్ర సాగనుంది.

Update: 2024-10-25 12:51 GMT

కృష్ణానదిలో లాంచీలో విహరిస్తూ ప్రకృతి అందాలను తిలకించేందుకు వీలుగా తెలంగాణ పర్యాటక శాఖ వీకెండ్ లో రెండు రోజుల పాటు టూర్ కు ప్రణాళిక రూపొందించింది. నీటి ప్రవాహంతో కళకళ లాడుతున్న కృష్ణానదిలోని శ్రీశైలం బ్యాక్ వాటర్ లో విహారానికి నవంబరు 2వతేదీ నుంచి టూర్ ప్యాకేజీ చేపట్టనున్నట్లు పర్యాటక శాఖ లాంచీ మేనేజరు శివకృష్ణ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

- సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణానికి రాష్ట్ర పర్యాటక శాఖ సన్నాహాలు చేసింది. నాలుగేళ్ల తర్వాత కృష్ణానదిలో లాంచీ విహారాన్ని పర్యాటక శాఖ ప్రారంభించనుంది. భద్రాచలం ప్రాంతంలోని పేరంటాల పల్లి లాంచీ యాత్రను పోలేలా 2018వ సంవత్సరంలో సోమశిల- శ్రీశైలం లాంచీ విహారం ప్రారంభించారు. కరోనా వల్ల ఈ విహార యాత్రకు బ్రేకు పడింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఈ విహార యాత్ర ఆరంభం కానుంది. దీంతో హైదరాబాద్ నగర వాసులు ఈ లాంచీ యాత్ర కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



 శ్రీశైలం-సోమశిల లాంచీ ప్రయాణం నవంబర్ 2 నుంచి

హైదరాబాద్ నగరానికి 190 కిలోమీటర్ల దూరంలోని సోమశిల నుంచి లాంచీ విహార యాత్ర నవంబరు 2వతేదీ నుంచి ప్రారంభం కానుంది. వీకెండ్స్ శని, ఆదివారాల్లో ఈ లాంచీ ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఆరుగంటల పాటు సాగే లాంచీ ప్రయాణం పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించనుంది.

సోమశిల టు శ్రీశైలం
సోమశిల నుంచి శ్రీశైలంకు 4.00 గంటలకు వెళ్లాక, పర్యాటకులు అక్కడ దేవాలయంలో దర్శనం చేసుకొని రాత్రి బస చేస్తారు. అనంతరం రెండో రోజు ఉదయం 9.00గంటలకు శ్రీశైలంలో లాంచీలో బయలుదేరి సోమశిలకు మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకుంటారు. కృష్ణానదిలో 120 కిలోమీటర్ల దూరం లాంచీలో ప్రయాణం సాగనుంది.

కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు
కృష్ణానదిలో ఏసీ లాంచీలో పర్యాటకుల విహారం కనువిందు చేయనుంది. సోమశిల అందాలను చూసి పర్యాటకులు పరవశిస్తున్నారు. లాంచీలో అమరగిరి ద్వీపాన్ని పర్యాటకులు తిలకిస్తారు. అలా లాంచీలో వెళుతూ కల్వకుర్తి లిఫ్ట్, పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అందాలను చూస్తూ విహరించవచ్చు. ఆ తర్వాత తీయలతిప్ప ద్వీపం, అంకాలమ్మగుడి, అక్కమ్మదేవి దేవాలయాలను చూస్తూ లాంచీ సాగుతోంది. లాంచీ ప్రయాణంలో పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, గుట్టలతో అలరారుతున్న నల్లమల అటవీ ప్రాంతం అందాలను చూస్తూ పర్యాటకులు పరవశించి పోతున్నారు.

పర్యాటకుల ఆసక్తి
సోమశిల-శ్రీశైలం లాంచీ విహార యాత్రలో పాల్గొనేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. నవంబరు 2వతేదీన ప్రారంభం కానున్న ఈ యాత్రలో పాల్గొనేందుకు చాలామంది పర్యాటకులు బుకింగ్ చేసుకున్నారని తెలంగాణ పర్యాటక శాఖ లాంచీ మేనేజరు శివకృష్ణ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.


Tags:    

Similar News